కివీస్.. కాచుకో

ABN , First Publish Date - 2021-03-07T09:49:56+05:30 IST

టెస్టు సిరీ్‌సలో భారత జట్టు తొలి మ్యాచ్‌ను ఓడితే.. ఇక నుంచి ప్రత్యర్థి ఆశలు వదులుకోవాల్సిందేనేమో.. ఇటీవల ఆస్ట్రేలియాను మట్టికరిపించిన తరహాలోనే సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను కూడా చిత్తుగా ఓడించింది...

కివీస్.. కాచుకో

  • ఐదేసి వికెట్లతో అశ్విన్‌, అక్షర్‌ హవా
  • ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో కోహ్లీ సేన విజయం 
  • ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 135
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 365 
  • ప్రపంచ టెస్టు చాంపియన్‌ ఫైనల్‌కు అర్హత


భారత జట్టు అమ్ముల పొదిలో తిరుగులేని స్పిన్‌ అస్త్రం మరోసారి అద్భుతం చేసింది.. గింగిరాలు తిరిగే బంతులను ఎదుర్కోవడంలో ఇంగ్లండ్‌ ఘోరంగా విఫలమైంది. అశ్విన్‌, అక్షర్‌ చెరో ఐదు వికెట్లు పంచుకోవడంతో చివరి టెస్టును భారత్‌ మూడు రోజుల్లోపే ముగించింది. అంతేకాదు.. ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో సాధించిన ఈ ఘన విజయంతో కోహ్లీ సేన ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్లోనూ అడుగుపెట్టింది. ఇక లార్డ్స్‌లో న్యూజిలాండ్‌ పనిబట్టడమే తరువాయి. మరోవైపు టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ జట్టు నెంబర్‌వన్‌గా నిలవడం ఇంకో విశేషం. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ 96 పరుగులతో నిలిచి అక్షర్‌తో శతక భాగస్వామ్యాన్ని అందించాడు.


అహ్మదాబాద్‌: టెస్టు సిరీ్‌సలో భారత జట్టు తొలి మ్యాచ్‌ను ఓడితే.. ఇక నుంచి ప్రత్యర్థి ఆశలు వదులుకోవాల్సిందేనేమో.. ఇటీవల ఆస్ట్రేలియాను మట్టికరిపించిన తరహాలోనే సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను కూడా చిత్తుగా ఓడించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీ్‌సను 3-1తో కైవసం చేసుకుంది. ఎప్పటిలాగే అశ్విన్‌ (5/47), అక్షర్‌ (5/48) జోడీ పర్యాటక జట్టును అయోమయంలోకి నెట్టడంతో ఒకటిన్నర సెషన్‌లోనే వారి రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది. ఫలితంగా చివరి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ బెర్త్‌ను కూడా ఖాయం చేసుకున్న భారత జట్టు లార్డ్స్‌లో జూన్‌ 18 నుంచి న్యూజిలాండ్‌తో తలపడనుంది. అంతకుముందు శనివారం మూడో రోజు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 114.4 ఓవర్లలో 365 పరుగుల భారీ స్కోరు సాధించింది. వాషింగ్టన్‌ సుందర్‌ (174 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 96 నాటౌట్‌), అక్షర్‌ (43) ఎనిమిదో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే చివర్లో సహచరులనుంచి సహకారం లేకపోవడంతో సుందర్‌ తొలి శతకానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఆ తర్వాత 160 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ 54.5 ఓవర్లలో 135 పరుగులకే పరిమితం కావడంతో, భారత్‌కు రెండో ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం రాలేదు. లారెన్స్‌ (50), రూట్‌ (30) మాత్రమే ఫర్వాలేదనిపించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రిషభ్‌ పంత్‌.. మొత్తం 32 వికెట్లతో మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా అశ్విన్‌ నిలిచారు.


