ఆధిక్యమే లక్ష్యంగా..

ABN , First Publish Date - 2021-03-16T09:33:54+05:30 IST

లోపాలను సరిదిద్దుకుని అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకున్న భారత్‌ మరో విజయంపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం ఇంగ్లండ్‌తో మూడో టీ20లో తలపడనుంది...

ఆధిక్యమే లక్ష్యంగా..

  • ఆత్మవిశ్వాసంతో భారత్‌  
  • ఇంగ్లండ్‌తో మూడో టీ20 నేడు
  • రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో.. 


తొలి టీ20లో ఓటమికి భారత జట్టు గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది. రెండో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో చెలరేగి పర్యాటక ఇంగ్లండ్‌కు ఝలక్‌ ఇచ్చింది. పటిష్ఠమైన రిజర్వ్‌ బలంతో ఉన్న టీమిండియా యువ ఆటగాళ్లను పరీక్షిస్తూ సత్ఫలితాలనే అందుకుంటోంది. ఎదురుదాడికి దిగిన ఇషాన్‌ కిషన్‌ సత్తా చాటుకోగా.. సూర్యకుమార్‌ ఇంకా తన బ్యాటింగ్‌ పవర్‌ను చూపాల్సి ఉంది. నేటి మ్యాచ్‌లోనూ కోహ్లీ సేన పైచేయి సాధిస్తే.. నెంబర్‌వన్‌ ఇంగ్లండ్‌ మరింత ఒత్తిడిలో పడుతుంది. ఇక ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ రాక ఈసారి ఖాయంగానే కనిపిస్తోంది. 



అహ్మదాబాద్‌: లోపాలను సరిదిద్దుకుని అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకున్న భారత్‌ మరో విజయంపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం ఇంగ్లండ్‌తో మూడో టీ20లో తలపడనుంది. ఆదివారం  మ్యాచ్‌లో భారత బౌలర్లు స్లో బంతులతో ఇంగ్లండ్‌ను భారీస్కోరు చేయకుండా కట్టడి చేశారు. ఛేదనలో టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మిగతా పని కానిచ్చారు. దీంతో కోహ్లీసేన 7 వికెట్లతో నెగ్గి సిరీ్‌సను 1-1తో సమం చేసింది. ఇప్పుడు అదే జోష్‌తో మరో దెబ్బతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలన్న ఆలోచనలో ఉంది. అటు ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌లో చాంపియన్‌ తరహాలో ఆడినా, తర్వాత తేలిపోయింది. స్టార్‌ హిట్టర్లున్నా భారీషాట్లు ఆడలేకపోయారు. ఈసారి ప్రత్యర్థికి మరో విజయం ఇవ్వకూడదనే కసితో ఇంగ్లండ్‌ ఉంది.


రోహిత్‌ కమ్‌బ్యాక్‌!: ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ అంచనాలకు మించి రాణించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు రోహిత్‌ శర్మపై అందరి దృష్టీ నెలకొంది. అతడి విశ్రాంతి ముగియడంతో జట్టులోకి వచ్చే అవకాశముంది. దీంతో రెండు మ్యాచ్‌ల్లోనూ నిరాశపర్చిన రాహుల్‌పై వేటు పడుతుందేమో! ఒకవేళ మరో చాన్సివ్వాలనుకుంటే అతడిని మిడిలార్డర్‌లో ఆడించి, సూర్యకుమార్‌ను తప్పించొచ్చు. కెప్టెన్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావడం జట్టుకు ఎనలేని ఆత్మవిశ్వాసాన్నిస్తోంది. బౌలింగ్‌ విభాగంలో ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లు, ఓ ఆల్‌రౌండర్‌ ఫార్ములాకే కట్టుబడనున్నారు.


ఒత్తిడిలో పడ్డారు..: ఆదివారం మ్యాచ్‌లో చిత్తయిన తీరుతో ఇంగ్లండ్‌ ఆత్మపరిశీలనలో పడింది. ఆరంభంలో వారు ఆడిన తీరు చూస్తే స్కోరు సులువుగా 190 చేరుతుందనిపించింది. కానీ స్లో బంతులను ఆడడంలో విఫలమ వడం వారి స్కోరుపై ప్రభావం చూపింది. డెత్‌ ఓవర్లలోనూ బ్యాట్లు ఝుళిపించలేకపోయారు. ఈ ఫార్మాట్‌లో నెంబర్‌వన్‌ డేవిడ్‌ మలాన్‌పై ఉన్న భారీ అంచనాలను ఇప్పటి దాకా అతను అందుకోలేకపోయాడు. పవర్‌ప్లేలో అతడు నిదానంగా ఆడడం జట్టు ఫలితంపై పడింది. స్టోక్స్‌ కూడా బ్యాటింగ్‌లో నిరాశపరుస్తున్నాడు. జేసన్‌ రాయ్‌ మాత్రమే దూకుడుగా వెళుతున్నాడు. లెఫ్ట్‌ హ్యాండర్లు ఇషాన్‌, పంత్‌లను కట్టడి చేసేందుకు టామ్‌ కర్రాన్‌ స్థానంలో స్పిన్నర్‌ మొయిన్‌ అలీని ఆడించే ఆలోచనలో కెప్టెన్‌ మోర్గాన్‌ ఉన్నాడు.


జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌, ఇషాన్‌, కోహ్లీ (కెప్టెన్‌), పంత్‌, శ్రేయాస్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌, సుందర్‌, శార్దూల్‌, భువనేశ్వర్‌, చాహల్‌.

ఇంగ్లండ్‌: రాయ్‌, బట్లర్‌, మలాన్‌, బెయిర్‌స్టో, మోర్గాన్‌ (కెప్టెన్‌), స్టోక్స్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కర్రాన్‌, ఆర్చర్‌, రషీద్‌, జోర్డాన్‌.





Updated Date - 2021-03-16T09:33:54+05:30 IST