New York లో భారతీయ ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి.. ఇండియన్ కాన్సులేట్ మండిపాటు!

ABN , First Publish Date - 2022-01-09T15:53:32+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి విద్వేషపూరిత దాడి జరిగింది.

New York లో భారతీయ ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి.. ఇండియన్ కాన్సులేట్ మండిపాటు!

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి విద్వేషపూరిత దాడి జరిగింది. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయం బయట భారత సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై ఓ అమెరికన్ విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. సిక్కు వ్యక్తి తలపై ధరించిన టర్బన్‌ను అమెరికన్ తొలగించడంతో పాటు చేయి చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవజోత్ పాల్ కౌర్ అనే మహిళ జనవరి 4న ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 26 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఎయిర్‌పోర్టు బయట ఘటన సమయంలో ఓ వ్యక్తి చిత్రీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. గత కొంతకాలంగా సిక్కు డ్రైవర్లపై ఇలాంటి దాడులు తరచూ జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆమె విచారం వ్యక్తం చేశారు.




ఇక సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ వీడియో తాజాగా న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ దృష్టికి వెళ్లింది. దీంతో స్పందించిన కాన్సులేట్.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇది తీవ్ర కలవరపాటుకు గురి చేసిందని పేర్కొంది. ఈ విషయాన్ని వెంటనే అమెరికా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించింది. ఈ మేరకు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అసలు ఈ ఘటనకు కారణమేంటి? అనే వివరాలు తెలియరాలేదు.   



Updated Date - 2022-01-09T15:53:32+05:30 IST