వికెట్‌ దూరంలో.. ప్చ్‌

ABN , First Publish Date - 2021-11-30T08:50:46+05:30 IST

ఇది కదా అసలైన టెస్టు మజా అంటే. ఆఖరి రోజు తొమ్మిది వికెట్లను పడగొట్టేందుకు భారత్‌.. అటు కాపాడుకునేందుకు కివీస్‌ చివరి బంతి వరకు పోరాడిన తీరు అత్యంత ఆసక్తిని రేపింది.

వికెట్‌ దూరంలో..  ప్చ్‌

భారత్‌కు నిరాశ

ఆఖర్లో రచిన్‌ రవీంద్ర పోరాటం

కివీస్‌తో తొలి టెస్టు డ్రా


ఇది కదా అసలైన టెస్టు మజా అంటే. ఆఖరి రోజు తొమ్మిది వికెట్లను పడగొట్టేందుకు భారత్‌.. అటు కాపాడుకునేందుకు కివీస్‌ చివరి బంతి వరకు పోరాడిన తీరు అత్యంత ఆసక్తిని రేపింది. వాస్తవానికి సెషన్ల వారీగా ఈ మ్యాచ్‌లో ఎన్ని మలుపులో.. లంచ్‌ బ్రేక్‌ వరకు వికెట్‌ కోల్పోని కివీ్‌సను రెండో సెషన్‌లో భారత్‌ దెబ్బతీసింది. ఇక చివరి సెషన్‌లో విజయానికి ఆరు వికెట్ల దూరంలో ఉండగా.. స్పిన్‌ త్రయం చెలరేగి ఏకంగా ఐదు వికెట్లను పడగొట్టింది. ఇంకేముంది... గెలుపు ఖాయమే అని అనుకుంటున్న దశలో టాప్‌ క్లాస్‌ స్పిన్‌ను ఎదుర్కొంటూ రచిన్‌ రవీంద్ర, ఎజాజ్‌ పటేల్‌ అడ్డుగోడలా నిలిచిన తీరు వహ్వా అనిపించక మానదు. అటు వెలుతురు కూడా మందగించడంతో భారత్‌కు నిరాశే మిగిలింది.


కాన్పూర్‌: భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య అత్యంత నాటకీయంగా సాగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. 284 పరుగుల ఛేదనకు సోమవారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పర్యాటక జట్టు 98 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి ఓటమి నుంచి తప్పించుకుంది. లాథమ్‌ (52) హాఫ్‌ సెంచరీ చేశాడు. కెరీర్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన రచిన్‌ రవీంద్ర (91 బంతుల్లో 2 ఫోర్లతో 18 నాటౌట్‌) 15.1 ఓవర్లపాటు క్రీజులో నిలవగా, మరో భారత సంతతి ఆటగాడు ఎజాజ్‌ పటేల్‌ (23 బంతుల్లో 2 నాటౌట్‌) విలువైన సహకారం అందించాడు. చివరి వికెట్‌ కోసం స్పిన్‌ త్రయం వైవిధ్యమైన బంతులు విసరగా.. కెప్టెన్‌ రహానె క్రీజు చుట్టూ తొమ్మిది మంది ఆటగాళ్లను మోహరించినా ఫలితం దక్కలేదు. జడేజాకు నాలుగు, అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌ నిలిచాడు.


తొలి సెషన్‌ కివీస్‌దే..

4/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరి రోజు ఇన్నింగ్స్‌ ఆరంభించిన కివీస్‌ నుంచి అనూహ్య ఆటతీరు ఎదురైంది. అంచనాలను తలకిందులు చేస్తూ నైట్‌వాచ్‌మన్‌ సోమర్‌విల్లే అసలైన బ్యాటర్‌గా ఆడాడు. అటు లాథమ్‌ తనదైన శైలిలో బ్యాటింగ్‌ చేశాడు. ఓపిగ్గా ఆడిన ఈ జోడీని విడదీసేందుకు రహానె బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. 31 ఓవర్లపాటు వేచిచూసినా తొలి సెషన్‌లో భారత్‌ వికెట్‌ సాధించలేకపోయింది.


