Abn logo
Sep 20 2021 @ 17:49PM

COVID : వచ్చే నెల నుంచీ విదేశాలతో మళ్లీ ‘వ్యాక్సిన్ మైత్రి‘

ఢిల్లీ : వచ్చే త్రైమాసికం నుంచీ, అంటే, అక్టోబర్ నెల నుంచీ మరోమారు భారత్ కోవిడ్ వ్యాక్సిన్‌ల ఎగుమతి ప్రారంభిస్తుందని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయా చెప్పారు. ‘వ్యాక్సిన్ మైత్రీ’లో భాగంగా వచ్చే నెల నుంచీ మళ్లీ ఇండియా ప్రపంచానికి తన ఆపన్న హస్తం అందివ్వనుందని ఆయన ప్రకటించారు. రానున్న నెలలో ముప్పై కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని కూడా ఆయన తెలిపారు. 


2020లో కరోనా విజృంభణ తరువాత శాస్త్రవేత్తలు వ్యాక్సిన్లు కనుగొన్నాక పలు దేశాలకు భారత్ టీకాలు పంపిణీ చేసింది. అయితే, 2021లో దేశాన్ని సెకండ్ వేవ్ అతలాకుతలం చేయటంతో వ్యాక్సిన్ ఎక్స్‌పోర్ట్స్‌కు బ్రేక్ పడింది. యుద్ధ ప్రాతిపదికన భారతీయులను వ్యాక్సినేట్ చేయటం కోసం ‘వ్యాక్సిన్ మైత్రి‘కి విరామం ఇచ్చారు. ఇప్పుడు టీకాల ఉత్పత్తిలో ఇండియా మెరుగైన స్థితికి చేరుకోవటంతో, వ్యాక్సిన్ కొరతతో ఇంకా ఇబ్బంది పడుతోన్న దేశాలకు, మరోమారు డోసులు ఎగుమతి చేయాలని మోదీ సర్కార్ నిర్ణయించింది.