రంగ్‌దే.. ఇండియా!

ABN , First Publish Date - 2021-03-29T10:21:38+05:30 IST

330 లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాళ్లు రాయ్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌ అంతా వంద పరుగుల లోపే అవుట్‌. ఇంకేముంది..

రంగ్‌దే.. ఇండియా!

చివరి ఓవర్‌లో గట్టెక్కిన భారత్‌

వణికించిన సామ్‌ కర్రాన్‌

కట్టడి చేసిన బౌలర్లు

ఆఖరి వన్డేలో ఉత్కంఠ విజయం

2-1తో సిరీస్‌ భారత్‌ వశం 

ఎనిమిదో నెంబర్‌లో అత్యధిక స్కోరు (95 నాటౌట్‌) సాధించిన వన్డే ఆటగాడిగా సామ్‌ కర్రాన్‌.. క్రిస్‌ వోక్స్‌ సరసన నిలిచాడు.

విరాట్‌ కోహ్లీ భారత్‌ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 200 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ధోనీ (332), అజరుద్దీన్‌ (221) తర్వాతి స్థానంలో కోహ్లీ నిలిచాడు.

 వన్డేల్లో 5వేల పరుగులకు పైగా భాగస్వామ్యం అందించిన ఏడో జోడీగా ధవన్‌-రోహిత్‌. అలాగే తొలి వికెట్‌కు ఎక్కువ  (17) సెంచరీ భాగస్వామ్యాలు అందించిన రెండో జోడీగానూ నిలిచారు.

భారత్‌-ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఉత్కంఠ ముగింపు! ఇంగ్లండ్‌పై వన్డే సిరీసూ భారత్‌దే అయింది. ఆధిపత్యం అటూ ఇటూ అవుతూ ఏ జట్టు గెలుస్తుందోనని అభిమానులను మునివేళ్ల మీద నిలబెట్టిన ఆఖరి వన్డేలో చివరికి టీమ్‌ ఇండియానే మురిసింది. నువ్వానేనా అన్నట్లుగా తుది ఓవర్‌ దాకా సాగిన మ్యాచ్‌లో కోహ్లీసేనే విక్టరీ కొట్టింది.


ముగింపు  అదిరేలా.. 

330 లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాళ్లు రాయ్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌ అంతా వంద పరుగుల లోపే అవుట్‌. ఇంకేముంది.. భారత్‌ విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. కానీ సిలబస్‌లో లేని పాఠంలా భారత బౌలర్లకు సామ్‌ కర్రాన్‌ ఎదురయ్యాడు. 200/7 స్కోరుతో ఉన్న జట్టును చివరి ఓవర్‌ వరకు తీసుకెళ్లి కోహ్లీ సేనను కంగారెత్తించాడు. కానీ డెత్‌ ఓవర్లలో భువనేశ్వర్‌ అద్భుత బంతులకు ఇంగ్లండ్‌ జోరు తగ్గింది. చివరి ఓవర్‌లో నటరాజన్‌ ఆరు పరుగులే ఇచ్చి ఊరట నివ్వడంతో భారత్‌ వరుసగా మూడు ఫార్మాట్లలోనూ సిరీస్‌ దక్కించుకుంది.


పుణె: మూడు వన్డేల సిరీస్‌ ఉత్కంఠభరితం గా ముగిసింది. సామ్‌ కర్రాన్‌ (83 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 95 నాటౌట్‌) సూపర్‌ బ్యాటింగ్‌తో టీమిండియాకు ఓటమి భయాన్ని చూపా డు. కానీ భారత బౌలర్లు మాత్రం చివరి వరకు పట్టు వదలకుండా ఏడు పరుగుల తేడాతో జట్టును గెలిపించారు. అలాగే భారత్‌ 2-1తో సిరీస్‌ను సైతం కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌ (78), ధవన్‌ (67), హార్దిక్‌ (64) అర్ధసెంచరీలు సాధించారు. మార్క్‌ వుడ్‌కు మూడు, రషీద్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారీ ఛేదనలో ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులు చేసి ఓడింది. శార్దూల్‌కు నాలుగు, భువనేశ్వర్‌కు మూడు వికెట్లు దక్కాయి. మలాన్‌ (50) అర్ధసెంచరీ సాధించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సామ్‌ కర్రాన్‌.. మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా బెయిర్‌స్టో నిలిచారు. 


