దగ్గరకొస్తే కాల్పులు తప్పవు

ABN , First Publish Date - 2020-09-26T13:20:16+05:30 IST

పీఎల్‌ఏ దళాలు తమ సమీపానికి వస్తే ఆత్మరక్షణార్థం కాల్పులు జరపక తప్పదని భారత్‌ .. చైనాకు తేల్చిచెప్పింది. గల్వాన్‌ లోయలో ఘర్షణ దరిమిలా భారత్‌ ఈ హెచ్చరిక చేసింది. కొద్ది రోజుల

దగ్గరకొస్తే కాల్పులు తప్పవు

చైనాకు భారత్‌ హెచ్చరిక.. చర్చల్లో స్పష్టీకరణ


న్యూఢిల్లీ: పీఎల్‌ఏ దళాలు తమ సమీపానికి వస్తే ఆత్మరక్షణార్థం కాల్పులు జరపక తప్పదని భారత్‌ .. చైనాకు తేల్చిచెప్పింది. గల్వాన్‌ లోయలో ఘర్షణ దరిమిలా భారత్‌ ఈ హెచ్చరిక చేసింది. కొద్ది రోజుల కిందట మాల్డోలో ఉన్నతస్థాయి కమాండర్ల స్థాయిలో జరిగిన చర్చల్లో భారత్‌ - చైనా పోకడలను సూటిగానే లేవనెత్తింది. ‘‘గతంలో జరిగిన ఒప్పందాలను పాటించట్లేదు. డోక్లాం ప్రతిష్టంభన తరువాత కుదిరిన ఒప్పందంలో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద కేవలం 8-10 మందిని మాత్రమే కాపలాకు పంపుతామన్నారు. ఆ తరువాత నుంచి ఏటికేడూ ఆ సంఖ్యనూ పెంచుతూ పోతున్నారు. 50,100...ఇప్పుడు వేల ల్లో..! ఎల్‌ఏసీని దాటి చొచ్చుకొస్తున్నారు. మేమూ ఎదురుతిరగక తప్పదు. మా బలగాలూ దీటుగా బదులివ్వగలవు. అంచేత..  మా స్థావరాలకు సమీపానికి గనక ఈసారి వస్తే కాల్పులుతప్పవు’’ అని భారత బృందం స్పష్టం చేసింది. దళాల ఉపసంహరణ సాధ్యమైనంత తొందరగా జరిపి వెనక్కి వెళ్లాలని భారత్‌ ఎంతకోరినా చైనా మొండితనం ప్రదర్శించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.  గల్వాన్‌ లోయలో జూన్‌ 15న జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోయారు. చైనా కూడా తొలిసారిగా తమ వైపు నుంచి ఐదుగురు మరణించినట్లు ఒప్పుకుంది. కానీ చైనా అంతకు మూడు రెట్ల మందినే కోల్పోయిందని భారత అధికారులు అంటున్నారు. పాంగాంగ్‌ సరస్సు చుట్టుపక్కల మిట్టల శిఖరాలను భారత్‌ అన్యాయంగా ఆక్రమించుకుందని, సరస్సు దక్షిణ భాగాన బలగాల మోహరింపు ఎక్కువ చేశారని చైనా ఆరోపించింది. అయితే భారత బృందం దీన్ని తిరస్కరించింది. ఎల్‌ఏసీని గౌరవించాలని అంటూ- పాంగాంగ్‌ సరస్సే కాదు, (ఏ నుంచి జెడ్‌ దాకా) అన్ని విషయాలనూ, అన్ని ఏరియాల్లో పీఎల్‌ఏ మోహరింపుల గురించీ తేల్చేద్దాం... రండి అని ఘాటుగా ప్రతిస్పందించింది.

Updated Date - 2020-09-26T13:20:16+05:30 IST