భార‌తీయ స‌మాజాన్ని ఉద్దేశించి మంత్రి జైశంక‌ర్ ప్ర‌సంగం

ABN , First Publish Date - 2021-06-12T18:40:54+05:30 IST

భార‌త విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ రెండు రోజుల‌ కువైత్ ప‌ర్య‌టన‌లో భాగంగా శుక్ర‌వారం సాయంత్రం భార‌తీయ స‌మాజాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

భార‌తీయ స‌మాజాన్ని ఉద్దేశించి మంత్రి జైశంక‌ర్ ప్ర‌సంగం

కువైత్ సిటీ: భార‌త విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ రెండు రోజుల‌ కువైత్ ప‌ర్య‌టన‌లో భాగంగా శుక్ర‌వారం సాయంత్రం భార‌తీయ స‌మాజాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. కువైత్‌లోని భార‌త్ ఎంబ‌సీ వ‌ర్చువ‌ల్‌గా ఏర్పాటు చేసిన ఈ మీటింగ్‌లో రాయ‌బారి సీబీ జార్జ్ కూడా పాల్గొన్నారు. ఈ స‌మావేశం ఎంబ‌సీకి సంబంధించిన అన్ని సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం అయింది. మంత్రి జైశంక‌ర్ మాట్లాడుతూ.. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కువైత్ అథారిటీస్‌తో జ‌రిగిన చ‌ర్చ‌ల‌ను వివ‌రించారు. క‌రోనా కార‌ణంగా కువైత్‌, స్వ‌దేశంలో ప్ర‌వాసులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, వాటి ప‌రిష్కారంపై ప్రధానంగా చ‌ర్చించిన‌ట్లు ఈ సంద‌ర్భంగా మంత్రి పేర్కొన్నారు. అలాగే ఇరు దేశాల మ‌ధ్య దీర్ఘ‌కాలిక ద్వైపాక్షిక సంబంధాల‌పై కూడా మాట్లాడిన‌ట్లు తెలిపారు. ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌ల వ‌ల్ల ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌లు , రెండు దేశాల మ‌ధ్య విమాన స‌ర్వీసుల పున‌రుద్ధ‌ర‌ణ త‌దిత‌ర విష‌యాల‌పై సంబంధిత అధికారుల‌తో చ‌ర్చించినట్లు చెప్పారు. 


ఇక జీసీసీ దేశాల రాయ‌బారుల‌తో జరిగిన భేటీలోనూ సాధ్య‌మైనంత త్వ‌ర‌గా క‌రోనా ఆంక్ష‌లపై త‌గిన నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరిన‌ట్లు చెప్పారు. విమాన స‌ర్వీసుల ర‌ద్దు కార‌ణంగా కొంత‌మంది ప్ర‌వాసులు స్వ‌దేశంలోని కుటుంబాల‌కు దూర‌మైతే, మ‌రికొంద‌రు స్వ‌దేశంలో ఇరుక్కుపోయి ఉపాధి కోల్పోయిన ప‌రిస్థితుల‌ను రాయ‌బారుల దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు మంత్రి తెలిజేశారు. అలాగే ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న‌ కువైత్‌లో గృహ కార్మికులకు చ‌ట్ట ర‌క్ష‌ణ ఒప్పందం ఈసారి సాకారం అయింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇక క‌రోనా సంక్షోభం సమ‌యంలో కువైత్ ప్ర‌భుత్వంతో పాటు ఇక్క‌డి భార‌తీయ స‌మాజం భార‌త్‌కు అందించిన సాయం ఎప్ప‌టికీ మ‌రిచిపోలేమ‌ని మంత్రి అన్నారు. విదేశాల్లో భార‌తీయులు ఎక్క‌డ ఉన్నా.. దేశ గౌర‌వాన్ని పెంచేలా మ‌స‌లుకోవాల‌ని పిలుపునిచ్చారు.  

Updated Date - 2021-06-12T18:40:54+05:30 IST