బౌలర్ల హవా:

రెండో వన్డేలో ఉతికి ఆరేసిన ఇంగ్లండ్‌కు 330 పరుగుల టార్గెట్‌ తక్కువేనేమో అనిపించింది. కానీ 95 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఓవర్‌లో రాయ్‌ (14)ను, మూడో ఓవర్‌లో బెయిర్‌స్టో (1)ను భువనేశ్వర్‌ అవుట్‌  చేసి ఇంగ్లండ్‌కు ఝలక్‌ ఇచ్చాడు. ఐదో ఓవర్‌లో స్టోక్స్‌ (35) క్యాచ్‌ను హార్దిక్‌ వదిలేసినా.. 12వ ఓవర్‌లోనే నటరాజన్‌ అతడి వికెట్‌ తీశాడు. ఆ తర్వాత బట్లర్‌ (15) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో మలాన్‌, లివింగ్‌స్టోన్‌ (36) జోడీ ఐదో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ఏర్పరిచింది. శార్దూల్‌ తన వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు చేర్చి ఒత్తిడి తగ్గించాడు. అటు మొయిన్‌ అలీ (29) జోరును హార్దిక్‌ అద్భుత క్యాచ్‌తో ముగించాడు. 


సామ్‌ వణికించాడు..:

ఎనిమిదో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ సామ్‌ కర్రాన్‌ చివరి వరకు భారత్‌ను వణికించాడు. అటు 34 వ ఓవర్‌లో అతడిచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌ దగ్గర హార్దిక్‌ వదిలేశాడు. అయితే రషీద్‌ (19) క్యాచ్‌ను మాత్రం తన ఎడమవైపు డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో విరాట్‌ పట్టేయగా ఎనిమిదో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 45 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన సామ్‌ మాత్రం ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాడు. చెత్త బంతులను నిర్దాక్షిణ్యంగా బౌండరీలు బాదేస్తూ లక్ష్యాన్ని కరిగించాడు. అటు 43వ ఓవర్‌లో భువీ ఒక్క పరుగే ఇవ్వడంతో ఇంగ్లండ్‌ జోరు తగ్గింది. కానీ 47వ ఓవర్‌లో సామ్‌ చెలరేగి రెండు ఫోర్లు, సిక్స్‌ బాది 18 రన్స్‌ రాబట్టడంతో సమీకరణం మారింది. 49వ ఓవర్‌లో వుడ్‌ క్యాచ్‌ను శార్దూల్‌.. సామ్‌ క్యాచ్‌ను నటరాజన్‌ వదిలేశారు. ఇక ఆరు బంతుల్లో 14 పరుగులు కావాల్సి ఉండగా.. తొలి బంతికే వుడ్‌ రనౌటయ్యాడు. చివరి రెండు బంతులకు 12 రన్స్‌ అవసరపడగా సామ్‌ ఫోర్‌ మాత్రమే సాధించడంతో ఓటమి తప్పలేదు. 



