Abn logo
Jun 3 2021 @ 22:53PM

2025 కల్లా భారత్‌లో 90 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్స్!

న్యూఢిల్లీ: భారత్‌లోని యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2025 కల్లా 90 కోట్లు దాటిపోతుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 622 మిలియన్లు కాగా.. వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య ఎటా సగటున 45 శాతం పెరగనుందని ఐఏఎమ్ఏఐ అంచనా వేసింది. కాగా.. పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని పేర్కొంది. గ్రామాల్లో వృద్ధి రేటు 15 శాతంగా ఉంటే పట్టణాల్లో కేవలం 4 శాతమని ఐఏఎమ్ఏఐ తేల్చింది. ప్రస్తుతం గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 299 మిలియన్లు కాగా.. పట్టణాల్లో వీరి సంఖ్య 323 మిలియన్లు. దీన్నిబట్టి గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగం పెరిగే అవకాశం అధికంగా ఉందని ఈ నివేదిక అభిప్రాయపడింది.  గ్రామాలు, పట్టణ ప్రాంతాల మధ్య ఇంటర్నెట్ వినియోగంలో ఉన్న తేడా(డిజిటల్ డివైడ్) తగ్గుతుందని కూడా ఐఏఎమ్ఏఐ అంచనా వేస్తోంది. ఈ నివేదిక ప్రకారం..  ప్రతి పది మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లలో తొమ్మిది మంది ప్రతిరోజు ఇంటర్నెట్ వినియోగిస్తారట. అంతేకాకుండా.. వారు సగటున రోజుకు 107 నిమిషాలు అంతర్జాలంలో విహరిస్తారట.