Abn logo
Sep 25 2021 @ 19:24PM

భారత్‌లో సంస్కరణలతో ప్రపంచ పరివర్తన : ఐరాసలో ప్రధాని

న్యూయార్క్ : భారత దేశం అభివృద్ధి చెందితే, ప్రపంచం కూడా ప్రగతి సాధిస్తుందని, భారత దేశంలో సంస్కరణలు అమలైతే, ప్రపంచం పరివర్తన చెందుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ధి అనేది సమ్మిళితంగా, అందరినీ కలుపుకునిపోయే విధంగా, సార్వత్రికంగా జరగాలన్నారు. అందరినీ సంరక్షించే విధంగా ఉండాలని చెప్పారు. ఆయన శనివారం ఐక్యరాజ్య సమితి సాధారణ సభ (యూఎన్‌జీఏ)లో మాట్లాడారు. 


భారత్ ప్రజాస్వామ్యం ప్రకాశమానం

న్యూయార్క్‌లోని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో 76వ యూఎన్‌జీఏ సెషన్‌ను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి భారత దేశం ప్రకాశవంతమైన ఉదాహరణ అని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 15న భారత దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుందన్నారు. భారత దేశ బలమైన ప్రజాస్వామ్యానికి విశిష్ట నిదర్శనం దేశంలోని వైవిద్ధ్యమని చెప్పారు. ‘ప్రజాస్వామ్యానికి తల్లి’గా పేరు పొందిన భారత దేశానికి తాను ప్రాతినిధ్యంవహిస్తున్నానని చెప్పారు. వేలాది సంవత్సరాల నుంచి భారత దేశపు అత్యంత గొప్ప సంప్రదాయం ప్రజాస్వామ్యమని తెలిపారు. శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి భారత దేశం గొప్ప ఉదాహరణ అన్నారు. ‘‘మా ప్రజాస్వామ్యం తన వైవిద్ధ్యంతో గుర్తింపు పొందింది’’ అని తెలిపారు. ప్రజాస్వామ్యం ఎంతో ఇవ్వగలదని, ఎంతో ఇచ్చిందని చెప్పారు. 


సమ్మిళిత అభివృద్ధి తప్పనిసరి

అభివృద్ధి అనేది సమ్మిళితంగా, అందరినీ కలుపుకునిపోయే విధంగా, సార్వత్రికంగా, అందరినీ సంరక్షించే విధంగా ఉండాలని చెప్పారు. ప్రపంచ ప్రగతి భారత దేశ అభివృద్ధితో ముడిపడి ఉందని చెప్పారు. భారత దేశంలో సంస్కరణలు అమలైతే ప్రపంచం పరివర్తన చెందుతుందన్నారు. 


ఉగ్రవాదంతో ముప్పును అర్థం చేసుకోవాలి

ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా తీసుకుని ఉగ్రవాదాన్ని వ్యాపింపజేయడానికి ఎవరినీ అనుమతించరాదని స్పష్టం చేశారు. తిరోగమన ఆలోచనలు, అతివాదం ప్రపంచంలో పెరుగుతున్నాయని, ఇది చాలా ప్రమాదకరమని చెప్పారు. ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద వ్యాప్తి కోసం ఉపయోగించుకోకుండా చూడటం తప్పనిసరి అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆఫ్ఘన్‌లోని మహిళలు, బాలలు, మైనారిటీలకు సహాయం అవసరమని తెలిపారు. మనం మన బాధ్యతను నెరవేర్చాలన్నారు. ఉగ్రవాదాన్ని రాజకీయ సాధనంగా వాడుకుంటున్న దేశాలు దానివల్ల తమకు కూడా అంతే సమానమైన ముప్పు ఉంటుందని అర్థం చేసుకోవాలన్నారు. 


సురక్షిత తాగునీరు

పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని, భారత దేశానికి వచ్చి, వ్యాక్సిన్లను తయారు చేయాలని అంతర్జాతీయ సంస్థలకు పిలుపునిచ్చారు. ప్రపంచంలో మొట్టమొదటి డీఎన్ఏ వ్యాక్సిన్‌ను భారత దేశం అభివృద్ధి చేసిందని చెప్పారు. దీనిని పన్నెండేళ్ళ వయసు పైబడినవారందరికీ ఇవ్వవచ్చునని తెలిపారు. 


కోవిడ్ మృతులకు నివాళులు

అంతకుముందు మోదీ, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా మరణించినవారికి నివాళులర్పించారు. గడచిన ఒకటిన్నరేళ్ళలో యావత్తు ప్రపంచం అత్యంత దయనీయమైన మహమ్మారిని ఎదుర్కొంటోందని చెప్పారు. వందేళ్ళలో ఇటువంటి తీవ్రమైన మహమ్మారి ఇదేనన్నారు. ఈ ప్రాణాంతక మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినవారందరికీ నివాళులర్పిస్తున్నానని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. 


ఇవి కూడా చదవండిImage Caption