ప్రాక్టీస్ షురూ

ABN , First Publish Date - 2021-07-20T09:10:49+05:30 IST

క్రీడా గ్రామంలో తమకు కేటాయించిన గదుల్లో చేరి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిన భారత అథ్లెట్లు సోమవారం సాధన ప్రారంభించారు. స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, సాయిప్రణీత్‌, ఆర్చరీ దంపతుల జోడీ దీపికాకుమారి, అతాను దాస్‌...

ప్రాక్టీస్ షురూ

  • క్రీడా గ్రామంలో భారత అథ్లెట్ల సందడి 
  • ఒలంపిక్స్ మూడు వారాల్లో


టోక్యో: క్రీడా గ్రామంలో తమకు కేటాయించిన గదుల్లో చేరి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిన భారత అథ్లెట్లు సోమవారం సాధన ప్రారంభించారు. స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, సాయిప్రణీత్‌, ఆర్చరీ దంపతుల జోడీ దీపికాకుమారి, అతాను దాస్‌, టీటీ ఆటగాళ్లు శరత్‌ కమల్‌, సాతియన్‌, ఏకైక జిమ్నాస్ట్‌ ప్రణతీ నాయక్‌, బాక్సర్లు, షూటర్లు ప్రాక్టీ్‌సలో చెమటోడ్చారు. సింగిల్స్‌ కోచ్‌ పార్క్‌ టే సంగ్‌ ఆధ్వర్యంలో సింధు, ప్రణీత్‌ సాధన చేయగా.. మతియాస్‌ బో పర్యవేక్షణలో డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ షెట్టి శ్రమించారు. యుమెనోషిమా పార్క్‌లో దీపిక, అతాను జోడీ తమ నైపుణ్యాలకు పదునుపెట్టుకుంది. ఇక శరత్‌ కమల్‌, సాతియన్‌ తొలి ఒలింపిక్‌ పతకమే లక్ష్యంగా ప్రాక్టీ్‌సకు శ్రీకారం చుట్టారు. కోచ్‌ లక్ష్మణ్‌ మనోహర్‌ కనుసన్నల్లో  జిమ్నాస్ట్‌ ప్రణతీనాయక్‌ ప్రాక్టీస్‌ ఆరంభించింది. షూటర్లు, బాక్సర్లు కూడా సాధన చేశారు.




ఫుడ్‌ ఓకే..: క్రీడా గ్రామంలో అందిస్తున్న ఆహారంపై భారత జట్టు సంతృప్తి వ్యక్తంజేసింది. అయితే వేడినీళ్లు తాగేందుకు కరెంట్‌ ఫ్లాస్కులు కావాలని కోరింది. దాంతో జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా ఈ విన్నపాన్ని నిర్వాహక కమిటీకి తెలియజేసినట్టు చెఫ్‌ డి మిషన్‌ ప్రేమ్‌వర్మ చెప్పారు. పారిశుధ్య సిబ్బందితో కాంటాక్టును సాధ్యమైనంత తక్కువ చేసేందుకు క్రీడా గ్రామంలో ప్రతి గదిని మూడురోజులకోసారి శుభ్రం చేయించాలని నిర్వాహకులు నిర్ణయించారు. కానీ రోజూ శుభ్రం చేయాలని భావిస్తే ఆ మేరకు నిర్వాహకులకు తెలియజేయాల్సి ఉంటుంది. తువ్వాలలను ఏరోజుకారోజు మారుస్తున్నారని వర్మ చెప్పారు. భారత్‌ సహా ప్రపంచ దేశాల ఆహారాన్ని వడ్డిస్తున్నారు. క్రీడా గ్రామంలో రెండు అంతస్తుల్లో భోజన ఏర్పాట్లు చేశారు. భౌతిక దూరంకోసం సీటు సీటుకు మధ్య ఫైబర్‌ గ్లాసును ఏర్పాటు చేశారు. 100 మందికిపైగా గల భారత జట్టుకు సొంతంగా స్వాబ్‌ తీసుకొనే కిట్లను అందజేశారు. ప్రతిరోజు సాధనకు వెళ్లేముందు వారే స్వాబ్‌ నమూనాను తీసి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. 



పెరుగుతున్న కేసులు 

క్రీడా గ్రామంలో సోమవారం మరో కొవిడ్‌ కేసు బయటపడింది. చెక్‌రిపబ్లిక్‌ బీచ్‌వాలీబాల్‌ ఆటగాడు ఓండ్రెజ్‌ పెరూసిక్‌ పాజిటివ్‌గా తేలాడు. దాంతో ఇప్పటివరకు క్రీడా గ్రామంలో వైరస్‌ బారినపడిన అథ్లెట్ల సంఖ్య మూడుకు చేరింది. సౌతాఫ్రికా ఫుట్‌బాలర్లు ఇద్దరికి ఆదివారం కరోనా సోకిన సంగతి తెలిసిందే. చిబా రాష్ట్రంలో సాధన చేస్తున్న అమెరికా జిమ్నాస్టిక్స్‌ జట్టులోని ప్రత్యామ్నాయ క్రీడాకారిణి కూడా పాజిటివ్‌గా తేలింది. 


Updated Date - 2021-07-20T09:10:49+05:30 IST