అమెరికాలోని భారతీయులకు కేంద్రం గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2020-05-27T21:50:38+05:30 IST

వందే భారత్ మిషన్‌లో భాగంగా కేంద్రం విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. మే 25 వరకు 158 విమానాల్లో విదేశాల నుంచి 30 వేలకు పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆశించిన స్థాయిలో కేంద్రం విమానాలను తిప్పడం లేదంటూ అనేక దేశాల్లోని భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలోని భారతీయులకు కేంద్రం గుడ్‌న్యూస్

వాషింగ్టన్: వందే భారత్ మిషన్‌లో భాగంగా కేంద్రం విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. మే 25 వరకు 158 విమానాల్లో విదేశాల నుంచి 30 వేలకు పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆశించిన స్థాయిలో కేంద్రం విమానాలను తిప్పడం లేదంటూ అనేక దేశాల్లోని భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉంది. అక్కడ లక్షల సంఖ్యలో భారతీయులు ఉన్నప్పటికి.. కేంద్రం మొదటి విడతలో ఏడు విమానాలు.. రెండో విడతలో మరో ఏడు విమానాలను మాత్రమే కేటాయించింది. ఒక్కో విమానంలో 200 మంది కంటే ఎక్కువ వచ్చే అవకాశం కూడా లేదు.


దీంతో అమెరికాలోని ఇండియన్ ఎంబసీలపై భారతీయులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అమెరికాలో చిక్కుకున్న విద్యార్థులు, అనారోగ్యంతో ఉన్న వారు స్వదేశానికి తీసుకెళ్లమంటూ కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. దీంతో కేంద్రం అమెరికాకు మరో 11 విమానాలను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. రెండో విడతలో భాగంగానే మే 28 నుంచి జూన్ 15 వరకు అదనంగా కేటాయించిన ఈ 11 విమానాలను తిప్పనున్నట్టు వెల్లడించింది. ఈ 11 విమానాల్లో..నాలుగు విమానాలు చికాగో నుంచి, రెండు శాన్‌ఫ్రాన్సిస్కో, రెండు వాషింగ్టన్, రెండు విమానాలు న్యూయార్క్ నుంచి ఒక విమానం నెవార్క్ నుంచి భారత్‌కు రానున్నాయి.


ఎమర్జెన్సీ ఉన్న వారికి, వయసు పైబడిన వారికి, గర్భవతులకు, వీసా సమస్యలతో ఉన్నవారికి, ఓసీఐ కార్డ్ హోల్డర్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇప్పటికే ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది. మరోపక్క భారత్‌లో చిక్కుకున్న పది వేల మంది వివిధ దేశాలకు చెందిన వారిని వారి స్వదేశాలకు పంపినట్టు విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. జూన్ 15 కల్లా మరో 49 వేల మందిని వారి దేశాలకు పంపనున్నామన్నారు.

Updated Date - 2020-05-27T21:50:38+05:30 IST