Shocking: భారత క్యాంపులో కరోనా కలకలం.. రెండో టీ20 వాయిదా

ABN , First Publish Date - 2021-07-27T21:50:47+05:30 IST

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేగింది. టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్

Shocking: భారత క్యాంపులో కరోనా కలకలం.. రెండో టీ20 వాయిదా

కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేగింది. టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా బారినపడడంతో నేడు జరగాల్సిన రెండో టీ20ని రేపటి వాయిదా వేశారు. అలాగే, చివరి మ్యాచ్‌ను శుక్రవారం నిర్వహించనున్నారు. పాండ్యాకు కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయిన వెంటనే శ్రీలంక, భారత జట్లు రెండింటిని ఐసోలేషన్‌కు తరలించారు. కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన ఇతర ఆటగాళ్లను చాలా దగ్గరగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికైతే మ్యాచ్‌ను రేపటికి వాయిదా వేశారు కానీ, రేపు కూడా మ్యాచ్ నిర్వహణ కష్టమేనని చెబుతున్నారు. 


శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ధావన్ సేన 2-1తో గెలుచుకుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ఆధిక్యంలో సంపాదించింది. కాగా, శ్రీలంక జట్టు బ్యాటింగ్ కోచ్, వీడియో అనలిస్ట్ కరోనా బారినపడడంతో వన్డే సిరీస్ కూడా ఆలస్యంగానే ప్రారంభమైంది.


అంతకుముందు ఇంగ్లండ్‌లో పర్యటనలో ఉన్న భారత టెస్టు జట్టులోనూ కొవిడ్ కలకలం రేపింది. కరోనా సోకడంతో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ లండన్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మిగతా జట్టు సభ్యులు మాత్రం ప్రాక్టీస్ మ్యాచ్ కోసం డుర్హమ్ వెళ్లిపోయారు. మరోవైపు, టెస్టు జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరం కావడంతో శ్రీలంకలో ఉన్న పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లకు పిలుపు వచ్చింది. వీరిద్దరూ నేడో, రేపు ఇంగ్లండ్ బయలుదేరి వెళ్లనున్నారు. 

Updated Date - 2021-07-27T21:50:47+05:30 IST