Abu Dhabi Big Ticket: జాక్‌పాట్‌కే జాక్‌పాట్ ఇది.. రెండోసారి కొన్న లాటరీ టికెట్‌పైనే భారత వ్యక్తి ఎంత గెలుచుకున్నాడంటే..

ABN , First Publish Date - 2021-12-04T13:52:11+05:30 IST

అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అప్పటివరకు సాధారణ జీవితం గడిపిన వాళ్లు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వర్లుగా అవతరిస్తుంటారు. ఇది కేవలం లాటరీ వల్లే సాధ్యమవుతుంది. ఒమన్‌లో ఉండే భారత ప్రవాసుడి విషయంలో కూడా అదే జరిగింది. అదృష్టం వరించడంతో మనోడు అబుధాబి బిగ్‌ టికెట్ లాటరీలో ఏకంగా 10 మిలియన్ దిర్హమ్స్(రూ.20.50కోట్లు) గెలుచుకున్నాడు.

Abu Dhabi Big Ticket: జాక్‌పాట్‌కే జాక్‌పాట్ ఇది.. రెండోసారి కొన్న లాటరీ టికెట్‌పైనే భారత వ్యక్తి ఎంత గెలుచుకున్నాడంటే..

అబుధాబి: అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అప్పటివరకు సాధారణ జీవితం గడిపిన వాళ్లు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వర్లుగా అవతరిస్తుంటారు. ఇది కేవలం లాటరీ వల్లే సాధ్యమవుతుంది. ఒమన్‌లో ఉండే భారత ప్రవాసుడి విషయంలో కూడా అదే జరిగింది. అదృష్టం వరించడంతో మనోడు అబుధాబి బిగ్‌ టికెట్ లాటరీలో ఏకంగా 10 మిలియన్ దిర్హమ్స్(భారత కరెన్సీలో రూ.20.50కోట్లు) గెలుచుకున్నాడు. లాటరీ టికెట్ కొనుగోలు చేసిన రెండోసారికే ఆయనకు ఈ జాక్‌పాట్ తగలడం విశేషం. కేరళకు చెందిన రెంజిత్ వేణుగోపాలన్ ఉన్నితన్(42) అనే భారతీయుడే ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. శుక్రవారం రాత్రి తీసిన బిగ్‌ టికెట్ రాఫెల్ డ్రాలో వేణుగోపాలన్ విజేతగా నిలిచాడు. ఇటీవల కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం.052706 అతడికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దీంతో వేణుగోపాలన్ ఆనందానికి అవధుల్లేవు. కలలో కూడా ఊహించని విధంగా ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 


"12 ఏళ్లుగా ఒమన్‌లో ఉంటున్నాను. రెండేళ్ల క్రితం తొలిసారి బిగ్ టికెట్ రాఫెల్‌లో పాల్గొన్నాను. కొంతమంది స్నేహితులతో కలిసి ఆ లాటరీ టికెట్ కొన్నాను. కానీ, అందులో మేము ఏమీ గెలుచుకోలేకపోయాం. అప్పటి నుంచి లాటరీ టికెట్ కొనుగోలు చేయలేదు. అయితే 2021 మాకు కలిసి వస్తుందేమోనన్న ఆశతో గత నెలలో మరోసారి అందరం కలిసి లాటరీ టికెట్ కొన్నాం. అదే మాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. లాటరీ టికెట్ కొనేందుకు సహకరించిన ఆరుగురు మిత్రులతో కలిసి ఈ మొత్తాన్ని పంచుకుంటాను" అని వేణుగోపాలన్ అన్నాడు.


ఇక శుక్రవారం నిర్వహించిన బిగ్ టికెట్ డ్రా ప్రత్యక్షప్రసారాన్ని కూడా వేణుగోపాలన్ చూడలేదు. స్నేహితులు ఫోన్ చేసి ఆయనకు తాము లాటరీ గెలిచినట్లు చెప్పారు. కానీ, మొదట అతను నమ్మలేదు. ఏదో ఆటపట్టిస్తున్నారని అనుకున్నారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో విజేత వివరాలు చూడడంతో పాటు లాటరీ నిర్వాహకులు కూడా వేణుగోపాలన్‌కు ఫోన్ చేయడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాకు చెందిన వేణుగోపాలన్‌కు భార్య, ఐదేళ్ల కూతురు ఉన్నారు. అనుకోకుండా వచ్చిన ఈ భారీ నగదును ఏం చేయాలో ఇంకా ఏమీ అనుకోలేదని వేణుగోపాలన్ పేర్కొన్నాడు. 

Updated Date - 2021-12-04T13:52:11+05:30 IST