ఉత్పాదక రంగ స్థావరంగా భారత్‌

ABN , First Publish Date - 2020-06-05T08:10:22+05:30 IST

కొవిడ్‌-19 సవాళ్లు నేర్పిన పాఠాలే ప్రాతిపదికగా భారత్‌ ఉత్పాదక రంగానికి ముఖ్య స్థావరంగా ఎదుగుతుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు విజయ్‌ కుమార్‌ సారస్వత్‌ అన్నారు. డీఆర్‌డీవో డైరెక్టర్‌ జనరల్‌గా , రక్షణ శాఖ ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా, పృథ్వి వంటి క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు పద్మభూషణ్‌ సారస్వత్...

ఉత్పాదక రంగ స్థావరంగా భారత్‌

కొవిడ్‌-19 సవాళ్లు నేర్పిన పాఠాలే ప్రాతిపదికగా భారత్‌ ఉత్పాదక రంగానికి ముఖ్య స్థావరంగా ఎదుగుతుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు విజయ్‌ కుమార్‌ సారస్వత్‌ అన్నారు. డీఆర్‌డీవో డైరెక్టర్‌ జనరల్‌గా , రక్షణ శాఖ ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా, పృథ్వి వంటి క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు పద్మభూషణ్‌ సారస్వత్‌. కరోనా సంక్షోభం ముగియగానే భారత్‌ ఇతర దేశాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తంచేస్తున్న ఆయనతో ‘ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి’ ప్రత్యేక ఇంటర్వ్యూ..



  • బహుళజాతి కంపెనీల చూపు భారత్‌ వైపే
  • ‘కరోనా’ తర్వాత భారత్‌ పుంజుకుంటుంది
  • సంక్షోభం నుంచి గట్టెక్కించేలా మోదీ ప్రణాళికలు
  • గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేకే వలసలు
  • ‘బయో’ డిఫెన్స్‌పై జాతీయ కార్యక్రమం ఆవశ్యకం
  • పరిశోధనారంగంలో ప్రైవేట్‌ భాగస్వామ్యం పెరగాలి
  • ‘ఆంధ్రజ్యోతి’తో నీతి ఆయోగ్‌ సభ్యుడు వి.కె.సారస్వత్‌ 


కరోనా సంక్షోభం నుంచి దేశాన్ని మోదీ ఎలా గట్టెక్కించగలరని భావిస్తున్నారు? 

కొవిడ్‌-19 ఒక అంతర్జాతీయ సమస్య. మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల కరోనా వ్యాప్తికి కళ్లెం పడింది. ఇవాళ మనం 50కుపైగా దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేస్తున్నాం. వైద్య ఉపకరణాలను స్వదేశంలోనే ఉత్పత్తి చేసే స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహిస్తున్నాం. వీటన్నింటినీ పీఎంవో పర్యవేక్షిస్తోంది. ఈ కృషి ఫలించి కరోనా తర్వాత దేశం పుంజుకుంటుంది.. 


కొవిడ్‌ కల్లోలం తర్వాత భారత్‌ పరిస్థితి ఏంటి? 

ఇతర దేశాల కంటే భారత ఆర్థిక వ్యవస్థే వేగంగా పుంజుకుంటుంది. ఈ దిశగా ప్రభుత్వం రచించిన ఓ ప్రణాళికే.. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’. తద్వారా స్వదేశీ మార్కెట్‌కు ఊతం లభించనుంది. ప్రస్తుతం చైనాలో ఉన్న బహుళజాతి కంపెనీలు భారత్‌లోకి ప్రవేశించేందుకు అనువైన వాతావరణం ఉంది. అవివస్తే ఉత్పాదక రంగానికి భారత్‌ ముఖ్య స్థావరంగా మారుతుంది. 


దేశంలో పేదరికం కొనసాగడంపై మీ అభిప్రాయం? 

1991 నుంచీ ఆర్థికాభివృద్ధి వేగంగా జరుగుతున్నకొద్దీ దేశంలో పేదరికం తగ్గుతోంది. ప్రతి నిమిషానికీ 44 మంది భారతీయులు దారిద్య్రం నుంచి బయటపడుతున్నారు. 2030 వరకు పేదరికం నిర్మూలించాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నాం. 


వలస కార్మికుల సమస్య ఎందుకొచ్చింది? 

వలస కార్మికులకూ, నిరక్షరాస్యతకూ ముడిపెట్టలేం. కొన్ని దశాబ్దాలుగా గ్రామాల్లో మౌలిక, పారిశ్రామి సదుపాయాలు లేక వారు వలస వచ్చారు. కరోనా వంటి  సంక్షోభాలు వచ్చినప్పుడల్లా వారు కష్టాలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రాలు వారిపై దృష్టిసారించడం లేదు. 


భారత్‌కు ‘బయో’ యుద్ధతంత్రం అవసరమా? 

కచ్చితంగా అవసరమే. మూడు దశాబ్దాల్లో స్వైన్‌ ఫ్లూ, హెచ్‌ఐవీ, ఎబోలా, సార్స్‌, కరోనా వంటి వైర్‌సలు మానవాళిపై ముప్పేట దాడిచేశాయి. వీటి నుంచి దేశాన్ని కాపాడుకోవాలంటే జాతీయస్థాయిలో బయోలాజికల్‌ వ్యూహాలు అవసరం. వైరస్‌ రాకముందే దాన్ని కనిపెట్టి చికిత్స చేసేందుకు అవసరమైన పరిశోధనలు జరగాలి. 