శుభారంభం:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ధవన్‌, రోహిత్‌ (37) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం అందాక జట్టు ఒక్కసారిగా తడబడింది. రషీద్‌ తన వరుస ఓవర్లలో రోహిత్‌, ధవన్‌లను అవుట్‌ చేయగా ఆ వెంటనే కోహ్లీ (7)ని మొయిన్‌ అలీ దెబ్బతీశాడు. కాసేపటికే రాహుల్‌ (7) కూడా వెనుదిరిగాడు. దీంతో 25 ఓవర్లలో 157 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పంత్‌, పాండ్యా ఎదురుదాడికి దిగడం తో ఐదో వికెట్‌కు 99 పరుగులు జత చేరాయి. 27వ ఓవర్‌లో పంత్‌ 6,4తో.. 28వ ఓవర్‌లో హార్దిక్‌ మూడు సిక్సర్లతో భారీ స్కోరుకు తెర తీశారు. 44 బంతుల్లో ఓ సిక్సర్‌ ద్వారా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన పంత్‌ను 36వ ఓవర్‌లో సామ్‌ కర్రాన్‌ అవుట్‌ చేశాడు. అటు పేసర్లు, స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్న హార్దిక్‌ 36 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 39 ఓవర్లకే స్కోరు 276 పరుగులకు చేరింది. ఈ సమయాన హార్దిక్‌ను స్టోక్స్‌ బౌల్డ్‌ చేశాడు. అప్పటికి ఇంకా 11 ఓవర్లు మిగిలి ఉన్నా శార్దూల్‌ (30) ఒక్కడే రాణించాడు. 8 పరుగుల వ్యవధిలోనే చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది.


స్కోరుబోర్డు

భారత్‌: రోహిత్‌ (బి) రషీద్‌ 37; ధవన్‌ (సి అండ్‌ బి) రషీద్‌ 67; కోహ్లీ (బి) మొయిన్‌ 7; పంత్‌ (సి) బట్లర్‌ (బి) సామ్‌ కర్రాన్‌ 78; రాహుల్‌ (సి) మొయిన్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 7; హార్దిక్‌ (బి) స్టోక్స్‌ 64; క్రునాల్‌ (సి) రాయ్‌ (బి) వుడ్‌ 25; శార్దూల్‌ (సి) బట్లర్‌ (బి) వుడ్‌ 30; భువనేశ్వర్‌ (సి) సామ్‌ కర్రాన్‌ (బి) టోప్లే 3; ప్రసిద్ధ్‌ (బి) వుడ్‌ 0; నటరాజన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 48.2 ఓవర్లలో 329 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-103, 2-117, 3-121, 4-157, 5-256, 6-276, 7-321, 8-328, 9-329, 10-329. బౌలింగ్‌: సామ్‌ కర్రాన్‌ 5-0-43-1; టోప్లే 9.2-0-66-1; వుడ్‌ 7-1-34-3; స్టోక్స్‌ 7-0-45-1; రషీద్‌ 10-0-81-2; మొయిన్‌ 7-0-39-1; లివింగ్‌స్టోన్‌ 3-0-20-1.


ఇంగ్లండ్‌: రాయ్‌ (బి) భువనేశ్వర్‌ 14; బెయిర్‌స్టో (ఎల్బీ) భువనేశ్వర్‌ 1; స్టోక్స్‌ (సి) ధవన్‌ (బి) నటరాజన్‌ 35; మలాన్‌ (సి) రోహిత్‌ (బి) శార్దూల్‌ 50; బట్లర్‌ (ఎల్బీ) శార్దూల్‌ 15; లివింగ్‌స్టోన్‌ (సి అండ్‌ బి) శార్దూల్‌ 36; మొయిన్‌ అలీ (సి) హార్దిక్‌ (బి) భువనేశ్వర్‌ 29; సామ్‌ కర్రాన్‌ (నాటౌట్‌) 95; రషీద్‌ (సి) కోహ్లీ (బి) శార్దూల్‌ 19; వుడ్‌ (రనౌట్‌) 14; టోప్లే (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 50 ఓవర్లలో 322/9. వికెట్ల పతనం: 1-14, 2-28, 3-68, 4-95, 5-155, 6-168, 7-200, 8-257, 9-317. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 10-0-42-3; నటరాజన్‌ 10-0-73-1; ప్రసిద్ధ్‌ క్రిష్ణ 7-0-62-0; శార్దూల్‌ 10-0-67-4; హార్దిక్‌ 9-0-48-0; క్రునాల్‌ 4-0-29-0.

Updated Date - 2021-03-29T10:21:38+05:30 IST