సునాయాసంగా..

ABN , First Publish Date - 2021-11-20T07:07:25+05:30 IST

మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ముందుగా బౌలర్లు.. ఆ తర్వాత బ్యాటర్స్‌ ప్రత్యర్థి న్యూజిలాడ్‌పై విరుచుకుపడ్డారు.

సునాయాసంగా..

రెండో టీ20లో కివీస్‌పై భారత్‌ ఘనవిజయం

మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ కైవసం

మళ్లీ అదరగొట్టిన రాహుల్‌, రోహిత్‌ 


మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ముందుగా బౌలర్లు.. ఆ తర్వాత బ్యాటర్స్‌ ప్రత్యర్థి న్యూజిలాడ్‌పై విరుచుకుపడ్డారు. లక్ష్య ఛేదనలో భారత్‌ను కివీస్‌ బౌలర్లు ఏ దశలోనూ ఇబ్బంది పెట్టలేకపోయారు. ఓపెనర్లు రాహుల్‌, రోహిత్‌ తమ అద్వితీయ ఫామ్‌ కొనసాగిస్తూ శతక భాగస్వామ్యాన్ని అందించడంతో.. మరో మ్యాచ్‌ ఉండగానే భారత జట్టు సిరీస్‌ను వశం చేసుకుంది.


రాంచీ: కొత్త కెప్టెన్‌.. కొత్త కోచ్‌ తమ నూతన ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించారు. శుక్రవారం కివీ్‌సతో జరిగిన రెండో టీ20లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో  విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సిరీ్‌సను ఖాయం చేసుకుంది. నామమాత్రమైన చివరి టీ20 21న కోల్‌కతాలో జరుగుతుంది. బౌలింగ్‌లో అరంగేట్ర పేసర్‌ హర్షల్‌ పటేల్‌ (2/25) అదరగొట్టగా.. కేఎల్‌ రాహుల్‌ (49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 65), రోహిత్‌ (36 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లతో 55) అర్ధసెంచరీలతో కీలకంగా నిలిచారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఫిలిప్స్‌ (34), గప్టిల్‌ (31), మిచెల్‌ (31) రాణించారు. హర్షల్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 17.2 ఓవర్లలో 3 వికెట్లకు 155 పరుగులు చేసి గెలిచింది. సౌథీకి 3 వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హర్షల్‌ పటేల్‌ నిలిచాడు.


శతక భాగస్వామ్యం: ఓ మాదిరి లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు రాహుల్‌, రోహిత్‌ జోరుకు కివీస్‌ బౌలర్లు చేష్టలుడిగారు. సౌథీ చివర్లో మూడు వికెట్లు తీసినా అప్పటికే ఫలితం తేలిపోయింది. మ్యాచ్‌లో రాహుల్‌ ఆరంభం నుంచే కదం తొక్కాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతినే ఫోర్‌గా మలిచిన అతడు వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. పవర్‌ప్లేలో 45 పరుగులు రాగా తొమ్మిదో ఓవర్‌ నుంచి భారత్‌ ఇన్నింగ్స్‌లో మరింత వేగం పెరిగింది. ఆ ఓవర్‌లో రోహిత్‌ రెండు సిక్సర్లు.. తర్వాతి ఓవర్‌లో రాహుల్‌ 6,4 బాదగా.. 12వ ఓవర్‌లో చెరో ఫోర్‌తో స్కోరు వంద దాటింది. 40 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన రాహుల్‌ను 14వ ఓవర్‌లో సౌథీ అవుట్‌ చేయడంతో కివీ్‌సకు తొలి బ్రేక్‌ లభించింది. దీంతో తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అప్పటికి జట్టు 41 బంతుల్లో 37 రన్స్‌ చేయాల్సి ఉంది. ఈ దశలో తగినంత ప్రాక్టీస్‌ కోసం వన్‌డౌన్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ (12 నాటౌట్‌)ను బరిలోకి దించారు. భారీ సిక్సర్‌తో 35 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన రోహిత్‌తో పాటు సూర్యకుమార్‌ (1)ను సౌథీ ఒకే ఓవర్‌లో పెవిలియన్‌ చేర్చినా ఫలితం లేకపోయింది. 18వ ఓవర్‌లో పంత్‌ (12 నాటౌట్‌) రెండు వరుస సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు.