దెబ్బతీసిన జడేజా

రెండో సెషన్‌ ఆరంభ ఓవర్‌లోనే భారత్‌కు బ్రేక్‌ లభించింది. తొలి బంతికే సోమర్‌విల్లేను ఉమేశ్‌ యాదవ్‌ అవుట్‌ చేయడంతో రెండోవికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు ఓపెనర్‌ లాథమ్‌ అర్ధసెంచరీ పూర్తయ్యాక అశ్విన్‌ చేతిలో బౌల్డ్‌ కావడంతో కివీస్‌ వికెట్ల పతనం ఆరంభమైంది. జడేజా ధాటికి 20 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ 5 వికెట్లను కోల్పోయింది. చివరి సెషన్‌లో ఓ దశలో 155/9 స్కోరుతో ఓటమి అంచున నిలిచింది. 


ఆ ఒక్క వికెట్‌ కోసం..

70వ ఓవర్‌లో రచిన్‌ క్రీజులోకి అడుగుపెట్టిన సమయంలో జట్టు స్కోరు 128/6. స్పిన్‌ ధాటికి ఓవైపు వికెట్లు పడుతున్నా తను మాత్రం చక్కటి డిఫెన్స్‌తో బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా వస్తున్న బంతులను అత్యంత జాగ్రత్తగా ఆడాడు. అయితే చూస్తుండగానే పరిస్థితి 155/9కి చేరింది. 90వ ఓవర్‌లో ఆఖరి బ్యాటర్‌ ఎజాజ్‌ బరిలోకి దిగాడు. అప్పటికి కనీసం తొమ్మిది ఓవర్లు ఉండడంతో భారత విజయంపై ఎవరికీ సందేహాలు లేవు. కానీ ఈ ఇద్దరూ ప్రతీ బంతిని పకడ్బందీగా ఆడారు. ఏమాత్రం అవకాశమివ్వకుండా మ్యాచ్‌ను చివరి వరకు తెచ్చారు. అశ్విన్‌ క్యారమ్‌ బంతులకు కూడా వీరు తగిన సమాధానమిచ్చారు. దీనికి తోడు 93వ ఓవర్‌ నుంచి అంపైర్లు లైట్‌ మీటర్‌ను పరీక్షించడం ఆరంభించారు. దీంతో ఆ ఒక్క వికెట్‌ పడుతుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. అక్షర్‌, జడేజా, అశ్విన్‌ ఇలా ముగ్గురూ వరుసగా బౌలింగ్‌ చేసినా కివీ్‌సను ఆలౌట్‌ చేయలేకపోయారు. చివరికి 98వ ఓవర్‌ అయ్యాక ఆట వీలు పడదని అంపైర్లు ప్రకటించడంతో భారత్‌ డ్రాతో సరిపెట్టుకోవాల్సివచ్చింది.


అశ్విన్‌ మరో రికార్డు

 భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు (419) తీసిన మూడో బౌలర్‌ గా అశ్విన్‌. ఈ క్రమంలో అతను హర్భజన్‌ (417)ను అధిగమించగా.. అనిల్‌ కుంబ్లే (619), కపిల్‌దేవ్‌ (434) ముందున్నారు. అలాగే ఈ ఏడాది ఎక్కువ టెస్టు వికెట్లు (44) తీసిన వారిలో షహీన్‌ అఫ్రీదితో కలిసి టాప్‌లో ఉన్నాడు.


ఇంతకు మించి ప్రయత్నించలేం..

‘కివీస్‌ అద్భుతంగా ఆడింది. విజయం కోసం మా శాయశక్తులా ప్రయత్నించాం. తొలి సెషన్‌ తర్వాత మేం పోటీలోకి వచ్చాం. ఇంతకు మించి ప్రయత్నించడానికి ఏమీ లేదనే నా అభిప్రాయం. ఇక చివర్లో నేను అంపైర్లతో వెలుతురు గురించే మాట్లాడాను. కానీ వారు ఓ నిర్ణయం తీసుకున్నాక మనం గౌరవించాల్సిందే’       

 - అజింక్యా రహానె


మైదాన సిబ్బంది ద్రవిడ్‌ నజరానా..

చక్కటి పిచ్‌ తయారు చేసిన గ్రీన్‌పార్క్‌ గ్రౌండ్‌ సిబ్బందికి టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ రూ. 35వేలు నజరానా అందజేశాడు. శివకుమార్‌ ఆధ్వర్యంలోని మైదాన సిబ్బందిని ద్రవిడ్‌ అభినందించడంతోపాటు ఆ మొత్తాన్ని వ్యక్తిగతంగా అతడు ఇచ్చాడని ఉత్తరప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం తెలిపింది. 


