క్లీన్‌స్వీప్ లక్ష్యంగా..

ABN , First Publish Date - 2020-12-08T09:58:56+05:30 IST

వన్డే సిరీస్‌కు పూర్తి భిన్నంగా భారత్‌ టీ20 సిరీస్‌లో దూసుకెళుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన ఉత్సాహంలో ఉన్న కోహ్లీ సేన ఇప్పుడు క్లీన్‌స్వీ్‌పపై కన్నేసింది. అదే జరిగితే ఈ ఏడాదిని ఓటమి లేకుండా...

క్లీన్‌స్వీప్ లక్ష్యంగా..

సమరోత్సాహంతో భారత్‌ 

ఆసీస్‌తో ఆఖరి టీ20 నేడు

ఇంతలో ఎంత మార్పు! 


వన్డే సిరీస్‌కు పూర్తి భిన్నంగా భారత్‌ టీ20 సిరీస్‌లో దూసుకెళుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన ఉత్సాహంలో ఉన్న కోహ్లీ సేన ఇప్పుడు క్లీన్‌స్వీ్‌పపై కన్నేసింది. అదే జరిగితే ఈ ఏడాదిని ఓటమి లేకుండా ముగించినట్టవుతుంది. అటు ఆతిథ్య ఆసీస్‌కు మాత్రం పరువు కోసం పాకులాడాల్సిన పరిస్థితి నెలకొంది. 50 ఓవర్ల మ్యాచ్‌ల్లో బెబ్బులిలా చెలరేగినప్పటికీ పొట్టి ఫార్మాట్‌లో తేలిపోతోంది. కీలక ఆటగాళ్ల గైర్హాజరీ ఆ జట్టును దెబ్బతీయగా.. కనీసం చివరి మ్యాచ్‌నైనా కాపాడుకోవాలనే ఆశతో ఉంది.


సిడ్నీ: హార్దిక్‌ పాండ్యా వీరోచిత ఆటతీరుతో రెండో టీ20 గెలిచిన భారత జట్టు ఇప్పటికే సిరీ్‌సను తన ఖాతాలో వేసుకుంది. ఇక సొంతగడ్డపై ఆసీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేసేందుకు భారత్‌కు మరో విజయం చాలు. మంగళవారం జరిగే ఆఖరిదైన మూడో మ్యాచ్‌లోనూ  కోహ్లీసేన ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. సిడ్నీలోనే జరిగే ఈ మ్యాచ్‌లోనూ ఆల్‌రౌండ్‌షోను కనబర్చి తద్వారా వన్డే సిరీ్‌సలో 1-2 పరాభవానికి బదులివ్వాలనుకుంటోంది.


అదే జట్టుతో..: స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ దూరమైనా కీలక పేసర్లు బుమ్రా, షమికి విశ్రాంతినిచ్చినా  భారత్‌ అద్భుత ప్రదర్శన కనబర్చడం జట్టును సంతోషంలో ముంచెత్తుతోంది. అందుకే తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. అదీగాకుండా కీలక టెస్టు సిరీస్‌ ముందు బుమ్రా, షమిలను ఆడించి రిస్క్‌ తీసుకునే ఆలోచనలో మేనేజ్‌మెంట్‌ లేదు. రాహుల్‌, ధవన్‌ల శుభారంభాలతో పాటు కెప్టెన్‌ కోహ్లీ నిలకడైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక హార్దిక్‌ ఫినిషింగ్‌ నైపుణ్యం ఆసీస్‌లో వణుకు పుట్టిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా లెఫ్టామ్‌ పేసర్‌ నటరాజన్‌ బౌలింగ్‌ జట్టుకు ఊరటనిస్తోంది. రెండు మ్యాచ్‌ల్లో కేవలం 6.25 ఎకానమీ రేట్‌తో అతను 5 వికెట్లు పడగొట్టాడు. మధ్య ఓవర్లలో శార్దూల్‌ ప్రభావం చూపిస్తున్నాడు. స్పిన్‌లో సుందర్‌ పరుగులను కట్టడి చేస్తున్నాడు. అయితే తొలి మ్యాచ్‌ హీరో చాహల్‌ రెండో టీ20లో కాస్త వెనుకబడ్డాడు. ఆరో బౌలర్‌ లేకపోవడమే భారత్‌ను ఇబ్బంది పెట్టే అంశం.


బరిలోకి ఫించ్‌: రెండో మ్యాచ్‌కు పేసర్లు హాజెల్‌వుడ్‌, స్టార్క్‌ దూరమవడం ఆసీ్‌సను దెబ్బతీసింది. ఈ స్థితిలో కెప్టెన్‌ ఫించ్‌ చివరి మ్యాచ్‌లో ఆడవచ్చని కోచ్‌ లాంగర్‌ చెబుతున్నాడు. తను జట్టులోకి వస్తే డార్సీ షార్ట్‌పై వేటు పడుతుంది. అలాగే స్టొయిని్‌సను ఓపెనర్‌గానూ పంపవచ్చు. వేడ్‌ భారీ షాట్లతో చెలరేగుతుండగా స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌తో మిడిలార్డర్‌ పటిష్ఠంగానే ఉంది. అయితే బౌలింగ్‌లోనే సీనియర్లు లేకపోవడంతో పరుగుల కట్టడి కష్టమవుతోంది. 


జట్లు (అంచనా)

భారత్‌: ధవన్‌, రాహుల్‌, కోహ్లీ, శాంసన్‌, శ్రేయాస్‌, హార్దిక్‌, శార్దూల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, చాహల్‌.

ఆస్ట్రేలియా: ఫించ్‌/షార్ట్‌, వేడ్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, హెన్రిక్స్‌, స్టొయినిస్‌, అబాట్‌, సామ్స్‌, స్వెప్సన్‌, ఆడమ్‌ జంపా, టై.

పిచ్‌: ఎప్పటిలాగే ఎస్‌సీజీ మైదానం బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించనుంది. వర్షం నుంచి ముప్పు లేకపోయినా చల్లటి గాలులు వీచే అవకాశముంది. దీంతో మ్యాచ్‌ జరుగుతున్న కొద్దీ బౌలింగ్‌, బ్యాటింగ్‌ వ్యూహాలపై ప్రభావం పడవచ్చు.

Updated Date - 2020-12-08T09:58:56+05:30 IST