వాణిజ్య ప్రతీకారం గరళమే!

ABN , First Publish Date - 2020-06-20T08:03:41+05:30 IST

సరిహద్దుల్లో భారతీయ సైనికులను చైనా అత్యంత దారుణంగా చంపిన సంఘటనతో దేశ ప్రజల రక్తం మరిగిపోతోంది. చైనాపై ప్రతీకారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. చైనా బలం వాణిజ్యమేనని, యుద్ధం కన్నా వాణిజ్యపరంగానే దాన్ని దెబ్బ తీయాలని మరికొందరు పిలుపునిచ్చారు...

వాణిజ్య ప్రతీకారం గరళమే!

  • దిగుమతులు నిషేధిస్తే చైనాకొచ్చే ముప్పేం లేదు

సరిహద్దుల్లో భారతీయ సైనికులను చైనా అత్యంత దారుణంగా చంపిన సంఘటనతో దేశ ప్రజల రక్తం మరిగిపోతోంది. చైనాపై ప్రతీకారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. చైనా బలం వాణిజ్యమేనని, యుద్ధం కన్నా వాణిజ్యపరంగానే దాన్ని దెబ్బ తీయాలని మరికొందరు పిలుపునిచ్చారు. స్వయంగా కేంద్ర మంత్రులు వారితో గొంతు కలిపారు. చైనా వస్తువుల బహిష్కరణకు పిలుపు ఇచ్చారు. అది సామాజిక మాధ్యమాల్లో ఊపందుకొంది. అసలు చైనా నుంచి దిగుమతులనే రద్దు చేయాలని డి మాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనివల్ల చైనాకు జరిగే నష్టమెంతో తెలియదు కానీ, భారత దేశానికి, ముఖ్యంగా పేదలకు ఎక్కువ నష్టం జరుగుతుందని దేశీయ వాణిజ్య వర్గాలు అం టున్నాయి. చైనాయేమో ప్రపంచ వాణిజ్యానికి కేంద్ర బిందువుగా ఉంది. భారతేమో ప్రపంచ వాణిజ్యంలో స్వల్ప వాటాతో అంతగా ప్రభావం చూపగల స్థాయిలో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సరిహద్దు సమస్యను వాణిజ్య వివాదంగా మార్చడం ఏ మాత్రం తెలివైన చర్య కాదని అంటున్నారు. 


లోటుతో చేటుందా?

చైనా వస్తువులపై నిషేధం పెట్టాలనే వారు ఏమంటారంటే మనం ప్రతీ వస్తువు కోసం చైనా మీద ఆధారపడటం వల్ల ఆ దేశంతో మనకు భారీగా వాణిజ్య లోటు ఏర్పడిందని చెబుతారు. లోటు చెడ్డ విషయమేమీ కాదు. భారత్‌కు ప్రధానంగా 25 దేశాలతో ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలు నడుస్తున్నాయు. అందులో ధనిక దేశాలైన అమెరికా, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌లతో భారత్‌కు వాణిజ్య మిగులు ఉంది. అంటే, ఆ మూడు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న దానికన్నా ఎక్కువ ఎగుమతి చేస్తున్నాం. ఆ దేశాలేవీ భారత్‌ కన్నా వెనుకబడి లేవు.


చైనా, దక్షిణాఫ్రికా సహా 22 దేశాలతో భారత్‌కు వాణిజ్యలోటు ఉంది. అంటే, మనకు వాళ్లే ఎక్కువ ఎగుమతి చేస్తున్నారన్న మాట. అవేవీ భారత్‌ కన్నా ధనిక దేశాలేవీ కాదు. లోటు, మిగులు అనేవి గణాంకాలు మాత్రమే. లోటు ఉందంటే చైనీయులు భారతీయ ఉత్పత్తులు కొన్న దానికన్నా భారతీయులు చైనా ఉత్పత్తులు కొంటున్నది ఎక్కువని అర్థం చేసుకోవాలి. చైనా వస్తువులు కొనాలన్న నిర్ణయాన్ని భారతదేశంలోని వినియోగదారు వ్యక్తిగతంగా, స్వతంత్రంగా తీసుకుంటాడు. చైనా వస్తువు చౌకగా వస్తుందికాబట్టి ఏ జపాన్‌ వస్తువో, కొరియా వస్తువో కొన్న దానికన్నా ఎక్కువ పైసలు మిగులుతాయి. అయితే, వాణిజ్య లోటుతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖర్చవుతాయి. ప్రస్తుతం మనదగ్గర ఏడాదికి సరిపడా 5000 కోట్ల డాలర్ల నిల్వలు ఉన్నాయి కాబట్టి చెల్లింపుల సంక్షోభం ప్రశ్నే ఉండదు. మనకు అవసరమైన నాణ్యమైన వస్తువులను చౌకగా,  తయారు చేసుకోలేక పోయినపుడు ఉ త్పత్తి చేయగల దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తెలివైనపనే. ఏ దేశమూ అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించలేదు. లోటు తగ్గించాలంటే ముందు మౌలిక సదుపాయలు, పోటీకి అవకాశం కల్పించాలి. 


