క‌రోనా వ్యాక్సినేష‌న్‌: సింగిల్ డోస్ విధానానికే కేంద్ర ప్ర‌భుత్వం మొగ్గు?

ABN , First Publish Date - 2021-06-19T11:14:54+05:30 IST

కోవిడ్ -19 టీకాలకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం...

క‌రోనా వ్యాక్సినేష‌న్‌: సింగిల్ డోస్ విధానానికే కేంద్ర ప్ర‌భుత్వం మొగ్గు?

న్యూఢిల్లీ: కోవిడ్ -19 టీకాలకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో అడుగు వేయ‌బోతోంది. క‌రోనాపై ఒక డోసు వ్యాక్సిన్ ప్ర‌భావం ఆధారంగా రెండ‌వ డోసు టీకాలు అందించ‌డం గురించి నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరాంతానికి దేశంలోని ఇంత భారీ జనాభాకు టీకాలు వేయాలనే లక్ష్యం ప్రభుత్వానికి పెను స‌వాలుగా మారింది. రెండు డోసుల‌ ప్రభావం అంతగా లేని ప‌క్షంలో ఒకే మోతాదు పద్ధతిని అవలంబించాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. సింగిల్ డోస్ పాలసీని అవలంబించడం ద్వారా రెండు టీకాల మధ్య అంతరం గురించి చర్చకు ముగింపు పల‌కాల‌నుకుంటోంది. 


అయితే ఇటువంటి నిర్ణ‌యం థ‌ర్డ్ వేవ్‌పై తీవ్రమైన ప్ర‌భావం చూప‌వ‌చ్చ‌ని, ప‌రిస్థితులు మ‌రింత‌ సంక్లిష్టంగా  మారిపోయే అవ‌కాశాలున్నాయ‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. దేశంలో ఇటీవల నిర్వ‌హించిన‌ అధ్యయనాల్లో టీకా విష‌యంలో సింగిల్ డోస్‌ విధానాన్ని ఎంచుకున్నా ఫలితాల్లో పెద్దగా తేడా ఉండదని వెల్ల‌డ‌య్యింది. టీకా విధానానికి సంబంధించి ప్రభుత్వానికి కోవిడ్ వర్కింగ్ గ్రూప్ అధ్యక్షుడు ఎన్కె అరోరా ఇటువంటి సూచ‌న చేశారు. అలాగే యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో చేసిన అధ్యయనాన్ని వ్య‌తిరేకించారు. అదే సమయంలో ఇటీవ‌ల వాలర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ పరిశోధకులు ప్రధానంగా కోవిషీల్డ్‌పై చేసిన అధ్యయనంలో ఒక డోసు టీకా... డెల్టా వేరియంట్‌పై 61 శాతం ప్రభావాన్ని కలిగి ఉండగా, రెండ‌వ మోతాదుతో 65 శాతం ప్ర‌భావం మాత్ర‌మే ఉంటుంద‌ని తేలింది. ఇక్క‌డ కొద్ది స్థాయి తేడానే క‌నిపించింది. కాగా యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన‌ పబ్లిక్ హెల్త్ విభాగం నిర్వహించిన అధ్యయనం ప్రకారం కోవిషీల్డ్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ల‌కు చెందిన ఒక డోసు వ్యాక్సిన్... డెల్టా వేరియంట్‌పై 33 శాతం ప్రభావాన్ని చూపుతుండ‌గా, ఆల్ఫా వేరియంట్‌పై 50 శాతం వరకు ప్ర‌భావం చూపుతోంది. అయితే రెండు మోతాదుల టీకా తరువాత డెల్టా వేరియంట్‌పై 60 శాతానికి పైగా ప్ర‌భావం, ఆల్ఫా వేరియంట్‌పై 66 శాతం ప్ర‌భావం చూపుతోంది. సింగిల్ డోస్ అధ్య‌య‌నాల‌ విషయానికి వస్తే భారత్‌, యుకె అధ్యయనాల మధ్య 30 నుంచి 40 శాతం వ్యత్యాసం క‌నిపిస్తోంది. 

Updated Date - 2021-06-19T11:14:54+05:30 IST