డ్రాను ‘రచిన్‌’చాడు

 వరుసగా 10 టెస్ట్‌ల్లో ఓటమనేదే లేకుండా సాగడం కివీస్‌ క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి. గత 10 మ్యాచ్‌ల్లో కివీస్‌ 8 నెగ్గి.. రెండు డ్రా చేసుకొంది.


భారత సంతతి కుర్రాళ్లు రచిన్‌ రవీంద్ర, ఎజాజ్‌ పటేల్‌ టీమిండియా విజయాన్ని అడ్డుకున్నారు. 9 వికెట్లు పడగొట్టిన భారత్‌.. మరో వికెట్‌ చేజిక్కించుకొంటే మ్యాచ్‌లో విజయం దక్కుతుంది. పరిస్థితులు చూస్తుంటే అది ఎంతోసేపు పట్టదనిపించింది. కానీ, చివరి అరగంట అత్యంత నాటకీయంగా గడిచింది. 8.4 ఓవర్లపాటు క్రీజులో నిలిచిన రవీంద్ర-పటేల్‌ జంట.. బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ముఖ్యంగా రచిన్‌.. వికెట్ల మధ్య గోడకట్టాడు. చుట్టూ ఫీల్డర్లను మోహరించిన రహానె.. ఎంత ఒత్తిడి పెంచినా రచిన్‌ ఏమాత్రం బెదరలేదు. ఆడుతున్నది తొలి టెస్టే అయినా.. మంచి సమయస్ఫూర్తిని కనబరిచాడు. 91 బంతులు ఎదుర్కొన్నా.. ఎక్కడా కంగారుపడకుండా రక్షణాత్మక ఆటతో ఆకట్టుకున్నాడు. దుర్భేద్యమైన అతడి డిఫెన్స్‌ను ఛేదించడానికి ఎంతో అనుభవం ఉన్న అశ్విన్‌, జడేజా తుదికంటా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మరో ఎండ్‌లో ఉన్న ఎజాజ్‌ కూడా బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేశాడు. టీమిండియా బౌలర్లు ఎంతగా భయపెట్టినా.. చాలా కూల్‌గా ఆడాడు. ఉచ్చులోకి చిక్కిన ‘కివీస్‌’ పిట్ట.. చిక్కినట్టే చిక్కి చేజారడంతో టీమిండియా నిరాశగా మైదానం వీడింది.


తగ్గని నొప్పి..కీపింగ్‌కు సాహా దూరం

మెడనొప్పి తగ్గకపోవడంతో వృద్ధిమాన్‌ సాహా ఐదోరోజూ కీపింగ్‌ చేయలేదు. దీంతో కేఎస్‌ భరత్‌ బరిలోకి దిగాల్సివచ్చింది. నాలుగో రోజు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 51/5 స్కోరుతో కష్టాల్లో ఉన్న దశలో సాహా (61 నాటౌట్‌) అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి జట్టును ఆదుకున్న సంగతి తెలిసిందే. 



భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 345 ఆలౌట్‌

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 296 ఆలౌట్‌

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 234/7 డిక్లేర్‌

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లాథమ్‌ (బి) అశ్విన్‌ 52; యంగ్‌ (ఎల్బీ) అశ్విన్‌ 2; సోమర్‌విల్లే (సి) గిల్‌ (బి) ఉమేశ్‌ 36; విలియమ్సన్‌ (ఎల్బీ) జడేజా 24; టేలర్‌ (ఎల్బీ) జడేజా 2; నికోల్స్‌ (ఎల్బీ) అక్షర్‌ 1; బ్లండెల్‌ (బి) అశ్విన్‌ 2; రచిన్‌ (నాటౌట్‌) 18; జేమిసన్‌ (ఎల్బీ) జడేజా 5; సౌథీ (ఎల్బీ) జడేజా 4; ఎజాజ్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 98 ఓవర్లలో 165/9. వికెట్ల పతనం: 1-3, 2-79, 3-118, 4-125, 5-126, 6-128, 7-138, 8-147, 9-155. బౌలింగ్‌: అశ్విన్‌ 30-12-35-3; అక్షర్‌ 21-12-23-1; ఉమేశ్‌ 12-2-34-1; ఇషాంత్‌ 7-1-20-0; జడేజా 28-10-40-4.

Updated Date - 2021-11-30T08:50:46+05:30 IST