షార్జాలో చిక్కుకున్న 22 మంది భారత కార్మికులు.. కాన్సులేట్ సాయంతో..

ABN , First Publish Date - 2020-04-09T15:19:47+05:30 IST

ఏజెంట్ల మోసం ఒక‌వైపు, క‌రోనా క‌ల్లోలం మ‌రోవైపు వెర‌సీ 22 మంది భార‌తీయ కార్మికులు షార్జాలో రోడ్డున ప‌డ్డారు.

షార్జాలో చిక్కుకున్న 22 మంది భారత కార్మికులు.. కాన్సులేట్ సాయంతో..

షార్జా: ఏజెంట్ల మోసం ఒక‌వైపు, క‌రోనా క‌ల్లోలం మ‌రోవైపు వెర‌సీ 22 మంది భార‌తీయ కార్మికులు షార్జాలో రోడ్డున ప‌డ్డారు. మార్చి నెల మొద‌టి వారంలో ఉపాధి కోసం షార్జా వెళ్లిన వీరికి ఇప్ప‌డు పూట గ‌డ‌వ‌డం కూడా గ‌గ‌నంగా మారింది. ట్విట్ట‌ర్ ద్వారా వీరి దీన ప‌రిస్థితిని తెలుసుకున్న షార్జాలోని భార‌త కాన్సులేట్ అధికారులు ఆహార సామాగ్రి, నిత్యావ‌స‌ర స‌ర‌కుల‌ను అందించ‌డంతో పాటు వ‌స‌తి సౌక‌ర్యం క‌ల్పించారు. ప్ర‌స్తుతం షార్జాలోని రోల్లా ప్రాంతంలో ఈ కార్మికుల‌ను ఉంచారు. 


ఈ 22 మంది కార్మికుల గ్రూపులో ఒక‌రైన దానిష్ అలీ మాట్లాడుతూ... "మార్చి నెల ప్రారంభంలో ఉపాధి కోసం యూపీకి చెందిన‌ మేము(22 మంది) షార్జా వ‌చ్చాం. ఇక్క‌డ స‌రియైన ప‌ని దొర‌క‌కపోవ‌డంతో తిరిగి స్వ‌దేశానికి వెళ్లిపోదామ‌ని మాలో చాలా మంది విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ, మార్చి 22న ఇండియాలో జ‌న‌తా క‌ర్ఫ్యూ, ఆ త‌రువాతి రోజు నుంచి లాక్‌డౌన్ అమ‌లు చేయ‌డంతో విమాన స‌ర్వీసులు ర‌ద్దు అయ్యాయి. ఏజెంట్లు చేసిన మోసంతో ప‌ని దొర‌క‌క క‌ష్ట‌ప‌డుతున్న మాకు విమాన స‌ర్వీసులు నిలిచిపోవ‌డంతో షార్జాలో చిక్కుకుపోయాం. దీంతో ట్విట్ట‌ర్ ద్వారా మా గోడును షార్జాలోని భార‌త కాన్సులేట్‌కు తెలిజేశాం. మా దీన ప‌రిస్థితిని అర్థం చేసుకున్న కాన్సులేట్‌ అధికారులు సహాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. ఆహార సామాగ్రితో పాటు నిత్యావ‌స‌ర స‌రుకులు అందించారు. ప్ర‌స్తుతం మేము షార్జాలోని రోల్లా ప్రాంతంలో త‌ల‌దాచుకుంటున్నామ‌ని" అలీ తెలిపారు. 


ఈ 22 మంది కార్మికుల‌ను ఏజెంట్లు మోస‌పూరితంగా టూరిస్ట్‌ వీసాల‌పై షార్జాకు తీసుకొచ్చార‌ని కాన్సులేట్ అధికారి జితేంద‌ర్ సింగ్ నేగి తెలిపారు. కొంద‌రికి నెల రోజుల గడువు, మ‌రికొంద‌రికి మూడు నెల‌ల గ‌డువుతో ఈ వీసాలు ఉన్నాయన్నారు. షార్జా వ‌చ్చిన త‌ర్వాత ఏజెంట్లు మోసం చేశార‌నే విష‌యాన్ని గ్ర‌హించిన కార్మికులు కాన్సులేట్ అధికారుల‌ను ట్విట్ట‌ర్ ద్వారా సంప్ర‌దించ‌డం జ‌రిగింద‌ని, దాంతో వెంట‌నే వారికి తాత్కాలిక వ‌స‌తితో పాటు, భోజ‌న సామాగ్రిని, నిత్యావ‌స‌ర సరకుల‌ను అందించామ‌ని నేగి చెప్పారు.  


Updated Date - 2020-04-09T15:19:47+05:30 IST