వీసా గ‌డువు ముగిసిన వారి కోసం.. భార‌త కాన్సులేట్‌ స్పెష‌ల్ డ్రైవ్‌

ABN , First Publish Date - 2020-08-30T18:35:40+05:30 IST

వీసా గ‌డువు ముగిసి పాస్‌పోర్టు, ఇత‌ర ధృవప‌త్రాలు లేక దుబాయ్‌లోనే ఉండిపోయిన భార‌త ప్ర‌వాసుల‌కు ఇండియ‌న్ కాన్సులేట్ ఊర‌ట‌నిచ్చే నిర్ణ‌యం తీసుకుంది.

వీసా గ‌డువు ముగిసిన వారి కోసం.. భార‌త కాన్సులేట్‌ స్పెష‌ల్ డ్రైవ్‌

దుబాయ్: వీసా గ‌డువు ముగిసి పాస్‌పోర్టు, ఇత‌ర ధృవప‌త్రాలు లేక దుబాయ్‌లోనే ఉండిపోయిన భార‌త ప్ర‌వాసుల‌కు ఇండియ‌న్ కాన్సులేట్ ఊర‌ట‌నిచ్చే నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప్ర‌వాసులంద‌రినీ స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు రెండు నెల‌ల పాటు స్పెష‌ల్ డ్రైవ్ చేప‌డ‌తున్న‌ట్లు దుబాయ్‌లోని ఇండియ‌న్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ అమ‌న్ పూరి వెల్ల‌డించారు. అమ‌న్ పూరి మాట్లాడుతూ... క‌రోనా ప్ర‌భావంతో ఉపాధి కోల్పోయి చాలా మంది ప్ర‌వాసీయులు యూఏఈలోనే ఉండిపోయారు. మ‌రికొంద‌రికి వారి యాజ‌మాన్యాలు జీతం లేని సెల‌వులు ప్ర‌క‌టించాయి. ఇలా ప‌లు కార‌ణాల వ‌ల్ల ప్ర‌వాసుల‌కు వీసా రెన్యూవ‌ల్ చేసుకునే అవ‌కాశం లేకుండా పోయింది. స్వ‌దేశానికి వెళ్లిపోదామ‌నుకున్న చాలా మంది ప్ర‌వాసుల పాస్‌పోర్టులు వారి స్పాన్స‌ర్లు, య‌జ‌మానుల వ‌ద్ద ఉండిపోయాయి. దాంతో భార‌త ప్ర‌భుత్వం విదేశాల్లో చిక్కుకున్న ప్ర‌వాసుల‌ను స్వ‌దేశానికి త‌రించేందుకు చేప‌ట్టిన 'వందే భార‌త్ మిష‌న్' విమానాల్లో టికెట్ బుక్ చేసుకునే వీలు లేకుండా పోయింద‌ని భార‌త కాన్సుల‌ర్ అన్నారు. 


మ‌రోవైపు దుబాయ్ సర్కార్ మార్చి 1వ తేదీతో వీసా గడువు ముగిసిన ప్ర‌వాసులు న‌వంబ‌ర్ 17లోగా దేశం విడిచి వెళ్లిపోతే ఎలాంటి జ‌రిమానాలు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. దీంతో వీసా గ‌డువు ముగిసిన భార‌త ప్ర‌వాసులు ఇప్పుడు భారీ మొత్తంలో ఎమ‌ర్జెన్సీ స‌ర్టిఫికేట్ల కోసం ద‌ర‌ఖాస్తు చేస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. అలాంటి వారి కోస‌మే భార‌త కాన్సులేట్ ప్రత్యేక ప‌థ‌కం ద్వారా స‌రైన‌ ధృవప‌త్రాలు లేకపోయిన ఎమ‌ర్జెన్సీ స‌ర్టిఫికేట్లు జారీ చేసి వారిని భార‌త్‌కు పంపించేందుకు చొర‌వ తీసుకుంటుంద‌ని అమ‌న్ పూరి తెలిపారు. అందుకే ఇండియ‌న్ కాన్సులేట్ ఈ రెండు నెలల స్పెష‌ల్ డ్రైవ్ చేప‌డుతోంద‌ని అన్నారు. ఈ సేవ‌ల‌ను దుబాయ్‌కే ప‌రిమితం చేయ‌కుండా యూఏఈలోని ఫుజైరా, రాస్ అల్ ఖైమాల‌లో కూడా చేప‌డ‌తామ‌ని చెప్పారు. కాగా, 'వందే భార‌త్ మిష‌న్' చేప‌ట్టిన త‌ర్వాత నుంచి ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 3.70 ల‌క్ష‌ల మంది ప్ర‌వాసులు యూఏఈ నుంచి స్వ‌దేశానికి త‌ర‌లివెళ్లార‌ని, మ‌రో 6 ల‌క్ష‌ల మంది భార‌త్‌కు వెళ్లేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.     

Updated Date - 2020-08-30T18:35:40+05:30 IST