పరిశోధనా రంగంలో మన స్థానమెక్కడ ? 

బయో టెక్నాలజీ రంగంలో మన పరిశోధనా పరిజ్ఞానం మరింత ఇనుమడించాల్సి ఉందని కరోనా సంక్షోభ సమయంలో తేలిపోయింది. దేశంలో పరిశోధనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రైవేట్‌ రంగం నుంచి పెట్టుబడులు తక్కువగా ఉన్నాయి. 


పరిశోధనారంగం అభివృద్ధి చెందాలంటే?

ఇంధన, బయో టెక్నాలజీ, జీవ శాస్త్రాలు, వ్యవసాయం, ఆరోగ్యం, జల వనరుల రంగంలో పరిశోధన జరిపేందుకు ప్రైవేట్‌ రంగానికి ప్రోత్సాహకాలు కల్పించాలి. పరిశోధన, ఆవిష్కారాలకు మార్కెట్‌ను అందుబాటులో ఉంచాలి. కనీసం 3-5 ఏళ్లపాటు పరిశ్రమల్లో పనిచేసే అవకాశం శాస్త్రవేత్తలకు కల్పించాలి. ప్రైవేట్‌ రంగంలో మరిన్ని పరిశోధనా పార్కులు ఏర్పాటు చేయడం వల్ల ప్రధాన మార్పులు వస్తాయి. ఐఐటీ మద్రా్‌సలో పరిశోధన, ఆవిష్కార పార్కులు ఏర్పాటు చేయడం సత్ఫలితాలనిస్తోంది. ఢిల్లీ, ముంబై ఐఐటీల్లోనూ.. ఖరగ్‌పూర్‌, జాదవ్‌పూర్‌ వర్సిటీల్లోనూ పరిశోధనా కేంద్రాలను డీఆర్‌డీవో ఏర్పాటు చేసింది. పుణె, హైదరాబాద్‌, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో శాస్త్ర సాంకేతిక శాఖ క్లస్టర్లను కేంద్రం ఏర్పాటు చేసింది. 


పరిశోధనాపత్రాలు లేకపోవడానికి కారణం? 

మన దేశంలో విద్యాసంస్థలు పరిశోధనకు సంబంధించి మౌలిక సదుపాయాల్లోనూ, నాణ్యమైన పరిశోధనలోనూ వెనుకబడి ఉన్నాయి అందువల్ల అంతర్జాతీయ విద్యావేత్తలను భారీగా రప్పించలేకపోతున్నాం. ఇప్పటివరకు ఇతర దేశాలతో సమన్వయం చేసుకుని 26 వేల పరిశోధనా పత్రాలనే ప్రచురించగలిగాం. దీనికి పరిష్కారం చూపాలంటే.. మనం మౌలిక స్థాయి నుంచే మన యువతకు శాస్త్రీయ విద్యను అందించాలి. ప్రతిభ, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టాలి. పద్ధతి ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. 


ఆరోగ్యంపై తక్కువ ఖర్చు పెట్టడం సరైందా? 

దేశంలో అత్యధికులకు సరైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేని మాట నిజమే. 30 కోట్ల మంది భారతీయులు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. దేశ జీడీపీలో ఒక శాతమే ఆరోగ్య సంరక్షణకు ఖర్చుపెడుతున్నాం. 2025 కల్లా జీడీపీలో 1.6 శాతం నుంచి 2.5 శాతం దాకా ఆరోగ్యానికే ఖర్చు పెట్టాల్సి ఉంది.


మార్పు రావాలంటే ఏం చర్యలు తీసుకోవాలి?

ఉన్నత విద్యాసంస్థల్లో సంస్కరణలు చేపట్టాలి. బ్యూరోక్రసీకి తావులేకుండా చూడాలి. సంస్థలు తమ నిర్ణయాలను, వనరులను తామే నిర్వహించుకునేలా, జవాబుదారీ ఉండాలి. నాణ్యమైన పరిశోధన, సాంకేతిక ఆవిష్కారాలను ప్రోత్సహించాలి. ఉన్నత విద్యాసంస్థల్లో రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకుల జోక్యం లేకుండా నిషేధించాలి. అప్పుడే మనదేశం శాస్త్రాలకూ, మేధావులకూ నెలవై పూర్వవైభవం సాధిస్తుంది.


లాక్‌డౌన్‌ను ఎలా వినియోగించుకున్నారు?

లాక్‌డౌన్‌ కాలంలో నేను ప్రధానంగా నేర్చుకున్నది వినియోగాన్ని తగ్గించుకోవడం. ఏది అత్యవసరమో దాన్నే వినియోగించాలని నిర్ణయించుకున్నాను. అనవసర ఖర్చులు తగ్గించాను. పనిమనుషులు లేకుండా మన పనులు మనం చేసుకోవడం కూడా అబ్బింది. దేశానికి క్షిపణి వ్యవస్థను అభివృద్ధిచేయడంపై నా అనుభవాలను పుస్తకంగా రాయడం కూడా ప్రారంభించాను. 

- న్యూఢిల్లీ, ఆంధ్రజ్యోతి



Updated Date - 2020-06-05T08:10:22+05:30 IST