ఇది అన్యాయం.. బ్రిటన్ ప్రభుత్వానికి భారత సంతతి డాక్టర్ల లేఖ

ABN , First Publish Date - 2020-03-27T02:32:04+05:30 IST

ఇమిగ్రేషన్ హెల్త్ సర్ చార్జ్‌ను తొలగించాలంటూ బ్రిటన్ ప్రభుత్వానికి భారత సంతతి డాక్టర్ల లేఖ

ఇది అన్యాయం.. బ్రిటన్ ప్రభుత్వానికి భారత సంతతి డాక్టర్ల లేఖ

లండన్: యావత్ బ్రిటన్ ప్రస్తుతం కరోనా కింద పడి నలిగిపోతోంది. వ్యాధి సోకిన వారిని కాపాడేందుకు అక్కడి డాక్టర్లు నిరంతరం కష్టపడుతున్నారు. భారత సంతతి చెందిన డాక్టర్లు కూడా దేశాన్ని కరోనా పిడికిలి నుంచి విడిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలా అందరితో సమానంగా కష్ట పడుతున్నా కూడా తమపై ఇమిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్ విధించడాన్ని వారు ఆక్షేపిస్తున్నారు. ఇలాంటి సమయాల్లోనూ సర్ చార్జ్ విధించడమనేది అన్యాయమని, వివక్షాపూరితమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కారణంగా సదరు చార్జ్‌ను ఉపసంహరించుకోవాలంటూ నేషనల్ హెల్త్ సర్వీసెస్ కింద సేవలందిస్తున్న భారత సంతతి డాక్టర్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు లేఖ రాశారు. 


ఏమిటి ఇమిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్..

ఇమిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్ 2015లో అమల్లోకి వచ్చింది. ఫ్యామిలీ, స్టడీ లేదా పని వీసాలపై వచ్చి, ఆరు నెలల కంటే ఎక్కవ కాలంపాటూ బ్రిటన్‌లో ఉంటున్న వారు ప్రభుత్వానికి ఈ సర్ చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. నేషనల్ హెల్త్ సర్వీసెస్‌కు కోసం అదనపు నిధులు సేకరించేందుకు అక్కడి ప్రభుత్వం దీన్ని ప్రవేశ పెట్టింది. 400 పౌండ్లుగా ఉన్న దీన్ని గత బడ్జెట్‌లో 600 పౌండ్లకు పెంచారు.

ఈ సర్ చార్జ్‌ను తొలగించాలంటూ బ్రిటీష్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(బీఏపీఐఓ) అనేక ఏళ్లుగా పోరాడుతోంది. ‘ఇలా సర్ చార్జ్ విధించడం అన్యాయమే కాదు వివక్షత ప్రదర్శించడం కూడా. బ్రటిన్‌లోని విదేశీ సంతతి వారు ఇప్పటికే ఇన్సూరెన్సులు, ఇన్‌కమ్‌ట్యాక్స్ రూపంలో తమ వంతు ధనం చెల్లిస్తున్నారు’ అని బీఏపీఐఓ ప్రతినిధులు చెబుతున్నారు. 




Updated Date - 2020-03-27T02:32:04+05:30 IST