Afghanistan crisis: 'ఈ-వీసా'ల జారీలో వారికే తొలి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-08-22T01:47:14+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిల కారణంగా భారత్‌లోకి ప్రవేశించాలని అనుకుంటున్న ఆ దేశ పౌరుల కోసం భారత ప్రభుత్వం 'ఈ-వీసా' తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Afghanistan crisis: 'ఈ-వీసా'ల జారీలో వారికే తొలి ప్రాధాన్యం

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిల కారణంగా భారత్‌లోకి ప్రవేశించాలని అనుకుంటున్న ఆ దేశ పౌరుల కోసం భారత ప్రభుత్వం 'ఈ-వీసా' తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అఫ్ఘాన్ల నుంచి భారతదేశంలో ప్రవేశం కోసం వచ్చే వీసా దరఖాస్తులను వేగంగా ట్రాక్ చేయడానికి 'ఈ-ఎమర్జెన్సీ ఎక్స్‌-మిస్క్‌ వీసా'ను ప్రవేశపెట్టింది. ఆరు నెలల కాలపరిమితితో ఈ వీసాలను తీసుకొచ్చింది. ఇదిలాఉంటే.. 'ఈ-వీసా' జారీ విషయమై తాజాగా భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అఫ్ఘానిస్థాన్‌ పౌర సమాజ సభ్యులతో పాటు మహిళా కార్యకర్తలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకు వీసాల జారీలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు శుక్రవారం వెల్లడించారు. అలాగే అఫ్ఘాన్​లో భారత్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టులకు సహకరించిన వారికి కూడా వీసాల జారీలో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. 


ఇప్పటికే యూకే, కెనడా వంటి దేశాలు కూడా అఫ్ఘాన్ శరణార్థులకు పునరావాస పథకాలు ప్రకటించాయి. ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్ తాలిబన్ల కబంద హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశం నుంచి చాలా మంది విదేశీయులు స్వదేశాలకు తరలిపోతున్న వైనం. ఇప్పటికే భారత్ కూడా ఎంబసీ సిబ్బందితో పాటు పలువురు ప్రవాసులను ఎయిర్‌ఫోర్స్ విమానంలో స్వదేశానికి తరలించింది. ఇంకా అక్కడ చిక్కుకుని ఉన్న భారత ప్రవాసులను తరలించే ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ(ఎంఈఏ) ‘స్పెషల్‌ అఫ్ఘానిస్థాన్‌ సెల్‌’ను ఏర్పాటు చేసింది. అఫ్ఘాన్‌లో చిక్కుకున్న భారతీయులు సహాయం కోసం ఈ స్పెషల్ సెల్‌ను సంప్రదించవచ్చు. 


అఫ్ఘాన్‌లో చిక్కుకున్న భారతీయులు సంప్రదించాల్సిన స్పెషల్ సెల్ ఫోన్ నంబర్లు: +91-11-49016783, +91-11-49016784, +91-11-49016785 

వాట్సాప్ నంబర్లు: +91 8010611290, +91 9599321199, +91 7042049944   

ఈ-మెయిల్: SituationRoom@mea.gov.in 


Updated Date - 2021-08-22T01:47:14+05:30 IST