కుర్రాళ్ల సమరోత్సాహం

ABN , First Publish Date - 2021-07-18T08:43:18+05:30 IST

టీమిండియాకే కాదు.. భారత ఫ్యాన్స్‌కు కూడా ఇది సరికొత్త అనుభవమే. కోహ్లీ, రోహిత్‌, బుమ్రాలాంటి స్టార్‌ ఆటగాళ్లు లేకుండా ధవన్‌ సారథ్యంలోని రెండో టీమ్‌ వన్డే సిరీస్‌కు సిద్ధమైంది.

కుర్రాళ్ల   సమరోత్సాహం

మధ్యాహ్నం 3 గంటల నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

టీ20 ప్రపంచకప్‌ బెర్త్‌ లక్ష్యంగా..

సత్తా చాటేందుకు సిద్ధం

నేటి నుంచి శ్రీలంకతో భారత్‌ వన్డే సిరీస్‌


టీమిండియాకే కాదు.. భారత ఫ్యాన్స్‌కు కూడా ఇది సరికొత్త అనుభవమే. కోహ్లీ, రోహిత్‌, బుమ్రాలాంటి స్టార్‌ ఆటగాళ్లు లేకుండా ధవన్‌ సారథ్యంలోని రెండో టీమ్‌ వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. దీంతో ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మెరికల్లాంటి యువ క్రికెటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఐపీఎల్‌ అనుభవంతో శ్రీలంకపై చెలరేగడంతో పాటు టీ20 ప్రపంచకప్‌ బెర్త్‌పై కన్నేశారు. అటు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆతిథ్య జట్టు ఏమేరకు పోటీనిస్తుందో చూడాలి!


కొలంబో: భారత నయా జట్టు యువ క్రికెటర్లతో ఉరకలేస్తోంది. శిఖర్‌ ధవన్‌ నేతృత్వంలో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీ్‌సల్లో సత్తా చూపాలనుకుంటోంది. దీంట్లో భాగంగా ఆదివారం స్థానిక ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో తొలి వన్డే జరుగనుంది. మరోవైపు భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇక యువ క్రికెటర్లకు లంక సిరీస్‌ అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచక్‌పనకు ఆడిషన్‌లాంటిదనుకోవచ్చు. అలాగే సరైన కాంబినేషన్‌ను పరిశీలించేందుకు కూడా ఈ ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లను టీమిండియా వినియోగించుకోనుంది. జట్టులో పది మంది వన్డే అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నా, అందరికీ చాన్స్‌ రావడం కష్టమేనని కోచ్‌ ద్రవిడ్‌ ఇదివరకే స్పష్టం చేశాడు. అటు శ్రీలంక నాలుగేళ్లలో పదో కెప్టెన్‌ షనక ఆధ్వర్యంలో బరిలోకి దిగుతోంది. ఇంగ్లండ్‌తో వైట్‌వాష్‌.. కీలక ఆటగాళ్లు లేకపోవడంతో భారత్‌పై ఒక్క మ్యాచ్‌ గెలిచినా అద్భుతమే అన్నట్టుగా లంకేయుల పరిస్థితి ఉంది. ఇరుజట్లకిది నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌. 


ఫేవరెట్‌గా..:

ఈ సిరీ్‌సలో భారతే ఫేవరెట్‌. ధవన్‌, పృథ్వీ షా ఓపెనర్లుగా రావడం ఖాయమే. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌, పేసర్‌ భువనేశ్వర్‌ తుది జట్టులో కచ్చితంగా ఉంటారు. ఇక కీలక మూడు, నాలుగో నెంబర్‌లో 360 డిగ్రీ షాట్లతో విరుచుకుపడే సూర్యకుమార్‌, మనీశ్‌ పాండేలకు ఎక్కువ చాన్సుంది. దేవ్‌దత్‌, రుతురాజ్‌ కూడా ఈ బెర్త్‌పై ఆశగా ఉన్నారు. లెగ్‌స్పిన్‌లో చాహల్‌కు జతగా రాహుల్‌ చాహర్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ చోటు కోసం సిద్ధంగా ఉన్నారు. కీపింగ్‌లో సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ మధ్య పోరు నెలకొంది. ద్రవిడ్‌ ఎవరివైపు మొగ్గు చూపుతాడో చూడాలి.


బలహీనంగా..:

యువ భారత్‌తో పోలిస్తే శ్రీలంక జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఈ రెండు సిరీ్‌సలకు అంతగా అనుభవంలేని 24 మందితో జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్‌లో బయో బబుల్‌ను అతిక్రమించినందుకు డిక్‌వెల్లా, గుణతిలక, మెండి్‌సపై సస్పెన్షన్‌ విధించగా కుశాల్‌ పెరీరా గాయపడ్డాడు. దీనికి తోడు ఇంగ్లండ్‌పై 0-3తో, బంగ్లాపై 1-2తో వన్డే సిరీ్‌సలను కోల్పోయి జట్టు పేలవ ఫామ్‌లో ఉంది. అయితే నెట్‌ ప్రాక్టీ్‌సలో వెన్నునొప్పితో బాధపడిన కీలక బ్యాట్స్‌మన్‌ ధనంజయ డిసిల్వ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం ఊరట కలిగించే విషయం.


జట్లు (అంచనా)

భారత్‌: ధవన్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీశ్‌ పాండే, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌, క్రునాల్‌, భువనేశ్వర్‌, సైనీ/దీపక్‌ చాహర్‌, కుల్దీ్‌ప/వరుణ్‌, చాహల్‌.


శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, నిస్సంక, భనుక, ధనంజయ డిసిల్వ, రాజపక్స, షనక(కెప్టెన్‌), హసరంగ, ఉడాన, సండకన్‌, చమీర, రజిత.


పిచ్‌, వాతావరణం: ప్రేమదాస స్టేడియం సహజంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. 2019లో ఇక్కడ చివరి వన్డే జరిగింది. మ్యాచ్‌ సాగుతున్నకొద్దీ స్పిన్నర్లకు చాన్స్‌ ఉండొచ్చు. ఆదివారం చిరు జల్లులకు ఆస్కారం ఉంది.

Updated Date - 2021-07-18T08:43:18+05:30 IST