బౌలర్ల పట్టు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 64/1. ఈ జోరుకు స్కోరు 190+ అవుతుందేమోననిపించింది. కానీ అలా జరగలేదు. మిగిలిన 14 ఓవర్లలో ఆ జట్టు చేసింది 89 పరుగులే. స్పిన్నర్లు అశ్విన్‌, అక్షర్‌తో పాటు పేసర్‌ హర్షల్‌ అద్భుతంగా కట్టడి చేశారు. ఆరంభంలో మాత్రం భువీ, చాహర్‌ ఓవర్లలో గప్టిల్‌ దూకుడు కనబరిచాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే అతడు మూడు ఫోర్లతో 14 పరుగులు రాబట్టాడు. దీంతో స్వదేశంలో జరిగిన టీ20ల్లో తొలి ఓవర్‌లోనే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్‌గా భువీ నిలిచాడు. ఇక రెండో ఓవర్‌లో మరో ఓపెనర్‌ మిచెల్‌ రెండు ఫోర్లతో 10 రన్స్‌ సాధించాడు. ఇక భువీ రెండో ఓవర్‌లోనూ ఈ ఇద్దరూ బౌండరీలు బాదడంతో 13 పరుగులు వచ్చాయి. ఈ దశలో కీలక గప్టిల్‌ను ఐదో ఓవర్‌లో చాహర్‌ అవుట్‌ చేయడంతో పరుగుల ప్రవాహానికి బ్రేక్‌ పడింది. తొలి వికెట్‌కు 48 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లే తర్వాత భారత బౌలర్లు పట్టు బిగించడంతో కివీస్‌ ఆటలో వేగం తగ్గింది. తొమ్మిదో ఓవర్‌లో చాప్‌మన్‌ (21)ను అక్షర్‌ అవుట్‌ చేశాడు. కాసేపటికే మిచెల్‌ రూపంలో హర్షల్‌ పటేల్‌కు తొలి వికెట్‌ లభించింది. ఈ దశలో ఫిలిప్స్‌ ధాటిగా ఆడుతూ భారీ సిక్సర్లతో చెలరేగాడు. కానీ డెత్‌ ఓవర్లలో భారత బౌలర్లు విజృంభించారు. వీరి ధాటికి వరుస ఓవర్లలో సైఫర్ట్‌ (13), ఫిలిప్స్‌, నీషమ్‌ (3) వెనుదిరిగారు. చివరి మూడు ఓవర్లలో కివీస్‌ 15 పరుగులే సాధించగలిగింది.


న్యూజిలాండ్‌: గప్టిల్‌ (సి) పంత్‌ (బి) దీపక్‌ చాహర్‌ 31; మిచెల్‌ (సి) సూర్యకుమార్‌ (బి) హర్షల్‌ 31; చాప్‌మన్‌ (సి) రాహుల్‌ (బి) అక్షర్‌ 21; ఫిలిప్స్‌ (సి సబ్‌) రుతురాజ్‌ (బి) హర్షల్‌ 34; సైఫర్ట్‌ (సి) భువనేశ్వర్‌ (బి) అశ్విన్‌ 13; నీషమ్‌ (సి) పంత్‌ (బి) భువనేశ్వర్‌ 3; శాంట్నర్‌ (నాటౌట్‌) 8; మిల్నే (నాటౌట్‌) 5;  ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 153/6. వికెట్ల పతనం: 1-48, 2-79, 3-90, 4-125, 5-137, 6-140. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-39-1; దీపక్‌ చాహర్‌ 4-0-42-1; అక్షర్‌ పటేల్‌ 4-0-26-1; అశ్విన్‌ 4-0-19-1; హర్షల్‌ పటేల్‌ 4-0-25-2.


భారత్‌: రాహుల్‌ (సి) ఫిలిప్స్‌ (బి) సౌథీ 65; రోహిత్‌ (సి) గప్టిల్‌ (బి) సౌథీ 55; వెంకటేశ్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 12; సూర్యకుమార్‌ (బి) సౌథీ 1; పంత్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 17.2 ఓవర్లలో 155/3. వికెట్ల పతనం: 1-117, 2-135, 3-137. బౌలింగ్‌: సౌథీ 4-0-16-3; బౌల్ట్‌ 4-0-36-0; శాంట్నర్‌ 4-0-33-0; మిల్నే 3-0-39-0; సోధీ 2-0-13-0; నీషమ్‌ 0.2-0-12-0.

Updated Date - 2021-11-20T07:07:25+05:30 IST