కరోనా సమ‌యంలోనూ భారత్​కు త‌గ్గ‌ని 'ఎన్నారైల‌ సొమ్ములు'

ABN , First Publish Date - 2021-05-13T18:40:56+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనా స‌మ‌యంలోనూ విదేశాల్లోని భారత ప్ర‌వాసులు 2020లో భారీగా న‌గ‌దు స్వ‌దేశానికి పంపించిన‌ట్లు తాజాగా వెలువ‌డిన‌ ప్ర‌పంచ బ్యాంక్ నివేదిక తెలియ‌జేస్తోంది.

కరోనా సమ‌యంలోనూ భారత్​కు త‌గ్గ‌ని 'ఎన్నారైల‌ సొమ్ములు'

వాషింగ్ట‌న్‌: మ‌హ‌మ్మారి క‌రోనా స‌మ‌యంలోనూ విదేశాల్లోని భారత ప్ర‌వాసులు 2020లో భారీగా న‌గ‌దు స్వ‌దేశానికి పంపించిన‌ట్లు తాజాగా వెలువ‌డిన‌ ప్ర‌పంచ బ్యాంక్ నివేదిక తెలియ‌జేస్తోంది. గ‌తేడాది విదేశాల్లోని ప్రవాసుల నుంచి భారత్‌కు 83 బిలియన్ డాలర్లు(భార‌త క‌రెన్సీలో రూ.6.11 లక్షల కోట్లు) అందిన‌ట్లు వ‌రల్డ్ బ్యాంక్ రిపోర్ట్ పేర్కొంది. అంత‌కుముందు ఏడాది (2019)తో పోలిస్తే ఇది 0.2శాతం త‌క్కువ‌. అయినా అత్యధిక విదేశీ ప్రవాసుల సొమ్మును అందుకుంటున్న దేశాల జాబితాలో భారత్ తొలిస్థానంలో నిలవ‌డం విశేషం. భార‌త్ త‌ర్వాతి స్థానాల్లో చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్ ఉన్నాయి.


ఇక మ‌హ‌మ్మారి దెబ్బ‌తో ప్రపంచ ఆర్థిక వ్య‌వస్థ సైతం కుదేలైన సమయంలోనూ భారత్​కు విదేశాల నుంచి ఎన్నారైలు పంపే న‌గ‌దు పెద్దగా తగ్గక‌పోవ‌డం విశేషం. ప్ర‌పంచ బ్యాంక్ రిపోర్టు ప్ర‌కారం 2020లో ప్రవాసుల నుంచి భార‌త్‌ 83 బిలియన్ డాలర్లను(రూ.6.11 లక్షల కోట్లు) అందుకోగా.. 2019లో 83.3 బిలియన్ డాలర్లు అందాయి. అంటే.. కేవ‌లం 0.2శాతం మాత్ర‌మే తగ్గాయి. అయితే, 2020లో గ‌ల్ఫ్ దేశం యూఏఈ నుంచి ఇండియాకు వచ్చే న‌గ‌దు మాత్రం 17శాతం మేర ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో అగ్రాజ్యం అమెరికాతో పాటు ఇతర దేశాల నుంచి వ‌చ్చిన సొమ్ములు పెర‌గ‌డం ఈ లోటును భర్తీ చేసింది.


భారత్​ తర్వాత అత్యధికంగా ప్రవాసీల సొమ్ము పొందుతున్న దేశంగా డ్రాగ‌న్ కంట్రీ చైనా నిలిచింది. 2020లో చైనాకు ఆ దేశ ప్ర‌వాసీల నుంచి 59.5 బిలియన్ డాలర్లు వ‌చ్చాయి. ఈ జాబితాలో భార‌త్‌, చైనా మొద‌టి రెండు స్థానాల్లో ఉంటే.. ఆ త‌ర్వాతి స్థానాల్లో మెక్సికో(42.8 బిలియన్లు), ఫిలిప్పీన్స్(34.9 బిలియన్లు), ఈజిప్ట్(29.6 బిలియన్లు), పాకిస్థాన్​ (26 బిలియన్లు), ఫ్రాన్స్(24.4 బిలియన్లు), బంగ్లాదేశ్(21 బిలియన్లు) ఉన్నాయి. కాగా, దాయాది పాక్‌కు 2020లో విదేశాల నుంచి చెల్లింపులు 17 శాతం మేర పెరగ‌డం గ‌మ‌నార్హం. సౌదీ, యూఏఈతో పాటు యూరోపియ‌న్ యూనియ‌న్ (ఈయూ) దేశాల‌ నుంచి వచ్చిన భారీ నగదు పాకిస్థాన్‌ను ఆదుకుంది.

Updated Date - 2021-05-13T18:40:56+05:30 IST