ఒమైక్రాన్‌ ఆంక్షలు ‘ఆఫ్రికా’కు విమానాలు బంద్‌!

ABN , First Publish Date - 2021-11-29T14:53:28+05:30 IST

ఒమైక్రాన్‌.. కరోనా కొత్త వేరియంట్‌తో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా సహా 18 దేశాలు దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకపోకలను నిషేధించాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల

ఒమైక్రాన్‌ ఆంక్షలు ‘ఆఫ్రికా’కు విమానాలు బంద్‌!

యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇటలీ, బెల్జియం,

హాంకాంగ్‌, నెదర్లాండ్స్‌ల్లో ‘ఒమైక్రాన్‌’ కేసులు

అమెరికాలోనూ ఉండొచ్చన్న ఫౌచీ..!

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రయాణ ఆంక్షలు 

ఇజ్రాయెల్‌లో విదేశీయులకు నో ఎంట్రీ

ఆఫ్రికా దేశాలకు అండగా ఉండాలి: బ్లింకెన్‌ 

ప్రయాణాలపై నిషేధం సరికాదు: ఆఫ్రికా దేశాలు


లండన్‌/వాషింగ్టన్‌/హాంకాంగ్‌, నవంబరు 28: ఒమైక్రాన్‌.. కరోనా కొత్త వేరియంట్‌తో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా సహా 18 దేశాలు దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకపోకలను నిషేధించాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పటిష్ఠ స్ర్కీనింగ్‌ చేస్తున్నాయి. క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా  జర్మనీ, ఇటలీ, ఆస్ట్రేలియా, బెల్జియం, ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌ల్లో కొత్త వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య 3కు పెరిగింది. ఈనేపథ్యంలో దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. మంగళవారం నుంచి ఫేస్‌ మాస్క్‌లు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఇక దక్షిణాఫ్రికా నుంచి రెండు విమానాల్లో నెదర్లాండ్స్‌కు వచ్చిన 600 మందికి పరీక్షలు చేయగా 61 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో 13 మందికి ఒమైక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు తేలిందని ఆదివారం నెదర్లాండ్స్‌ అధికారులు వెల్లడించారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ అమెరికాలోకీ ప్రవేశించి ఉండొచ్చని, అందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ వ్యాఖ్యానించారు. 



ఇజ్రాయెల్‌లో విదేశీయులకు నో ఎంట్రీ

ఇజ్రాయెల్‌ అయితే ఓ అడుగు ముందుకేసింది. విదేశీయులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించడంపై నిషేధం విధించింది. 50 ఆఫ్రికన్‌ దేశాలను రెడ్‌ లిస్టులో పెట్టింది. కొత్త వేరియంట్‌ సోకిన వారి కాంటాక్టులను గుర్తించేందుకు షిన్‌ బెట్‌ ఇంటర్నల్‌ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన వివాదాస్పద ఫోన్‌ మానిటరింగ్‌ టెక్నాలజీని వినియోగించేందుకూ అనుమతి ఇచ్చింది. ఇజ్రాయెల్‌కు చెందిన హక్కుల సంస్థలు ఈ చర్యను వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇది తాత్కాలికం, అవసరం అని ఇజ్రాయెల్‌ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్‌ చెప్పారు.  మరోవైపు ఆఫ్రికా దేశాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ అన్నారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించి, వేగంగా డబ్ల్యూహెచ్‌వోకు సమాచారాన్ని అందించిన దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలను అభినందించారు.  


ప్రయాణాలపై నిషేధంతో వ్యాప్తి ఆగుతుందా? 

ఒమైక్రాన్‌ వేరియంట్‌ అత్యంత ఆందోళనకరమైనదని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించిన నేపథ్యంలో వివిధ దేశాలు దక్షిణాఫ్రికా సహా పలు ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలైతే మరీ కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నాయి. ఆయా దేశాలు అతిగా స్పందిస్తూ, అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఆఫ్రికన్‌ శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తిరేటుపై ఇంకా ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ప్రయాణ ఆంక్షలు విధించడం సరికాదని అంటున్నారు. వ్యాక్సినేషన్‌, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలను కచ్చితంగా పాటించాలి తప్ప ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తే ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు.




Updated Date - 2021-11-29T14:53:28+05:30 IST