యూరప్‌లో ఎన్నారైల‌కు భార‌తీయ సంఘాల‌ చేయూత

ABN , First Publish Date - 2020-04-04T13:51:03+05:30 IST

యూర్‌పలో కొవిడ్‌-19 ప్రభావానికి గురైన వేలాది మంది భారతీయ విద్యార్థులు, ఉద్యోగస్థులకు అక్కడి భారతీయ సంస్థలు వివిధ సేవా కార్యక్రమాలతో తోడ్పాటును అందిస్తున్నాయి.

యూరప్‌లో ఎన్నారైల‌కు భార‌తీయ సంఘాల‌ చేయూత

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: యూర్‌పలో కొవిడ్‌-19 ప్రభావానికి గురైన వేలాది మంది భారతీయ విద్యార్థులు, ఉద్యోగస్థులకు అక్కడి భారతీయ సంస్థలు వివిధ సేవా కార్యక్రమాలతో తోడ్పాటును అందిస్తున్నాయి. అవసరమైన వైద్య సేవలతో పాటు వెబ్‌నార్‌ ద్వారా సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. వీసా గడువు పొడిగించుకోవడంలోనూ కృషి చేస్తున్నాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ  ఇరవై నాలుగు గంటలు పనిచేసే కొవిడ్‌-19 సెల్‌ని ఏర్పాటు చేసింది. ఈ సెల్‌లో 75 మంది అధికారులు, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. లండన్‌లోని హైకమిషన్‌ ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, స్వల్పకాల వీసాలపై వచ్చిన యాత్రికులను దృష్టిలో ఉంచుకొని సబ్సిడీపై ఆహార, వసతి సౌకర్యాలను కల్పించింది. ఇందుకోసం భారతీయ హైకమిషన్‌ స్థానికంగా ఉన్నటువంటి ఎన్‌జివోలు, విద్యార్థి సంఘాలు, ఇతర కమ్యూనిటీ గ్రూపుల సహాయం తీసుకుంది.


అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్న భారతీయులకు  స్థానిక స్వచ్చంద సంస్థల ద్వారా, ఎంపిక చేసిన డాక్టర్ల బృందాన్ని పంపించడం ద్వారా వైద్య సేవలు అందిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను వినియోగంలోకి తెచ్చారు. యూర్‌ప్‌లో  కరోనా మహమ్మారి ప్రభావానికి తీవ్రంగా గురైన దేశం జర్మనీ. మార్చి 31 వరకు ఇక్కడ 67 వేల పైచిలుకు  ఈ మహమ్మారి బారిన పడ్డారు. బెర్లిన్‌, ఫ్రాంక్‌ఫర్ట్‌, హంబర్గ్‌, మ్యూనిచ్‌ తదితర ప్రాంతాల్లో సుమారు 22 వేల మంది భారతీయ విద్యార్థులకు అక్కడి మన సంస్థలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి.


ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి యూర్‌పలోని వివిధ భారతీయ సంస్థలు, కాన్సులేట్‌కు ఐదు వేలకు పైగా ఫోన్‌కాల్స్‌, 2500కు పైగా ఈమెయిల్స్‌ సహాయం అర్థిస్తూ వచ్చాయి. వీరిలో అత్యధిక మంది ఒంటరితనంతో బాధపడుతున్న  యువకులే ఉన్నారు. సుమారుగా 60  వరకు విద్యార్థి సంఘాలు, భారతీయ అసోసియేషన్లు జర్మనీలో కొవిడ్‌ ప్రభావితులకు సేవలు అందిస్తున్నాయి. స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్‌ల్లో కూడా ఇదే మాదిరిగా భారతీయులను అక్కడి మన సంఘాలు ఆదుకునే పనిలో నిమగ్నమై ఉన్నాయి.

Updated Date - 2020-04-04T13:51:03+05:30 IST