Kuwait లోని భారత ఎంబసీ కీలక ప్రకటన.. ఆ సర్వీసులు రేపటి నుంచి ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-10T13:56:50+05:30 IST

కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం కాన్సులర్ సర్వీసుల విషయమై తాజాగా కీలక ప్రకటన చేసింది.

Kuwait లోని భారత ఎంబసీ కీలక ప్రకటన.. ఆ సర్వీసులు రేపటి నుంచి ప్రారంభం

కువైత్ సిటీ: కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం కాన్సులర్ సర్వీసుల విషయమై తాజాగా కీలక ప్రకటన చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఇవాళ(సోమవారం) ఎంబసీ మూసి ఉంటుందని పేర్కొన్న అధికారులు.. ఎమర్జెన్సీ సర్వీసులకు ఎలాంటి అంతరాయం ఉండదని తెలిపారు. అలాగే షరాఖ్, ఫహహీల్, జలేబ్ అల్ షువైఖ్‌లలోని సీకేజీఎస్ కేంద్రాల్లో పాస్‌పోర్టు సేవలు కూడా యధావిధిగా ఉంటాయని తెలియజేశారు. ఇక కువైత్‌లోని బీఎల్ఎస్ ఇంటర్నెషనల్‌.. కాన్సులర్, పాస్‌పోర్టు, వీసా సర్వీసుల కోసం ఇండియన్ ఎంబసీతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 2022 జనవరి నుంచి బీఎల్ఎస్ ఇంటర్నెషనల్‌ ఈ సర్వీసులను ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించింది. ఈ సర్వీసులను ఎంబసీ మంగళవారం(జనవరి 11) నుంచి ప్రారంభిస్తుంది.


కాగా, ఇప్పటివరకు కువైత్‌లో ఇండియన్ పాస్‌పోర్టు, వీసా సేవలను సీకేజీఎస్ అందించింది. ఇప్పుడు సీకేజీఎస్ చేతి నుంచి ఈ బాధ్యతలను బీఎల్ఎస్ ఇంటర్నెషనల్‌‌కు అందించింది భారత ఎంబసీ. దీంతో షరాఖ్, ఫహహీల్, జలేబ్ అల్ షువైఖ్‌లలో మూడు కేంద్రాలను తెరిచి కాన్సులర్, పాస్‌పోర్టు, వీసా సర్వీసులను అందించేందుకు బీఎల్ఎస్ రెడీ అవుతోంది. వీటితో పాటు దరఖాస్తుదారులకు కొన్ని ఇతర సేవలు(ఫార్మ్ ఫిలింగ్, ప్రిటింగ్, ఫొటోగ్రఫీ) కూడా అందించనుంది. దీనిలో భాగంగా కంపెనీ ప్రతి యేటా సుమారు 2లక్షల దరఖాస్తులను ప్రాసెస్ చేస్తుందని భావిస్తున్నారు. ఇక బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ కెనడా, యూఏఈ, రష్యా, సింగపూర్, చైనా, మలేషియా, ఒమన్, ఆస్ట్రియా, పోలాండ్, లిథువేనియా, నార్వే, హాంకాంగ్ వంటి దేశాల్లో దశాబ్ద కాలంగా భారతీయ మిషన్లకు విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతోంది.  

Updated Date - 2022-01-10T13:56:50+05:30 IST