స్వీడన్ యువరాణి నోట America లోని ఈ NRI బాలిక పేరు.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2021-08-29T01:25:49+05:30 IST

ప్రతిష్టాత్మక స్టాక్‌హోం జూనియర్ వాటర్ ప్రైజ్‌ను అమెరికాలోని ఓ ఎన్నారై బాలిక గెలుచుకుంది.

స్వీడన్ యువరాణి నోట America లోని ఈ NRI బాలిక పేరు.. అసలు కథేంటంటే..

స్టాక్‌హోం: ప్రతిష్టాత్మక స్టాక్‌హోం జూనియర్ వాటర్ ప్రైజ్‌ను అమెరికాలోని ఓ ఎన్నారై బాలిక గెలుచుకుంది. కలుషితమైన నీటి శుద్ధిపై భారతీయ అమెరికన్ బాలిక చేసిన పరిశోధనలకుగాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. తాజాగా వర్చువల్‌ విధానంలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. దీంతో విజేత అయిన భారతీయ బాలిక ఎషానీ ఝా పేరును స్వీడన్ యువరాణి విక్టోరియా అధికారికంగా ప్రకటించారు. వరల్డ్ వాటర్ వీక్ సందర్భంగా ఇటీవల స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. 


ఇక క్రియాశీల కార్బన్‌ స్థానంలో బయోచార్‌తో మంచినీటిని శుభ్రం చేయడానికి సరళమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న విధానాన్ని కనుగొనడంలో ఎషానీ చేసిన పరిశోధనలు ఆమెను విజేతగా నిలిపాయి. ఆమె ఆవిష్కరణ నీటి ఫిల్టర్‌లను మరింత సమర్థవంతంగా, చౌకగా చేస్తుంది. ప్రస్తుతం కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ జోస్‌లోని లీన్‌బ్రూక్ హై స్కూల్‌లో చదువుతున్న భారత సంతతి బాలిక ఈ అద్భుత ఆవిష్కరణ చేయడం గర్వించదగిన విషయం. ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకోవడం పట్ల ఎషానీ ఆనందం వ్యక్తం చేసింది. అటు ఈ ఏడాది 'వరల్డ్ ఫుడ్ ప్రైజ్' కూడా భారత సంతతికి చెందిన శకుంతల హరసింగ్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఒకే ఏడాది ఇలా రెండు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అవార్డులను భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులే గెలుచుకోవడం విశేషం.    


కాగా, ప్రధాన నీటి సవాళ్లను పరిష్కరించడంలో సరికొత్త ఆవిష్కరణలు చేసే 15 నుంచి 20 ఏళ్ల వయసు గల వారికి మాత్రమే స్టాక్‌హోం జూనియర్ వాటర్ ప్రైజ్ ఇవ్వబడుతోంది. 1997లో స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇనిస్టిట్యూట్(ఎస్ఐడబ్ల్యూఐ) ఈ ప్రైజ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతియేటా విజేతలకు ఈ బహుమానం ఇవ్వడం జరుగుతోంది. కరోనా కారణంగా ఈ ఏడాది ఆన్‌లైన్ ద్వారా ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది.  


Updated Date - 2021-08-29T01:25:49+05:30 IST