నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం.. గెలిపించిన బౌలర్లు

ABN , First Publish Date - 2021-09-07T02:55:05+05:30 IST

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా

నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం.. గెలిపించిన బౌలర్లు

లండన్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నిన్న భారత బ్యాట్స్‌మెన్ వేసిన పునాదులను కాపాడే బాధ్యత నెత్తికెత్తికున్న బౌలర్లు నేడు వరుస వికెట్లతో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును బెంబేలెత్తించారు.


బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోకి నెట్టి వికెట్లు కూలుస్తూ భారత్‌కు అద్వితీయ విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటై ఉసూరుమనిపించినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో నిలదొక్కుకుని 466 పరుగులు చేసి ఇంగ్లండ్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ (127)తో అదరగొట్టగా, పుజారా (61), పంత్ (50), ఠాకూర్ (60) అర్ధ సెంచరీలతో రాణించారు. చివర్లో ఉమేశ్ యాదవ్ (25), బుమ్రా (24) కాసేపు బౌలర్లను ఎదురొడ్డడంతో భారత్ 466 పరుగులు చేయగలిగింది.   


ఆ తర్వాత 368 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 77/0తో ఉంది. ఈ ఉదయం  లంచ్ సమయానికి  రెండు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన ఇంగ్లండ్ పటిష్టంగానే ఉన్నట్టు కనిపించింది. అయితే, ఆ తర్వాత హసీబ్ హమీద్ (63), ఒల్లీ పోప్ (2), జానీ బెయిర్‌స్టో (0), మొయీన్ అలీ (0) ఒకరి తర్వాత ఒకరిగా వెనుదిరిగారు. 


భారత బౌలర్లు పోటీలు పడి వికెట్లు తీయడంతో ఒత్తిడికి లోనైన బ్యాట్స్‌మెన్ వికెట్లు సమర్పించుకుని పెవిలియన్‌కు క్యూకట్టారు. క్రిస్ వోక్స్ (18), ఒవెర్టన్ (10), రాబిన్సన్ (10) కాసేపు క్రీజులో నిలబడి భారత్ విజయాన్ని ఆలస్యం చేశారు. చివరికి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 210 పరుగుల వద్ద ముగిసింది. ఫలితంగా భారత్ 157 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.


భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించగా బుమ్రా, జడేజా, ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. చివరి టెస్టు ఈ నెల 10న మాంచెస్టర్‌లో జరగనుంది. 

Updated Date - 2021-09-07T02:55:05+05:30 IST