Abn logo
Oct 17 2020 @ 00:42AM

1920 అక్టోబర్‌ 17

వర్తమాన కమ్యూనిస్టు ఉద్యమాన్ని సూక్ష్మీకరించి చెప్పవలసి వస్తే, మూడు స్రవంతులుగా అది నడుస్తోంది. మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాయుధ పోరాట స్రవంతి; మారోజు వీరన్న రూపొందించిన కుల వర్గ దృక్పథం స్రవంతి, వివిధ ఎంఎల్‌ పార్టీల ఆధ్వర్యంలో సాగుతున్న ప్రజా ఉద్యమ స్రవంతి.సిపిఐ, సిపిఎంల నడక మౌలికంగానే కమ్యూనిస్టు స్రవంతి కాదు.


నేటితో భారత కమ్యూనిస్టు ఉద్యమం నూరు వసంతాలు పూర్తి చేసుకొని 101లోకి ప్రవేశిస్తుంది. ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లోని తాష్కెంట్‌ నగరంలో కొందరు మార్క్సిస్ట్‌ భావుకులు సమావేశమై ఇండియన్‌ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రఖ్యాత మార్క్సిస్ట్‌ ఎం.ఏన్‌.రాయ్‌, ఆయన సహచరి హెవిలిన్‌ ట్రిన్‌ రాయ్‌, అభానీ ముఖర్జీ, ఆయన సతీమణి రోజా, మహమ్మద్‌ ఆలీ (అహమద్‌ అసన్‌), మహమ్మద్‌ షఫిక్‌ సిద్ధికీ, అస్రత్‌ మొహనీ, భోపాల్‌కు చెందిన రఫీక్‌ అహమ్మద్‌ ఎం.పి.టి. ఆచార్య, సుల్తాన్‌ అహ్మద్‌ ఖాన్‌, వాయువ్య రాష్ట్రానికి చెందిన తరీన్‌ తదితరులు సమావేశమై భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించే కార్యక్రమాలు రూపొందించుకొన్నారు. ప్రధానవ్యక్తి ఎం.ఎన్‌.రాయ్‌ భారతదేశంలో నివసించకపోవడం వల్ల గానీ, తదితర కారణాల మూలంగా గానీ, ఆ ప్రయత్నం నిర్మాణయుతంగా కొనసాగలేదు. 


అయితే, భారతదేశంలో అప్పటికే కమ్యూనిస్టు పేరుతో చిన్న చిన్న గ్రూపులు విడివిడిగా పనిచేస్తూ వుండేవి. వాటిలో ఎక్కువ భాగం కలిసి, సమన్వయం చేసుకొని 1925 డిశంబరు 26న కాన్పూర్‌ నగరంలో మహాసభను నిర్వహించుకొని, భారత కమ్యూనిస్టు పార్టీ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా) పేరిట పార్టీని ప్రకటించారు. సి.పి.ఐ (భారత కమ్యూనిస్టు పార్టీ)కి సంబంధించినంత వరకు, 1925 డిసెంబరు 26వ తేదీనే పార్టీ ఆవిర్భావ దినంగా గుర్తించి వ్యవహరిస్తోంది. అయితే, సి.పి.ఐ (ఎం) తాష్కెంట్‌లో ప్రారంభం అయిన రోజునే పార్టీ స్థాపన రోజుగా భావిస్తూ, ప్రస్తుత శత వార్షిక దినోత్సవాలను కూడా నిర్వహిస్తోంది. పార్టీ స్ధాపనకి సంబంధించిన తేదీ పైన వున్న భిన్నాభిప్రాయాలను ప్రక్కన పెడితే, 1920 అక్టోబర్‌ 17 భారత కమ్యూనిస్టు ఉద్యమంలో గొప్ప ప్రాముఖ్యం ఉన్న రోజుగానే భావించవలసి వుంటుంది.


భారత కమ్యూనిస్టుపార్టీ నిర్మాణాన్ని చరిత్ర క్రమంలో చూసినప్పుడు, 1925 డిసెంబరు 26న ప్రకటించిన పార్టీకి కేంద్ర కమిటీని ఎన్నుకొన్నది. ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి.ఘాటే. ఆ తరువాత 1964లో సి.పి.ఐ., సి.పి.ఎం. లు రెండుగా విభజన అయ్యే వరకు ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ప్రముఖుల్లో బి.టి. రణదివే, పి.సి.జోషీ, చండ్ర రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఆ కాలంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన అనేక పోరాటాలు జరిగాయి. వాటిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, పశ్చిమ బెంగాల్‌లోని తెబాగా పోరాటం, కేరళలోని పునప్ర-వాయలార ఉద్యమం, మహారాష్ట్రలో వర్లీ రైతాంగ ఉద్యమాలు ప్రముఖమైనవి. భారత కమ్యూనిస్టు పార్టీ అనేక నిర్బంధాలను, కేసులను బ్రిటీష్‌ పాలనా కాలంలోనూ, ఆ తరువాతనూ ఎదుర్కొన్నది. పురోగమన క్రమంలో కమ్యూనిస్టు పార్టీ ఎదుర్కొన్న అనేక కేసులలో పెషావర్‌ కుట్ర కేసు, మీరట్‌ కుట్ర కేసు, కాన్పూర్‌ కుట్ర కేసులు ప్రముఖమైనవి. ఈ పోరాటాల్లో కమ్యూనిస్టు పార్టీ పలువురు నాయకుల్ని, కార్యకర్తలని త్యాగం చేసింది.


