రూ. కోటి జరిమానా మాఫీ.. 14 ఏళ్ల తర్వాత మాతృభూమికి తెలుగోడు

ABN , First Publish Date - 2020-09-27T15:33:51+05:30 IST

ఉపాధి కోసం యూఏఈ వెళ్లిన తెలుగు వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై 14 ఏళ్లుగా అక్కడే ఉండిపోయాడు. దీంతో అతనికి ఓవర్ స్టే కింద 511,200 దిర్హమ్స్(రూ. కోటి 2 లక్షల) జరిమానా పడింది. చివరకు ఓ న్యాయవాది అతని పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ భారీ జరిమానా మాఫీ అయింది.

రూ. కోటి జరిమానా మాఫీ.. 14 ఏళ్ల తర్వాత మాతృభూమికి తెలుగోడు

దుబాయ్: ఉపాధి కోసం యూఏఈ వెళ్లిన తెలుగు వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై 14 ఏళ్లుగా అక్కడే ఉండిపోయాడు. దీంతో అతనికి ఓవర్ స్టే కింద 511,200 దిర్హమ్స్(రూ. కోటి 2 లక్షల) జరిమానా పడింది. చివరకు ఓ న్యాయవాది అతని పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ భారీ జరిమానా మాఫీ అయింది. దీంతో త్వరలోనే అతను స్వదేశానికి రానున్నాడు.


వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాస్కరి రాఘవులు(41) ఉపాధి కోసం 2006లో యూఏఈ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కొన్నిరోజులకు బాస్కరి ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తాను పనిచేసే కంపెనీ వాహనంలో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో కంపెనీ నుంచి పరిహారం కోసం ఓ న్యాయవాది సాయంతో ప్రయత్నించాడు. ఆ సమయంలో సదరు న్యాయవాది బాస్కరి పాస్‌పోర్ట్ తీసుకుని మోసం చేశాడు. అప్పటి నుంచి చిన్నచిన్న పనులు చేసుకుంటూ తోటి కార్మికులతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఇలా 14 ఏళ్లు అతను యూఏఈలోనే ఉండియపోయాడు. దాంతో ఓవర్ స్టే కింద అతనికి రూ. కోటి 2 లక్షలు జరిమానా కట్టాల్సి వచ్చింది. 


ఈ క్రమంలో బాస్కరి తోటి కార్మికుల సాయంతో షీలా థామస్ అనే సామాజిక కార్యకర్తను కలిసి తన పరిస్థితిని వివరించాడు. బాస్కరి పరిస్థితిని థామస్ ఓ న్యాయవాది ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తన చేతిలో చిల్లిగవ్వ లేదని, తాను ఈ భారీ జరిమానా చెల్లించలేనని సర్కార్‌కు తన గోడును వెళ్లబోసాడు బాస్కరి. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం మానవత దృక్పథంతో జరిమానాను మాఫీ చేసింది. దీంతో బాస్కరికి స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. త్వరలోనే అతను మాతృభూమికి రానున్నాడు.  

Updated Date - 2020-09-27T15:33:51+05:30 IST