Abn logo
Jul 22 2021 @ 11:23AM

UAE: భారత వ్యాపారవేత్తకు గోల్డెన్ వీసా

అబుధాబి: సెల్స్‌మెన్‌గా కెరీర్ ప్రారంభించి ఇవాళ కోట్లు విలువ చేసే వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించడంతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న అల్ ఐన్‌కు చెందిన భారత సంతతి వ్యాపారవేత్త సతీష్ జైసింఘానీకు యూఏఈ ప్రభుత్వం తాజాగా గోల్డెన్ వీసా మంజూరు చేసింది. 1984లో యూఏఈ వెళ్లిన ఆయన మొదట ఓ ప్రిటింగ్ ప్రెస్‌లో సెల్స్ రిప్రజెంటేటివ్‌గా 1200 దిర్హమ్స్‌(రూ.24వేలు) నెల జీతానికి పని చేశారు. అలా 17 ఏళ్లు జైసింఘానీ వివిధ కార్పొరేట్ సంస్థల్లో పని చేశారు. ఈ 17 ఏళ్ల అనుభవంతో 2000లో 'ప్రైడ్ ట్రేడింగ్' పేరిట ఓ సంస్థను స్థాపించారు. రెండేళ్ల తర్వాత టెక్స్‌టైల్ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆయన కందోరా, ఇతర గార్మెంట్స్‌తో ఓ షోరూం తెరిచారు. 


ఈ రెండు వ్యాపారాలు బాగా సక్సెస్ కావడంతో 2004లో 'ఇంటర్నెషనల్ యూనిఫార్మ్స్' పేరిట మరో సంస్థను నెలకొల్పారు. ఇందులో దేశవ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేసే కార్మికులు, సిబ్బంది ధరించే అన్ని రకాల యూనిఫార్మ్స్ తయారు చేస్తారు. ఈ వ్యాపారం కూడా ఆయనకు బాగానే కలిసి వచ్చింది. దీంతో అతి తక్కువ కాలంలోనే యూఏఈ వ్యాప్తంగా 'ఇంటర్నెషనల్ యూనిఫార్మ్స్' బాగా ఫేమస్ అయింది. ఈ క్రమంలో ఆయన పెద్ద కుమారు రోహిత్.. డాక్టర్ ఆఫ్ ఫార్మాసీ(ఫార్మా డీ) పూర్తి చేయడంతో జైసింఘానీ వైద్య సామాగ్రి పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2012లో 'కీవీ మెడికల్ సప్లైస్' పేరిట ఓ కంపెనీని స్థాపించారు. అనతీకాలంలోనే ఈ సంస్థ యూఏఈలోనే సర్జికల్, స్టెరిలైజేషన్ ఉత్పత్తుల సరఫరాలో టాప్‌లో నిలిచింది. 


ఆ తర్వాత చిన్న కుమారుడు నిఖిల్.. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు. దాంతో ఆయన 'RAM కంప్యూటర్ టెక్నాలజీస్' పేరిట ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థను ప్రారంభించారు. ఇది కూడా విజయవంతమైంది. ఇలా ఇద్దరు కుమారుల సాయంతో పాటు తన కృషితో అంచెలంచెలుగా ఎదిగి యూఏఈలో జైసింఘానీ పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. ఆయన సంస్థల్లో ఇవాళ వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. దీంతో గత వారం 10 ఏళ్ల కాలపరిమితి గల గోల్డెన్ వీసా అందుకున్నారు. గోల్డెన్ వీసా పొందడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన.. తనకు ఇప్పటికే ఇన్వెస్టర్ వీసా కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా యూఏఈ ప్రభుత్వానికి, అధికారులకు జైసింఘానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. నిజాయితీగా కష్టపడి పని చేసి, దృఢ సంకల్పం ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ దేశంలో విజయం సాధించి వారి కలలను సాకారం చేసుకోవచ్చని జైసింఘానీ పేర్కొన్నారు. తన విజయ రహస్యం కూడా ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు. 

తాజా వార్తలుమరిన్ని...