ఆసీస్‌ ‘టాప్‌’ షో

ABN , First Publish Date - 2020-11-28T09:07:41+05:30 IST

సొంతగడ్డపై ఆస్ట్రేలియా బెబ్బులిలా చెలరేగింది. తమకు అచ్చొచ్చిన సిడ్నీ క్రికెట్‌ మైదానంలో పరుగుల వరద పారించింది. టాపార్డర్‌లో ఫించ్‌, స్మిత్‌ మెరుపు సెంచరీలతో విరుచుకుపడగా, వార్నర్‌ అర్ధసెంచరీతో అదరగొట్టాడు. 374 పరుగుల భారీ స్కోరులో

ఆసీస్‌ ‘టాప్‌’ షో

  • ఫించ్‌, స్మిత్‌ శతకాలు
  • భారత్‌ ఘోర పరాజయం
  • పాండ్యా, ధవన్‌ పోరాటం వృథా


సొంతగడ్డపై ఆస్ట్రేలియా బెబ్బులిలా చెలరేగింది. తమకు అచ్చొచ్చిన సిడ్నీ క్రికెట్‌ మైదానంలో పరుగుల వరద పారించింది. టాపార్డర్‌లో ఫించ్‌, స్మిత్‌ మెరుపు సెంచరీలతో విరుచుకుపడగా, వార్నర్‌ అర్ధసెంచరీతో అదరగొట్టాడు. 374 పరుగుల భారీ స్కోరులో ఈ ముగ్గురివే 288 పరుగులుండడం విశేషం. చివర్లో మ్యాక్స్‌వెల్‌ విభిన్న షాట్లతో చుక్కలు చూపించాడు. ఆ తర్వాత భారత్‌ ఛేదనలో  హార్దిక్‌ మెరుపులు, ధవన్‌ సమయోచిత బ్యాటింగ్‌ మినహా చెప్పుకోవడానికేమీ లేదు. దీనికి తోడు బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనూ చెత్త ప్రదర్శనతో కోహ్లీ సేన మూల్యం చెల్లించుకుంది.


సిడ్నీ: ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటనను భారత్‌ ఓటమితో ఆరంభించింది.  కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (124 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 114), స్టీవ్‌ స్మిత్‌ (66 బంతు ల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 105) సూపర్‌ సెంచరీలతో మోతెక్కించారు. ఫలితంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ 66 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకుంది. దీంతో మూడు వన్డేల సిరీ్‌సలో 1-0తో ఆధిక్యంలో ఉంది. ముందుగా ఆసీస్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగుల స్కోరు సాధించింది. మ్యాక్స్‌వెల్‌ (19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 45) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. షమికి 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 308 పరుగులు చేసి ఓడింది. హార్దిక్‌ పాండ్యా (76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 90), ధవన్‌ (86 బంతుల్లో 10 ఫోర్లతో 74) రాణించారు. ఆడమ్‌ జంపా 4, హాజెల్‌వుడ్‌ 3 వికెట్లు సాధించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా స్మిత్‌ నిలిచాడు.


జోష్‌ ధాటికి కుదేల్‌: భారీ ఛేదనను భారత్‌ ఆశాజనకంగానే ఆరంభించింది. ఓపెనర్లు మయాంక్‌ (22), ధవన్‌ ఓవర్‌కు పది రన్‌రేట్‌ చొప్పున సాధిస్తూ ఆశలు రేపినా పేసర్‌ హాజెల్‌వుడ్‌ షార్ట్‌ బాల్స్‌కు.. మధ్య ఓవర్లలో జంపా స్పిన్‌కు భారత్‌ తడబడింది. ఆరో ఓవర్‌లో మయాంక్‌ను హాజెల్‌వుడ్‌ అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 53 రన్స్‌ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కోహ్లీ (21), శ్రేయాస్‌ (2)ను రెండు బంతుల తేడాతో జోష్‌ వెనక్కి పంపాడు. రాహుల్‌ (12) కూడా విఫలమవడంతో 101/4 స్కోరుతో జట్టు కష్టాల్లో పడింది.


పాండ్యా, ధవన్‌ పోరాటం: భారీ ఓటమి ఖాయమనుకున్న దశలో ధవన్‌తో కలిసి హార్దిక్‌ పాండ్యా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలోనే ధవన్‌, పాండ్యాలను జంపా పెవిలియన్‌కు చేర్చడంతో భారత్‌ కోలుకోలేకపోయింది. అప్పటికి మరో 15 ఓవర్లలో 128 రన్స్‌ అవసరమవగా జడేజా మినహా మరో బ్యాట్స్‌మన్‌ లేకపోవడంతో ఓటమి ఖాయమైంది.


బాదుడే బాదుడు: టాస్‌ నెగ్గగానే ఆసీస్‌ పరుగుల మోతకు బరిలోకి దిగింది. దీంతో స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ ఊచకోతకు షమి మినహా భారత బౌలర్లంతా ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. దీనికి తోడు క్యాచ్‌లను వదిలేయడం ప్రతికూల ఫలితాన్నిచ్చింది. ఓపెనర్లు ఫించ్‌, వార్నర్‌ తొలి వికెట్‌కు 156 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత స్మిత్‌ చెలరేగాడు. 33వ ఓవర్‌లో ఎల్బీ నిర్ణయాన్ని సవాల్‌ చేసి బతికిపోయిన స్మిత్‌.. వరుస బౌండరీలతో హోరెత్తించాడు. అటు  సెంచరీ తర్వాత ఫించ్‌ 40వ ఓవర్‌లో అవుటయ్యాడు.


