బ్యాటింగ్‌ మెరుగైతేనే..

ABN , First Publish Date - 2021-03-14T06:21:39+05:30 IST

ఐదు టీ20ల సిరీ్‌సను ఓటమితో ఆరంభించిన భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. అనవసర ప్రయోగాలతో మొదటి మ్యాచ్‌లో మూల్యం చెల్లించుకుందనే విమర్శలను ఎదుర్కొంటోంది. అందుకే ఈసారి తప్పులను సరిదిద్దుకుని ఆదివారం ఇంగ్లండ్‌తో...

బ్యాటింగ్‌ మెరుగైతేనే..

  • ఒత్తిడిలో భారత్‌
  • జోష్‌లో ఇంగ్లండ్‌
  • నేడు రెండో టీ20
  • రాత్రి 7 గం. నుంచి స్టార్‌స్పోర్ట్స్‌,  డీడీ స్పోర్ట్స్‌లో లైవ్‌
  • ఆలిండియా రేడియోలోనూ వ్యాఖ్యానం


తొలి మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించిన పరిమిత ఓవర్లలో తామే బాస్‌లమంటూ భారత్‌కు ఇంగ్లండ్‌ హెచ్చరిక పంపింది. ఈ ఫార్మాట్‌లో ఆ జట్టు దూకుడును నమ్ముకుంటూ నెంబర్‌వన్‌ కాగలిగింది. అలాగే కచ్చితమైన కాంబినేషన్‌తో బరిలోకి దిగి సిరీస్‌లో శుభారంభం చేసింది. ఇక పిచ్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేక ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన టీమిండియా భంగపడింది. జట్టులో హిట్టర్లకు కొదువ లేకున్నా క్రీజులో కాసేపైనా నిలవలేకపోయారు. అయితే రెండో టీ20లో పొరపాట్లకు తావీయకుండా పర్యాటక జట్టును దెబ్బ తీయాలని కోహ్లీ సేన భావిస్తోంది.


అహ్మదాబాద్‌: ఐదు టీ20ల సిరీ్‌సను ఓటమితో ఆరంభించిన భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. అనవసర ప్రయోగాలతో మొదటి మ్యాచ్‌లో మూల్యం చెల్లించుకుందనే విమర్శలను ఎదుర్కొంటోంది. అందుకే ఈసారి తప్పులను సరిదిద్దుకుని ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే రెండో టీ20లో విజయమే లక్ష్యంగా పోరాడనుంది. అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచక్‌పనకు సన్నాహకంగా ఈ సిరీ్‌సను ఉపయోగించుకోవాలనుకుంటున్న భారత్‌.. ఆరంభంలోనే ప్రయోగాలకు దిగడం బెడిసికొట్టింది. చివరి నిమిషంలో రోహిత్‌ శర్మకు విశ్రాంతినివ్వాలనే నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేసింది. జట్టులో ఉత్తమ ఆటగాడిని పక్కకు తప్పించడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో సిరీస్‌ ఆరంభంలోనే ప్రత్యర్థికి సులువైన విజయాన్ని అందించినట్టయింది. ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేస్తే భారీ హిట్టర్లతో కూడిన ఆ జట్టు ఏకంగా సిరీ్‌సను క్లీన్‌స్వీప్‌ చేసినా ఆశ్చర్యం లేదు.


రోహిత్‌ను ఆడిస్తారా?: భారత జట్టు ఇప్పుడు సందిగ్ధ పరిస్థితిలో ఉంది. రోహిత్‌కు ఆరంభ మ్యాచ్‌ల్లో విశ్రాంతినిస్తున్నట్టు తొలి మ్యాచ్‌కు ముందే కెప్టెన్‌ కోహ్లీ ప్రకటించాడు. తీరా ఇప్పుడతడిని ఆడిస్తే తమ నిర్ణయాన్ని తామే తప్పు పట్టినట్టవుతుందనే సందేహంలో ఉన్నారు. కానీ కోహ్లీ, కోచ్‌ రవిశాస్ర్తి సంగతి తెలిసిన వారు మాత్రం ఈ మ్యాచ్‌లోనూ రోహిత్‌ను ఆడించరనే చెబుతున్నారు. అదే జరిగితే జట్టు మరో భారీ తప్పిదం చేసినట్టే. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో పదో నెంబర్‌ ఆటగాడి వరకు బ్యాటింగ్‌ చేయగలిగిన వారినే ఇంగ్లండ్‌ తీసుకుంటుంది. దీంతోనే వారు ఎదురుదాడికి దిగుతున్నారు. భారత్‌ కూడా పంత్‌, పాండ్యా, సుందర్‌ నుంచి అలాంటి దూకుడునే ఆశిస్తోంది. ధవన్‌, రాహుల్‌ శుభారంభానికి తోడు కోహ్లీ బ్యాట్‌ను ఝుళిపించాల్సి ఉంది. ముఖ్యంగా కోహ్లీ ఫామ్‌ ఆందోళన కలిగిస్తోంది. ఇక బౌలింగ్‌ విభాగంలో శార్దూల్‌ స్థానంలో దీపక్‌ చాహర్‌ను తీసుకునే అవకాశం ఉంది. పవర్‌ప్లేలో అతడికి వికెట్లు తీయగల నైపుణ్యం ఉంది. అలాగే మరో స్పెషలిస్ట్‌ పేసర్‌తో బరిలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్పిన్నర్‌ చాహల్‌ను పవర్‌ప్లేలో ఉపయోగించడం దెబ్బతీసింది.  


అదే జట్టుతో..: భారత్‌తో పోలిస్తే ఈ ఫార్మాట్‌లో రెండేళ్లుగా ఇంగ్లండ్‌ పూర్తిస్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతోంది. అందుకే ఇటీవల దక్షిణాఫ్రికాపై 3-0తో సిరీస్‌ గెలవగలిగింది. కొత్త బంతితో రషీద్‌, ఆర్చర్‌ కాంబినేషన్‌ ప్రభావవంతంగా వికెట్లు తీయగలుగుతోంది. తొలి మ్యాచ్‌లో ఈ జోడీ మొదటి నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. ఇక టీ20 క్రికెట్‌లో 144.46 సగటుతో ఉన్న ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ ఈసారీ విజృంభించాలనుకుంటున్నాడు. మిడిలార్డర్‌లో మలాన్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌, మోర్గాన్‌ నుంచి తుఫాన్‌ ఇన్నింగ్స్‌ను జట్టు ఆశిస్తోంది. పేసర్‌ మార్క్‌ వుడ్‌ అయితే అత్యంత వేగంగా బంతులు విసురుతున్నాడు. ఒకవేళ రెండో స్పిన్నర్‌గా మొయిన్‌ అలీని తీసుకుంటే సామ్‌ కర్రాన్‌పై వేటు పడే చాన్సుంది. 



జట్లు (అంచనా): 

భారత్‌: కేఎల్‌ రాహుల్‌, ధవన్‌/రోహిత్‌, కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయాస్‌, పంత్‌, హార్దిక్‌, సుందర్‌, శార్దూల్‌/దీపక్‌ చాహర్‌, అక్షర్‌, భువనేశ్వర్‌, చాహల్‌.

ఇంగ్లండ్‌: రాయ్‌, బట్లర్‌, మలాన్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌, మోర్గాన్‌, జోర్డాన్‌, సామ్‌ కర్రాన్‌/మొయిన్‌ అలీ, వుడ్‌, రషీద్‌, ఆర్చర్‌.


Updated Date - 2021-03-14T06:21:39+05:30 IST