కమ్యూనిస్టు ఉద్యమంలో తెలంగాణా పోరాట విరమణ కాలం నుండే ప్రారంభమైన విబేధాలు తర్వాత కూడా కొనసాగాయి. భారత ప్రభుత్వం, 1962భారత్‌-చైనా యుద్ధం సందర్భంలో కమ్యూనిస్టు పార్టీలోని ప్రస్తుత మార్క్సిస్ట్‌ పార్టీ నాయకులను మాత్రమే అరెస్టుచేసి, చీలిక వాతావరణాన్ని పెంచింది. ప్రధానమైన విభేదం పాలక వర్గ కాంగ్రెస్‌ పార్టీ యెడల ఎలాంటి వైఖరి అనుసరించాలనేదే. ప్రస్తుత సి.పి.ఐ. నాయకత్వం ఆనాడు మితవాద, మతవాద శక్తులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ప్రధాన నాయకత్వం ఘర్షణ పడుతున్నదనీ, కనుక, వారికి కమ్యూనిస్టు పార్టీ సహకరించాలనే వాదన ముందుకు తెచ్చింది. అందుకు భిన్నంగా, కాంగ్రెస్‌లోని ఆ సెక్షన్‌ని బలపరచడం సరైనది కాదనే వైఖరిని ప్రస్తుత మార్క్సిస్ట్‌ పార్టీ నాయకత్వం తీసుకొన్నది. కాంగ్రెస్‌ లోపల, వెలుపల ఉన్న మితవాద, మతవాద శక్తులకీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన నాయకత్వానికీ మధ్య మౌళికమైన అంతరాలు ఏమీ లేవు గనుక, బలపరచాల్సిన అవసరం లేదనేది ప్రస్తుత మార్క్సిస్ట్‌ పార్టీ నాయత్వం తీసుకొన్న ఆనాటి వైఖరి. పార్టీ జాతీయ పమితిలోని సుందరయ్య, నంబూద్రిపాద్‌, జోతీబాసు వంటి ప్రముఖులు రాజీనామాలు సమర్పించి బయటికి వచ్చారు. ఆ తరువాత 1964 అక్టోబర్‌ 31 - నవంబర్‌ 7ల మధ్య జరిగిన కలకత్తా మహాసభలో భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్టు) ని నెలకొల్పారు. ప్రధాన కార్యదర్శిగా సుందరయ్య ఎన్నికయ్యారు. 


సి.పి.ఐ., సి.పి.ఎం. లకు మధ్య చీలికకు ప్రధాన కారణం పాలక కాంగ్రెస్‌ యెడల వైఖరే అయినప్పటికీ, అదే కాలంలో అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో, ముఖ్యంగా రష్యా, చైనా పార్టీల మధ్య పొడచూపిన విబేధాల ప్రభావం కూడా పార్టీ చీలికపైన వున్నది. ప్రస్తుత సి.పి.ఐ. నాయకత్వం సోవియట్‌ అనుకూల వైఖరి తీసుకోగా, సి.పి.ఐ (ఎం) నాయకత్వం చైనా అనుకూల వైఖరి చేపట్టింది. అయితే, పార్టీ ఏర్పడిన తరువాత సి.పి.ఎం. నాయకత్వాన్ని ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అరెస్టు చేసింది. విడుదల అయి వచ్చిన తరువాత, 1967లో మూడు రాష్ట్రాల్లో అధికార పగ్గాలు మార్క్సిస్ట్‌ పార్టీ చేపట్టింది. తదనంతర కాలంలో మార్క్సిస్ట్‌ పార్టీ నాయకత్వం పార్లమెంటరీ విధానాన్ని సిద్ధాంతీకరించే వైఖరినీ, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో తటస్థ వైఖరినీ తీసుకొన్నదని పార్టీలోని ఒక విభాగం, ముఖ్యంగా రాష్ట్రస్థాయి నాయకత్వాలు భావించాయి. అదే సమయంలో 1967 మే నెలలో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లా, సిలుగురి సబ్‌ డివిజన్‌లోని నగ్జల్‌బరి ప్రాంతంలో చారుమజుందార్‌, కానూ సన్యాల్‌, జంగల్‌ సంతాల్‌ వంటి నాయకుల ఆధ్వర్యంలో సంతాల్‌ రైతాంగం భూస్వామ్య శక్తులపైన సాయుధ తిరుగుబాటు చేసింది. 


