తొలిరోజు తడబ్యాటు

ABN , First Publish Date - 2020-02-22T10:40:49+05:30 IST

అరంగేట్ర పేసర్‌ కైల్‌ జేమిసన్‌ (3/38) ధాటికి న్యూజిలాండ్‌తో శుక్రవారం ప్రారంభమైన మొదటి టెస్ట్‌లో భారత్‌ విలవిల్లాడింది. కేవలం 122 పరుగులకే ఐదు

తొలిరోజు తడబ్యాటు

ఊహించిందే జరిగింది..అసలే బేసిన్‌ రిజర్వ్‌ మైదానంలో బలంగా  వీచే గాలులు..దానికితోడు దట్టంగా కమ్ముకొన్న మబ్బులు..ఆపై టాస్‌ ఓడడం..దాంతో సవాలు విసిరిన వికెట్‌పై బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో తొలిరోజు భారత్‌ తడబడింది..అయితే కివీస్‌ పేస్‌ ఆరంభ బౌలర్లు సౌథీ, బౌల్ట్‌ ప్రభావం చూపకపోయినా, మొదటి టెస్ట్‌ ఆడుతున్న పొడగరైన జేమిసన్‌ పిచ్‌పై పరిస్థితులను సద్వినియోగం చేసుకొని భారత్‌ను దెబ్బకొట్టాడు.. ఇక భారీ వర్షంతో టీ విరామం తర్వాత తొలిరోజు ఆట కొనసాగలేదు.


నిరాశపరిచిన కోహ్లీ

రహానె, పంత్‌పై ఆశలు

భారీ వర్షం

టీ తర్వాత ఆట రద్దు

భారత్‌ 122/5


వెల్లింగ్టన్‌: అరంగేట్ర పేసర్‌ కైల్‌ జేమిసన్‌ (3/38) ధాటికి న్యూజిలాండ్‌తో శుక్రవారం ప్రారంభమైన మొదటి టెస్ట్‌లో భారత్‌ విలవిల్లాడింది. కేవలం 122 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. మయాంక్‌ అగర్వాల్‌ (34) పర్లేదనిపించగా..పేలవమైన టెక్నిక్‌తో పృథ్వీ షా (16) నిరాశపరిచాడు. కెప్టెన్‌ కోహ్లీ (2), హనుమ విహారి (7) ఆదుకోలేకపోయారు. పుజార (16) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అజింక్యా రహానె (38), పంత్‌ (10) క్రీజులో ఉన్నారు. ఆరో వికెట్‌కు వీరిద్దరు జోడించింది 21 పరుగులే అయినా ప్రత్యర్థి బౌలర్లను తడబాటు లేకుండా ఎదుర్కోవడం విశేషం. రెండోరోజు ఉదయం సెషన్‌లో వీరిద్దరూ ఇదే తరహాలో ఆడాల్సి ఉంటుంది.


దట్టంగా మబ్బులు: టాస్‌ గెలిచిన కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ రెండో ఆలోచన లేకుండా ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. పిచ్‌పై పచ్చని పచ్చిక. తోడుగా మబ్బులతో కూడిన వాతావరణం. కానీ పేసర్లు సౌథీ, బౌల్ట్‌ మాత్రం మరీ ప్రమాదకరంగా కనిపించలేదు. ఓపెనర్‌ పృథ్వీ షా తొలుత దూకుడుగానే ఆడినా..ఐదో ఓవర్లో సౌథీ ఓ అవుట్‌ స్వింగర్‌తో అతడిని ఊరించాడు. పాదాలను ఏమాత్రం కదలించకుండానే ఆ బంతిని డ్రైవ్‌ చేయబోయిన షా అందుకు మూల్యం చెల్లిస్తూ (16) క్లీన్‌బౌల్డయ్యాడు. 


జేమిసన్‌ వస్తూనే..

తర్వాత మయాంక్‌కు, పుజార జత కలవగా..ఇద్దరూ అసలుసిసలు టెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడారు. మరీ మీదకు దూసుకొచ్చిన బంతులు మినహా మిగిలిన వాటిని వదిలేస్తూ కొనసాగారు. కానీ 12వ ఓవర్లో బౌలింగ్‌ దిగిన జేమిసన్‌.. పిచ్‌నుంచి లభిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని స్వింగ్‌, బౌన్స్‌తో హడలెత్తించాడు. అదనపు బౌన్స్‌ను రాబడుతూ తన మూడో ఓవర్లో ఓ ఫుల్‌లెంగ్త్‌ బంతితో కీపర్‌ వాట్లింగ్‌ క్యాచ్‌ ద్వారా పుజారాను పెవిలియన్‌కు చేర్చాడు. తద్వారా టెస్ట్‌ల్లో తొలి వికెట్‌ సాధించాడు. అదే ఊపులో, అదే తరహా బంతికి కోహ్లీని టేలర్‌ క్యాచ్‌ ద్వారా అవుట్‌ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 40/3. అనంతరం అగర్వాల్‌, రహానె జాగ్రత్తగా ఆడుతూ అడపాదడపా షాట్లు కొడుతూ భోజన విరామానికి స్కోరును 79/3కి చేర్చారు. విరామం తర్వాత అగర్వాల్‌ ను బౌల్ట్‌, విహారిని జేమిసన్‌ అవుట్‌ చేసి మరోసారి భారత్‌ను దెబ్బకొట్టారు. ఆపై రహానె, పంత్‌ మరో వికెట్‌ పడకుండా టీ విరామానికి వెళ్లారు. అయితే భారీ వర్షం కురవడంతో ఆపై ఆట సాధ్యం కాలేదు. 


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) సౌథీ 16, మయాంక్‌ అగర్వాల్‌ (సి) జేమిసన్‌  (బి) బౌల్ట్‌ 34, పుజార (సి) వాట్లింగ్‌ (బి) జేమిసన్‌  11, కోహ్లీ (సి) టేలర్‌ (బి) జేమిసన్‌  2, రహానె (బ్యాటింగ్‌) 38, హనుమ విహారి (సి) వాట్లింగ్‌ (బి) జేమిసన్‌  7, పంత్‌ (బ్యాటింగ్‌) 10, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం 55 ఓవర్లలో: 122/5 వికెట్లపతనం: 1/16, 2/35, 3/40, 4/88, 5/101 బౌలింగ్‌: సౌథీ 14-4-27-1, బౌల్ట్‌ 14-2-44-1, గ్రాండ్‌హోమ్‌ 11-5-12-0, జేమిసన్‌  14-2-38-3, అజాజ్‌ పటేల్‌ 2-2-0-0

Updated Date - 2020-02-22T10:40:49+05:30 IST