ఆయుధాల కోసం రష్యాతో భారత్ ఎమర్జెన్సీ డీల్

ABN , First Publish Date - 2021-08-28T21:17:31+05:30 IST

రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలుకు

ఆయుధాల కోసం రష్యాతో భారత్ ఎమర్జెన్సీ డీల్

న్యూఢిల్లీ : రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్‌కు బదులుగా ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్‌ను సమకూర్చుకోబోతోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాలు వదిలేసిన ఆయుధాలు భారత దేశంలోని ఉగ్రవాద మూకలకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసర నిబంధనల క్రింద ఐఏఎఫ్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. 


ప్రభుత్వ వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం, ఐఏఎఫ్‌కు 1.5 లక్షలకుపైగా అజాల్ట్ రైఫిల్స్ అవసరం. రూ.300 కోట్లతో దాదాపు 70 వేల ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్ కొనుగోలుకు ఐఏఎఫ్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రైఫిల్స్ రానున్న మరికొద్ది నెలల్లో ఐఏఎఫ్‌కు చేరుకోవచ్చు. ఇవి అందుబాటులోకి వస్తే, ఉగ్రవాద చర్యలను మరింత సమర్థంగా తిప్పికొట్టడానికి వీలవుతుంది. వీటిని మొదట జమ్మూ-కశ్మీరు, శ్రీనగర్, కీలక వాయు సేన స్థావరాల్లోని దళాలకు అందజేస్తారు. ఈ ఒప్పందంపై సంతకాలు గత వారం జరిగినట్లు తెలుస్తోంది. 


భారత సైన్యానికి దాదాపు 6.5 లక్షల రైఫిల్స్ అవసరం. ఏకే-103 కన్నా ఎక్కువ సామర్థ్యంగల ఏకే-203 రైఫిల్స్ కొనుగోలుకు రష్యాతో ఒప్పందానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. గడచిన రెండేళ్ళ నుంచి భారత రక్షణ దళాల ఆయుధ వ్యవస్థల ఆధునికీకరణ వేగవంతమైంది. తూర్పు లడఖ్‌లో చైనా దుస్తంత్రం నేపథ్యంలో ఆయుధ వ్యవస్థల ఆధునికీకరణను భారత్ వేగవంతం చేసింది.


Updated Date - 2021-08-28T21:17:31+05:30 IST