వాషింగ్టన్‌లో ఫుడ్ డ్రైవ్‌ను ప్రారంభించిన ఇండియన్-అమెరికన్ వైద్యులు

ABN , First Publish Date - 2020-06-26T01:34:49+05:30 IST

కరోనా మహమ్మారి అమెరికాను ఏ విధంగా వణికిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు

వాషింగ్టన్‌లో ఫుడ్ డ్రైవ్‌ను ప్రారంభించిన ఇండియన్-అమెరికన్ వైద్యులు

వాషింగ్టన్: కరోనా మహమ్మారి అమెరికాను ఏ విధంగా వణికిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా అమెరికా వ్యాప్తంగా అనేక మంది ఉపాధి కోల్పోయి తినడానికి తిండి కూడా లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇదే సమయంలో వారిని ఆదుకునేందుకు అనేక స్వచ్చంధ సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా వాషింగ్టన్‌లోని ఇండియన్ అమెరికన్లు ఏకమై ఆహారం లేక బాధపడుతున్న వారి కోసం ఫుడ్ డ్రైవ్‌ను ప్రారంభించారు. ది గ్రేటర్ వాషింగ్టన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్‌కు చెందిన వైద్యులు, మేరీల్యాండ్‌లోని గురునానక్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు చెందిన గురుద్వారా సభ్యులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వాషింగ్టన్‌ నలుమూలలా ఆహారం లేక అవస్థలు పడుతున్న వారికి నిత్యావసరాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. గత శని, ఆదివారాల్లో మొత్తంగా 350 కుటుంబాలకు నిత్యవసరాలను అందించారు. 


ఈ కార్యక్రమంలో భారతదేశానికి చెందిన అనేక ఇతర సంస్థలు కూడా పాలుపంచుకుంటున్నాయి. భారతదేశానికి చెందిన అనేక సంస్థలు అటు భారతీయులతో పాటు ఆపదలో ఉన్న అమెరికన్లకు కూడా తమ వంతు సహాయాన్ని అందిస్తూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అమెరికాలో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్న, మందులు లేక బాధపడుతున్న భారతీయులకు ది గ్రేటర్ వాషింగ్టన్ అసోసియేషన్ అండగా నిలిచి వారికి అవసరమైన మందులను ఉచితంగా అందిస్తూ వస్తోంది. అంతేకాకుండా కరోనా కారణంగా సరైన వసతి లేక ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులకు కూడా భారతీయ సంస్థలు చోటు కల్పిస్తోంది. ల్యాప్‌టాప్స్ లేక ఆన్‌లైన్ క్లాసులను మిస్ అవుతున్న అనేక మంది విద్యార్థులకు ఇదే అసోసియేషన్‌కు చెందిన వైద్యులు ల్యాప్‌టాప్‌లను కూడా ఉచితంగా అందించడం జరిగింది. 

Updated Date - 2020-06-26T01:34:49+05:30 IST