మ్యాక్సీ మోత: 41వ ఓవర్‌లో బరిలోకి దిగిన మ్యాక్స్‌వెల్‌ స్విచ్‌ హిట్లతో చుక్కలు చూపించాడు. ఐపీఎల్‌లో విఫలమైన అతడు 43వ ఓవర్‌లో ఫోర్‌, రెండు సిక్సర్లతో 21 పరుగులు సాధించాడు. మరుసటి ఓవర్‌లో 6,4,4తో దూసుకెళ్లాడు. అతడి ఆటతో స్కోరు 400 కూడా దాటుతుందేమో అనిపించినా.. షమి ఈ కీలక వికెట్‌ను తీశాడు. 49వ ఓవర్‌లో స్మిత్‌ సెంచరీని పూర్తి చేసుకుని చివరి ఓవర్‌లో అవుటయ్యాడు.


కాళ్లకు షూస్‌ లేకుండా..

జాతి వివక్షకు వ్యతిరేకంగా మ్యాచ్‌కు ముందు భారత్‌-ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ కాళ్లకు షూస్‌ లేకుండా వలయాకారంగా నిలబడ్డారు. అలాగే పురాతనమైన ఆసీస్‌ సంస్కృతిని కూడా ఈ సందర్భంగా గౌరవించుకున్నారు. ఇక ఇటీవల మరణించిన ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ డీన్‌ జోన్స్‌కు నివాళిగా ఆటగాళ్లంతా నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు.


బుట్ట బొమ్మా.. మరోసారి

సోషల్‌ మీడియాలో బుట్ట బొమ్మా పాటకు డేవిడ్‌ వార్నర్‌ తన కుటుంబంతో చేసిన డ్యాన్స్‌ వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ మ్యాచ్‌లోనూ ప్రేక్షకులు అతడిని ఆ డ్యాన్స్‌ చేయమంటూ కోరారు. అటు వార్నర్‌ కూడా చిరునవ్వుతో తన కుడి చేయిని గుండ్రంగా ఊపుతూ వారిని హుషారెత్తించాడు.


స్టొయినిస్‌కు గాయం

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ భారత్‌తో జరిగే రెండో వన్డేలో ఆడడం సందేహంగా మారింది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో తన ఏడో ఓవర్‌ మధ్యలోనే పక్కటెముకల నొప్పితో మైదానం వీడాడు. ఇక స్టొయినిస్‌ స్థానంలో గ్రీన్‌, హెన్రిక్స్‌ మధ్య పోటీ నెలకొంది.


  • 1 వన్డేల్లో భారత్‌ నుంచి అత్యధిక పరుగులిచ్చిన స్పిన్నర్‌గా చాహల్‌ (89/1).
  • 2 ఆసీస్‌ తరఫున అత్యంత వేగం (126 ఇన్నింగ్స్‌)గా 5 వేల రన్స్‌ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌ ఫించ్‌. వార్నర్‌ (115 ఇన్నింగ్స్‌) ముందున్నాడు.
  • 3 ఆసీస్‌ నుంచి వన్డేల్లో మూడో వేగవంతమైన (62 బంతుల్లో) సెంచరీ సాధించిన ఆటగాడు స్మిత్‌.


స్కోరుబోర్డు 

ఆస్ట్రేలియా: వార్నర్‌ (సి) రాహుల్‌ (బి) షమి 69; ఫించ్‌ (సి) రాహుల్‌ (బి) బుమ్రా 114; స్మిత్‌ (బి) షమి 105; స్టొయినిస్‌ (సి) రాహుల్‌ (బి) చాహల్‌ 0; మ్యాక్స్‌వెల్‌ (సి) జడేజా (బి) షమి 45; లబుషేన్‌ (సి) ధవన్‌ (బి) సైనీ 2; క్యారీ (నాటౌట్‌) 17; కమిన్స్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం: 50 ఓవర్లలో 374/6. వికెట్ల పతనం: 1-156, 2-264, 3-271, 4-328, 5-331, 6-372. బౌలింగ్‌: షమి 10-0-59-3; బుమ్రా 10-0-73-1; సైనీ 10-0-83-1; చాహల్‌ 10-0-89-1; జడేజా 10-0-63-0.

భారత్‌: మయాంక్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) హాజెల్‌వుడ్‌ 22; ధవన్‌ (సి) స్టార్క్‌ (బి) జంపా 74; కోహ్లీ (సి) ఫించ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 21; శ్రేయాస్‌ (సి) క్యారీ (బి) హాజెల్‌వుడ్‌ 2; రాహుల్‌ (సి) స్మిత్‌ (బి) జంపా 12; హార్దిక్‌ (సి) స్టార్క్‌ (బి) జంపా 90; జడేజా (సి) స్టార్క్‌ (బి) జంపా 25; సైనీ (నాటౌట్‌) 29; షమి (బి) స్టార్క్‌ 13; బుమ్రా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: 50 ఓవర్లలో 308/8. వికెట్ల పతనం: 1-53, 2-78, 3-80, 4-101, 5-229, 6-247, 7-281, 8-308. బౌలింగ్‌: స్టార్క్‌ 9-0-65-1; హాజెల్‌వుడ్‌ 10-0-55-3; కమిన్స్‌ 8-0-52-0; జంపా 10-0-54-4; స్టొయినిస్‌ 6.2-0-25-0; మ్యాక్స్‌వెల్‌ 6.4-0-55-0.

Updated Date - 2020-11-28T09:07:41+05:30 IST