చైనాపై నేపాల్ మాజీ ప్రధాని బాబూరామ్ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-03-02T23:41:01+05:30 IST

భారత్-నేపాల్ సంబంధాలపై ప్రభావం చూపుతున్న చైనాపై

చైనాపై నేపాల్ మాజీ ప్రధాని బాబూరామ్ ఆగ్రహం

న్యూఢిల్లీ : భారత్-నేపాల్ సంబంధాలపై ప్రభావం చూపుతున్న చైనాపై నేపాల్ మాజీ ప్రధాన మంత్రి బాబూరామ్ భట్టారాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల కారణంగా సత్సంబంధాలు దెబ్బతినడం సరికాదన్నారు. ఉభయ దేశాల ప్రజల మధ్య సన్నిహిత సత్సంబంధాలు ఉన్నాయని చెప్తూ, ఇరు దేశాలు కలిసికట్టుగా కూర్చుని సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. నేపాల్ అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తడం దేశానికి శ్రేయస్కరం కాదన్నారు. 


హెల్త్ చెక్-అప్ కోసం న్యూఢిల్లీ వచ్చిన బాబూరామ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, భారత్, నేపాల్ మధ్య ఆర్థిక, చారిత్రక సత్సంబంధాలు ఉన్నాయన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య సన్నిహిత అనుబంధం ఉందని చెప్పారు. వేరొకరి వల్ల ఈ సంబంధాలు ఎలా ప్రభావితమవుతాయని ప్రశ్నించారు. ఇరు పక్షాలు కలిసి కూర్చుని, సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. నేపాల్ మొగ్గు చూపుతున్నది చైనా వైపు కాదని, తాము భారత దేశంతో సత్సంబంధాలను కోరుకుంటున్నామని తెలిపారు. నేపాల్ చైనా వైపు పూర్తిగా మొగ్గు చూపుతోందని భారత్‌లో కొందరు అభిప్రాయపడుతున్నారని, ఇది సరైన భావన కాదని అన్నారు. చారిత్రకంగా తాము భారత్‌కు సన్నిహితులమని తెలిపారు. చైనా కూడా తమకు మిత్ర దేశమేనని, అయితే భారత్‌తో ఉన్నంత సాన్నిహిత్యం చైనాతో తమకు లేదని చెప్పారు. హిమాలయాల అవతల చైనా బొంకుతుందని తెలిపారు. 


నేపాల్ మన దేశంలోని కొన్ని ప్రాంతాలను కలుపుకుంటూ కొత్తగా ఓ మ్యాపును గత ఏడాది ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ పరిణామాలతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్‌ను మన దేశం నేపాల్‌కు బహుమతిగా ఇచ్చింది. 


నేపాల్ అధికార పార్టీ నేతల మధ్య విభేదాల గురించి బాబూరామ్ మాట్లాడుతూ, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ రెండు వర్గాలుగా విడిపోవడం సరికాదన్నారు. ఇది దేశ ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదన్నారు. పార్లమెంటు రద్దయి, అస్థిరత్వం నెలకొన్న దశలో ఆ పార్టీ నేతలు వర్గాలుగా విడిపోవడం వల్ల దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. దేశంలో సుస్థిరతను తీసుకొచ్చేందుకు తాను అన్ని పార్టీలతో మాట్లాడతానని తెలిపారు. ప్రపంచ దేశాలు కోవిడ్-19 మహమ్మారి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న తరుణంలో నేపాల్‌లో ఆర్థిక అభివృద్ధి కోసం, భారత్-నేపాల్ మధ్య సత్సంబంధాల కోసం కృషి చేస్తానన్నారు. 


నేపాల్ పార్లమెంటును ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని నేపాల్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దిగువ సభను పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేపాల్ ప్రెసిడెంట్ బిద్యా దేవి భండారీ సోమవారం జారీ చేసిన ప్రకటనలో ఈ నెల 7న సాయంత్రం నాలుగు గంటలకు ప్రతినిధుల సభ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. 


Updated Date - 2021-03-02T23:41:01+05:30 IST