సుందర్‌, అక్షర్‌ భాగస్వామ్యం: చక్కటి భాగస్వామ్యాలే విజయానికి సోపానాలుగా నిలుస్తాయనే మాటను చివరి టెస్టులో భారత ఆటగాళ్లు నిజం చేశారు. పంత్‌-సుందర్‌ల మధ్య ఏడో వికెట్‌కు 113 పరుగులు లభించినట్టుగానే మూడో రోజు ఆటలో సుందర్‌-అక్షర్‌ కలిసి ఎనిమిదో వికెట్‌కు 106 పరుగులు జోడించారు. 294/7తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించగా సుందర్‌-అక్షర్‌ ఆత్మవిశ్వాసంతో మరో 20 ఓవర్లపాటు ఇంగ్లండ్‌ను ఎదుర్కొన్నారు. ఆరంభంలోనే చెరో సిక్సర్‌తో జోరు ప్రదర్శించారు. వీరి వికెట్‌ను తీసేందుకు చెమటోడ్చుతున్న దశలో అక్షర్‌ రనౌట్‌తో వెనుదిరిగాడు. నాన్‌స్ట్రయికర్‌ ఎండ్‌ నుంచి లేని పరుగు కోసం కాస్త ముందుకెళ్లి తిరిగి వచ్చేలోపే రూట్‌ వికెట్లను పడగొట్టాడు. అప్పటికి సుందర్‌ 96 పరుగులతో ఉండగా సెంచరీ ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాతి ఓవర్‌లోనే ఇషాంత్‌, సిరాజ్‌లను స్టోక్స్‌ డకౌట్‌ చేయడంతో భారత్‌ ఆలౌటైంది.


పోరాటమే లేదు..: భారత లోయరార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అద్భుతంగా ఆడడంతో ఇంగ్లండ్‌ ఆటగాళ్లుకూడా బాగా ఆడి.. ఈసారి గట్టి స్కోరే సాధిస్తుందనిపించింది. కానీ ఆ జట్టు ఆటగాళ్లు మళ్లీ స్పిన్‌కే తడబడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐదో ఓవర్‌లోనే అశ్విన్‌ వరుస బంతుల్లో క్రాలే (5), బెయిర్‌స్టో (0)లను అవుట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ పరిస్థితి అర్థమైపోయింది. ఇక ఆ తర్వాత అక్షర్‌ ఓవర్‌లో గిల్‌ కాలికి తగిలి పైకి లేచిన బంతిని కీపర్‌ పంత్‌ అందుకోవడంతో సిబ్లే (3) ఆట ముగిసింది. అటు రూట్‌ మాత్రం అశ్విన్‌ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లతో ఆకట్టుకున్నాడు. కానీ స్టోక్స్‌ (2), పోప్‌ (15) వికెట్లను అక్షర్‌ పడగొట్టగా మరోవైపు లారెన్స్‌ (0), రూట్‌లను అశ్విన్‌ ఎల్బీ చేయడంతో లంచ్‌ బ్రేక్‌కు 91/6తో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరి సెషన్‌లో 22 ఓవర్లపాటు టెయిలెండర్లు ఫోక్స్‌ (13), బెస్‌ (2), లీచ్‌ (2)లతో కలిసి లారెన్స్‌ పోరాటం ప్రదర్శించాడు. అయితే అతడి అర్ధసెంచరీ ముగిశాక అశ్విన్‌ చేతిలో క్లీన్‌ బౌల్డ్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ తేడాతో చిత్తయ్యింది.





కెప్టెన్‌గా పైపైకి..

భారత జట్టు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనతలను సొంతం చేసుకుంటున్నాడు. బ్యాట్స్‌మన్‌గా రాణించలేకపోతున్నా జట్టును మాత్రం విజయవంతంగా నడిపిస్తున్నాడు.  స్వదేశంలో వరుసగా పదో టెస్టు సిరీస్‌ విజయం సాధిస్తూ రికీ పాంటింగ్‌ రికార్డును సమం చేశాడు. ఇక సొంతగడ్డపై కోహ్లీ టెస్టు విజయాల సంఖ్య 23కి చేరింది. దీంతో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా (22)ను అధిగమించగా.. స్మిత్‌ (30), పాంటింగ్‌ (29) మాత్రమే తనకన్నా ముందున్నారు.



