కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ఐసీజే తీర్పు అమలులో పాక్ విఫలం : భారత్

ABN , First Publish Date - 2020-08-15T03:20:44+05:30 IST

భారత నావికా దళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ

కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ఐసీజే తీర్పు అమలులో పాక్ విఫలం : భారత్

న్యూఢిల్లీ : భారత నావికా దళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పును అమలు చేయడంలో ఇమిడియున్న ప్రధాన అంశాలను పరిష్కరించడంలో పాకిస్థాన్ పూర్తిగా విఫలమైందని భారత ప్రభుత్వం ఆరోపించింది. 


విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ శుక్రవారం వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కుల్‌భూషణ్ జాదవ్‌కు అభ్యంతరాలు, ఆటంకాలు లేని కాన్సులర్ యాక్సెస్ కల్పించలేదని పాకిస్థాన్‌పై మండిపడ్డారు. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పును అమలు చేయడంలో ప్రధాన అంశాలను పరిష్కరించడంలో పాకిస్థాన్ పూర్తిగా విఫలమైందన్నారు. సంబంధిత పత్రాలను అందజేయడం, అడ్డంకులు లేనటువంటి కాన్సులర్ యాక్సెస్ కల్పించడం ప్రధాన అంశాలని వివరించారు. 


కుల్‌భూషణ్ జాదవ్‌ను 2016లో పాకిస్థాన్ అక్రమంగా అరెస్టు చేసింది. ఆయన గూఢచర్యం చేస్తున్నట్లు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది.  ఆ దేశ మిలిటరీ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది. దీనిపై భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గత ఏడాది జూలైలో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు చెబుతూ, జాదవ్‌కు విధించిన మరణ శిక్షను పునఃసమీక్షించాలని పాకిస్థాన్‌ను ఆదేశించింది. కానీ ఈ తీర్పు అమలు కాకుండా పాకిస్థాన్ పదే పదే అడ్డంకులు సృష్టిస్తోంది.


జాదవ్ వాదన వినేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు ఇటీవల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. భారత దేశ వైఖరిని తెలియజేసేందుకు అవకాశం కల్పించాలని తెలిపింది. తదుపరి విచారణ సెప్టెంబరు 3న జరుగుతుంది. జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ కల్పించాలని పాకిస్థాన్‌పై భారత్ తీవ్రంగా ఒత్తిడి చేయడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 


Updated Date - 2020-08-15T03:20:44+05:30 IST