ఇది కదా గెలుపంటే

ABN , First Publish Date - 2020-12-30T07:06:37+05:30 IST

జట్టులోని బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ లేడు.. ప్రధాన పేసర్‌ గాయపడ్డాడు. మరో పేసర్‌ మధ్యలోనే వైదొలిగాడు. అయినా ఉన్న కాస్త వనరులనే తెలివిగా సద్వినియోగం చేసుకుంటూ తాత్కాలిక

ఇది కదా గెలుపంటే

భారత్‌ చిరస్మరణీయవిజయం

రెండో టెస్టులో ఆసీస్‌ చిత్తు 

డిసెంబరు 19.. తమ టెస్టు చరిత్రలోనే అత్యల్ప స్కోరుకు ఆలౌట్‌..

డిసెంబరు 29.. ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం..

సరిగ్గా 10 రోజుల విరామంలోనే టీమిండియా పుంజుకున్న తీరిది.కమ్‌ బ్యాక్‌ అంటే ఇదీ అనేలా.. దెబ్బతిన్న పులి పంజా 

ఎంత శక్తివంతంగా ఉంటుందో చాటి చెప్పింది. 

జట్టులోని బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ లేడు.. ప్రధాన పేసర్‌ గాయపడ్డాడు.  మరో పేసర్‌ మధ్యలోనే వైదొలిగాడు. అయినా ఉన్న కాస్త వనరులనే తెలివిగా సద్వినియోగం చేసుకుంటూ తాత్కాలిక కెప్టెన్‌ రహానె జట్టును నడిపించిన తీరు అమోఘం. బౌలర్ల అద్వితీయ ప్రదర్శనను నిరాశపర్చకుండా.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఫలితంగా ఏ గడ్డపై అవమానకర ఓటమి ఎదుర్కొందో.. అక్కడే భారత జట్టు సగర్వంగా తలెత్తుకుంది. అంతేకాదు.. ఈ ఏడాది టీమ్‌కు దక్కిన ఏకైక విజయం కూడా ఇదే.


మెల్‌బోర్న్‌: నాలుగు టెస్టుల సిరీ్‌సలో భారత జట్టు ఆల్‌రౌండ్‌ షోతో కదం తొక్కింది. తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకుంటూ ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మంగళవారం నాలుగో రోజు 70 పరుగుల ఛేదన కోసం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ 15.5 ఓవర్లలో రెండు వికెట్లకు అన్నే పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించింది. దీంతో సిరీ్‌సలో 1-1తో నిలవడంతో పాటు టెస్టు చాంపియన్‌షి్‌పలో 30 పాయింట్లు సాధించింది. ఈ మైదానంలో భారత్‌కిది వరుసగా రెండో టెస్టు విజయం. గిల్‌ (35 నాటౌట్‌), రహానె (27 నాటౌట్‌) అజేయంగా నిలిచారు. అంతకుముందు ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 103.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్‌ (45), కమిన్స్‌ (22) పోరాడారు. సిరాజ్‌కు మూడు, జడేజా.. బుమ్రా, అశ్విన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రహానె నిలిచాడు.


‘తోక’ పోరాటం:

133/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించగా..టెయిలెండర్లు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో ఆసీస్‌ మిగిలిన నాలుగు వికెట్లకు మరో 67 పరుగులు జోడించింది. ఆరంభంలో గ్రీన్‌, కమిన్స్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. పాత బంతితో మూడు ఓవర్లు వేసిన బుమ్రా ఎలాంటి ఇబ్బంది పెట్టలేకపోయాడు. దీంతో కెప్టెన్‌ రహానె కొత్త బంతి వచ్చేవరకు అతడిని తాజాగా ఉంచేందుకు పక్కనబెట్టాడు.

ఈ ప్రయోగం ఫలించి ఓ బౌన్సర్‌తో కమిన్స్‌ వికెట్‌ను బుమ్రా పడగొట్టాడు. దీంతో ఏడో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పేసర్లు అదనపు బౌన్స్‌తో ఇబ్బంది పెట్టారు. ఇదే క్రమంలో గ్రీన్‌ను సిరాజ్‌ ఓ అద్భుత బంతితో వెనక్కి పంపగా.. స్వల్ప విరామంలోనే లియోన్‌ (3)నూ అవుట్‌ చేశాడు. చివర్లో స్టార్క్‌ (14 నాటౌట్‌) డిఫెన్సివ్‌ ఆటతీరుతో విసిగించి స్కోరును 200కి చేర్చాడు.


గిల్‌ దూకుడు:

70 పరుగుల లక్ష్యంతో లంచ్‌ బ్రేక్‌ అనంతరం భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. అయితే ఇదేమంత పెద్ద స్కోరు కాకపోయినా అడిలైడ్‌ పరాభవం ఇంకా తాజాగానే ఉండడంతో అందరి మదిలో కాస్త సందేహం నెలకొంది. దీనికి తగ్గట్టుగానే మయాంక్‌ (5), పుజార (3) 19 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో ఒక్కసారిగా ఒత్తిడి నెలకొన్నప్పటికీ యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఎలాంటి బెరుకు లేకుండా బ్యాట్‌ ఝుళిపించాడు.

వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు రాబడుతూ విజయంపై ధీమా కల్పించాడు. దీంతో ఓవర్‌కు 4 పరుగులకు పైగా రన్‌రేట్‌తో స్కోరు దూసుకెళ్లింది. అటు రహానె క్లాసిక్‌ డ్రైవ్స్‌తో ఆకట్టుకోగా రెండో సెషన్‌లోనే మ్యాచ్‌ ముగిసింది. 14వ ఓవర్‌లో రహానె క్యాచ్‌ను లాంగాన్‌లో స్టార్క్‌ వదిలేసినా అప్పటికే భారత్‌ విజయం ఖాయమైంది.




స్కోరుబోర్డు


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 195, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 326

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: వేడ్‌ (ఎల్బీ) జడేజా 40; బర్న్స్‌ (సి) పంత్‌ (బి) ఉమేశ్‌ 4; లబుషేన్‌ (సి) రహానె (బి) అశ్విన్‌ 28; స్మిత్‌ (బి) బుమ్రా 8; హెడ్‌ (సి) మయాంక్‌ (బి) సిరాజ్‌ 17; గ్రీన్‌ (సి) జడేజా (బి) సిరాజ్‌ 45; పైన్‌ (సి) పంత్‌ (బి) జడేజా 1; కమిన్స్‌ (సి) మయాంక్‌ (బి) బుమ్రా 22; స్టార్క్‌ (నాటౌట్‌) 14; లియాన్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 3; హాజెల్‌వుడ్‌ (బి) అశ్విన్‌ 10; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 103.1 ఓవర్లలో 200 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-4, 2-42, 3-71, 4-98, 5-98, 6-99, 7-156, 8-177, 9-185, 10-200. బౌలింగ్‌: బుమ్రా 27-6-54-2; ఉమేశ్‌ 3.3-0-5-1; సిరాజ్‌ 21.3-4-37-3; అశ్విన్‌ 37.1-6-71-2; జడేజా 14-5-28-2.


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) పెయిన్‌ (బి) స్టార్క్‌ 5; గిల్‌ (నాటౌట్‌) 35; పుజార (సి) గ్రీన్‌ (బి) కమిన్స్‌ 3; రహానె (నాటౌట్‌) 27; మొత్తం: 15.5 ఓవర్లలో 70/2. వికెట్ల పతనం: 1-16, 2-19. బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-20-1; కమిన్స్‌ 5-0-22-1; హాజెల్‌వుడ్‌ 3-1-14-0; లియాన్‌ 2.5-0-5-0; లబుషేన్‌ 1-0-9-0.


  భారత్‌ తరఫున మూడు ఫార్మాట్లలోనూ 50+ మ్యాచ్‌లు ఆడిన మూడో క్రికెటర్‌గా జడేజా నిలిచాడు. గతంలో ధోనీ, విరాట్‌ కోహ్లీ ఈ ఫీట్‌ సాధించారు. 


అత్యుత్తమ విజయాల్లో ఒకటి

ప్రపంచ క్రికెట్‌లో గొప్ప కమ్‌బ్యాక్‌ విజయాల్లో ఇదీ ఒకటిగా నిలుస్తుంది. 36 పరుగులకు కుప్పకూలిన మూడు రోజులకే మరో మ్యాచ్‌కు సిద్ధమై గెలవడం అద్భుతం. మెల్‌బోర్న్‌ చేరగానే రెండో టెస్టును ఎలా ఎదుర్కోవాలో ప్రణాళిక రచించాం. కెప్టెన్‌ రహానె ఆటను ఎంత పొగిడినా తక్కువే. కఠిన పరిస్థితిలో బ్యాటింగ్‌ చేసి జట్టును గెలిపించాడు.                                       -

కోచ్‌ రవిశాస్త్రి 




ఆస్ట్రేలియాలో భారత్‌ టెస్ట్‌ విజయాలు

 ఎక్కడ ఎప్పుడు ఎలా

మెల్‌బోర్న్‌   1977-78 (డిసెంబరు-జనవరి) 222 పరుగులతో 

సిడ్నీ 1978 జనవరి ఇన్నింగ్స్‌ 2 పరుగులతో

మెల్‌బోర్న్‌ 1981 ఫిబ్రవరి 59 పరుగులతో

అడిలైడ్‌     2003 డిసెంబరు 4 వికెట్లతో

పెర్త్‌ 2008 జనవరి 72 పరుగులతో

అడిలైడ్‌ 2018 డిసెంబరు 31 పరుగులతో

మెల్‌బోర్న్‌ 2018 డిసెంబరు 137 పరుగులతో

మెల్‌బోర్న్‌ 2020 డిసెంబరు 8 వికెట్లతో 


Updated Date - 2020-12-30T07:06:37+05:30 IST