నగ్జల్బరీ పోరాటానికి నాయకత్వం వహించిన చారూమజుందార్‌ బృందం వివిధ రాష్ట్రాల్లోని కమ్యూనిస్టు శ్రేణులతో సంబంధాలు ఏర్పరచుకొన్నది. పశ్చిమ బెంగాల్‌లోనే గాక, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్ధాన్‌, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో కూడా నగ్జల్బరి తరహా సాయుధ తిరుగుబాట్లను ఆర్గనైజ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సిద్ధాంత రాజకీయ పోరాటం చాలా పెద్ద స్థాయిలో జరిగింది. రాష్ట్ర కమిటిలోని ఒక ముఖ్యమైన నాయకత్వం నగ్జల్బరి పోరాటాన్ని బలపరచి, పార్టీ కేంద్ర కమిటి వైఖరిని ఖండించింది. ప్రత్యేక రాష్ట్ర కమిటీగా కూడా ఏర్పడింది. ఈ చర్చలో ప్రధాన భూమికను చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, కొల్లా వెంకయ్య తదితరులు నిర్వహించారు. గుంటూరులో నగ్జల్బరి పోరాట సంఘీభావ కమిటిగా ఏర్పడి, సైద్ధాంతిక రాజకీయ ప్రచారాన్ని ఉధృతంగా సాగించారు.


అదే కాలంలో, శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం, పాలకొండ, పాతపట్నం తాలుకాల్లోని గిరిజన ప్రాంతాల్లో వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంల నాయత్వంలో గిరిజనులు భూస్వాములపైన సాయుధ పోరాటానికి సంసిద్ధమయ్యారు. ఆ పోరాటానికి నాయత్వం వహించి నడిపించడానికి నాగిరెడ్డి ఆధ్వర్యంలో యేర్పడిన రాష్ట్ర కమిటి సిద్ధం కాలేదు. శ్రీకాకుళ పోరాట నాయకత్వం పంచాది కృష్ణమూర్తి ద్వారా పశ్చిమ బెంగాల్‌ నుండి చారూ మజుందారుని ఆంధ్రప్రదేశ్‌కి పిలిపించారు. గుంటూరు జిల్లా గుత్తికొండ బిలం వద్ద సమావేశమైన ప్రతినిధులు (ఈ వ్యాస రచయిత కూడా) సాయుధ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని నిర్ణయించుకొని ప్రత్యేక రాష్ట్ర కమిటి ఏర్పరిచారు. శ్రీకాకుళ సాయుధ పోరాటాన్ని ప్రారంభించి కొనసాగించారు.


ఈ సందర్బంగా ముఖ్యగా చెప్పుకొనవలసింది, మారోజు వీరన్న నాయకత్వాన ఏర్పడిన సిపియుఎస్‌ఐ (బహుజన శ్రామిక విముక్తి). పూర్తి పేరు ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ (బహుజన శ్రామిక విముక్తి). అసమాన దొంతర్లతో కూడిన కుల వ్యవస్థ లోతుగా వేళ్ళూనుకొనిపోయివున్న ఇండియాలో, కమ్యూనిస్టు పార్టీకి శ్రామిక వర్గ దృక్పథంతోపాటు, అణచబడ్డ కులాల విముక్తి దృక్పథం కూడా ఉండాలి, అనేది ఈ పార్టీ సిద్ధాంతం. చారూ మజుందార్‌ నాయత్వంలో నగ్జల్బరీ పోరాటం కమ్యూనిస్టు ఉద్యమానికి సాయుధ మలుపు కాగా, మారోజు వీరన్న నాయకత్వంలో ఏర్పడిన సిపియుఎస్‌ఐ (బహుజన శ్రామిక విముక్తి) భారత కమ్యూనిస్టు ఉద్యమానికి సామాజిక మలుపు. వీరన్న సాగించిన సిద్ధాంత, రాజకీయ కృషిలో ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా. కృషి ప్రముఖంగా వున్నది. వర్తమాన కమ్యూనిస్టు ఉద్యమాన్ని సూక్ష్మీకరించి చెప్పవలసి వస్తే, మూడు స్రవంతులుగా అది నడుస్తోంది. మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాయుధ పోరాట స్రవంతి; మారోజు వీరన్న రూపొందించిన కుల వర్గ దృక్పథం స్రవంతి, వివిధ ఎంఎల్‌ పార్టీల ఆధ్వర్యంలో సాగుతోన్న ప్రజా ఉద్యమ స్రవంతి. సిపిఐ, సిపిఎంల నడక మౌలికంగానే కమ్యూనిస్టు స్రవంతి కాదు. అనేక సామాజిక, ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్న ప్రజల్ని సమీకరించి, నడిపించడంలో సాయుధ పోరాట రూపమే కాకుండా, అనేక ప్రజాస్వామిక రూపాలు అవసరం అవుతాయి. అణచబడ్డ కులాలకి ఆత్మ గౌరవ పరిరక్షణ పోరాట రూపాలు కూడా అవసరం. వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని, కుల - వర్గ దృక్పధంతో కమ్యూనిస్టు ఉద్యమం తమ వంతు పాత్ర నిర్వహించాలని బహుజనులు కోరుకొంటారు.


వై.కె. (సామాజిక న్యాయ కేంద్రం)