13

2012 నుంచి సొంత గడ్డపై భారత జట్టు వరుసగా 13 టెస్టు సిరీస్‌లు గెలవడం విశేషం





1

టెస్టు సిరీస్‌ల్లో రెండుసార్లు 30+ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్‌. అలాగే ఐదు వికెట్లు తీయడం అతడి కెరీర్‌లో ఇది 30వసారి. 


1

 తొలిసారిగా ఓ సిరీస్‌లో భారత బౌలర్లు 25 మందిని ఎల్బీలుగా అవుట్‌ చేశారు.


3

కెరీర్‌లో ఎక్కువసార్లు (8) మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ దక్కించుకున్న మూడో ఆటగాడిగా అశ్విన్‌. మురళీధరన్‌ (11), కలిస్‌ (9) ముందున్నారు.


3

నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను ఓడాక సిరీస్‌ను గెలవడం భారత్‌కిది మూడోసారి. కనీసం మూడు టెస్టుల సిరీస్‌ను లెక్కలోకి తీసుకుంటే ఇది ఆరోసారి.



స్కోరుబోర్డు


ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 205

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: గిల్‌ (ఎల్బీ) అండర్సన్‌ 0; రోహిత్‌ (ఎల్బీ) స్టోక్స్‌ 49; పుజార (ఎల్బీ) లీచ్‌ 17; కోహ్లీ (సి) ఫోక్స్‌ (బి) స్టోక్స్‌ 0; రహానె (సి) స్టోక్స్‌ (బి) అండర్సన్‌ 27; పంత్‌ (సి) రూట్‌ (బి) అండర్సన్‌ 101; అశ్విన్‌ (సి) పోప్‌ (బి) లీచ్‌ 13; సుందర్‌ (నాటౌట్‌) 96; అక్షర్‌ (రనౌట్‌) 43; ఇషాంత్‌ (ఎల్బీ) స్టోక్స్‌ 0; సిరాజ్‌ (బి) స్టోక్స్‌ 0; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం: 114.4 ఓవర్లలో 365 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-0, 2-40, 3-41, 4-80, 5-121, 6-146, 7-259, 8-365, 9-365, 10-365. బౌలింగ్‌: అండర్సన్‌ 25-14-44-3; స్టోక్స్‌ 27.4-6-89-4; లీచ్‌ 27-5-89-2; బెస్‌ 17-1-71-0, రూట్‌ 18-1-56-0.

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలే (సి) రహానె (బి) అశ్విన్‌ 5; సిబ్లే (సి) పంత్‌ (బి) అక్షర్‌ 3; బెయిర్‌స్టో (సి) రోహిత్‌ (బి) అశ్విన్‌ 0; రూట్‌ (ఎల్బీ) అశ్విన్‌ 30; స్టోక్స్‌ (సి) కోహ్లీ (బి) అక్షర్‌ 2; పోప్‌ (స్టంప్‌) పంత్‌ (బి) అక్షర్‌ 15; లారెన్స్‌ (బి) అశ్విన్‌ 50; ఫోక్స్‌ (సి) రహానె (బి) అక్షర్‌ 13; బెస్‌ (సి) పంత్‌ (బి) అక్షర్‌ 2; లీచ్‌ (సి) రహానె (బి) అశ్విన్‌ 2; అండర్సన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 54.5 ఓవర్లలో 135 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-10, 2-10, 3-20, 4-30, 5-65, 6-65, 7-109, 8-111, 9-134, 10-135. బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-12-0; అక్షర్‌ 24-6-48-5; 

అశ్విన్‌ 22.5-4-47-5; సుందర్‌ 4-0-16-0.

Updated Date - 2021-03-07T09:49:56+05:30 IST