పేదలకు పెద్ద దెబ్బ! 

చైనా వస్తువులపై నిషేధంతో బాగా ఇబ్బంది పడేది పేదలే. చైనా ఏసీ తక్కువ ధరకు ఎక్కువ సామర్థ్యంతో పని చేసేది వస్తుంది. దాంతో, పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు వేసవి కాలం కోసం కష్టమైనా ఇంటికి ఒక ఏసీని పెట్టించుకుంటున్నారు. చైనా వస్తువులపై నిషేధం విధిస్తే ఖరీదైన జపాన్‌ ఏసీ కొనలేరు. సామర్థ్యం తక్కువగా ఉండే భారతీయ ఏసీతో సర్దుకోలేరు. చివరికి కొనే ఆలోచనే మానుకొని మండు వేసవిని అనుభవించాలి. చైనా నుంచి దిగుమతులపై నిషేధం పెడితే చైనీయుల కన్నా భారతీయులకే ఎక్కువ నష్టం జరుగుతుంది. భారత్‌ అంతర్జాతీయ ఎగుమతుల్లో చైనా వాటా 5 శాతం, దిగుమతుల్లో 14 శాతం ఉన్నాయి. చైనా కోణం నుంచి చూస్తే ఆ దేశ ఎగుమతుల్లో 3శాతం, దిగుమతుల్లో 1శాతం భారత్‌తో ముడిపడి ఉన్నాయి. అంటే, భారత్‌ బ్యాన్‌ పెట్టినా చైనా వాణిజ్యానికి, ఆ దేశం ఆర్థిక పరిస్థితికి వచ్చే మార్పేమీ ఉండదు. ఒకవేళ చైనా భారతీయ వస్తువులను వద్దనుకుంటే, వాటికి ఎ న్నో ప్రత్యామ్నాయాలున్నాయి. మనకు అంత అవకాశం లేదు. 


చైనా కూడా నిషేధిస్తే?

చైనా నాయకత్వం కూడా భారత్‌తో వాణిజ్యాన్ని నిషేధిస్తే, అన్ని మార్గాల నుంచి పెట్టుబడులు ఆపేస్తే ఏం జరుగుతుంది? భారత్‌ మనుగడ సాగిస్తుంది కానీ సామాన్యుడు ఇబ్బంది పడతాడు. భారతీయ వ్యాపారాలకు చైనా పెట్టుబడులు ఆగిపోతాయి. భారతీయ బ్రాండ్ల ఖర్చు కూడా బాగా పెరిగిపోతుంది. 


  1. చైనా కంపెనీలతో ఒప్పందాల ను రద్దు చేస్తే అంతర్జాతీయంగా భారత్‌ విశ్వసనీయత దెబ్బతింటుంది. 
  2. చైనా వస్తువులపై దిగుమతి సుంకం పెంచాలని కొం దరు సూచించారు. చైనాలోనే పూర్తిగా తయారై, భారత్‌లో కేవలం అమ్మడానికి తెచ్చిన వస్తువులపై భారీ పన్ను వేస్తూ, ఇక్కడి ఫ్యాక్టరీలకు వచ్చే ముడిసరకు మీద అసలు పన్నే లేకుండా చేయాలని సూచించారు.          ‌

చిన్న పరిశ్రమలకు శరాఘాతం

చైనా చౌక ఉత్పత్తుల వల్ల సమర్థంగా వ్యాపారాలు చేయని భారతీయ ఉత్పత్తిదారులకు నష్టం వాటిల్లుతుంది. అదే సమయంలో చాలా భారతీయ పరిశ్రమలకు ముడిసరుకు చైనా నుంచే వస్తుంది. నిజానికి చైనా నుంచి పూర్తిగా తయారై వచ్చే వస్తువుల కన్నా ముడిసరుకు దిగుమతులే ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రికల్‌ యంత్రాలు, ఎరువులు, కళ్లజోళ్ల అద్దాలు, రసాయనాలను భారతీయ చిన్న పరిశ్రమలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటాయి. చైనా దిగుమతులపై నిషేధం విధిస్తే ఇతర దేశాల నుంచి దిగుమతికి ఏర్పాట్లు చేసేసరికి చాలా పరిశ్రమలు మూతపడతాయి. 


- సెంట్రల్‌ డెస్క్

Updated Date - 2020-06-20T08:03:41+05:30 IST