Advertisement
Advertisement
Abn logo
Advertisement

Dubai లో భారత ప్రవాసుడు.. 54 రోజులపాటు చావుబతుకుల మధ్య ప్రాణాంతకమైన బ్యాక్టీరియాతో పోరాటం.. చివరికి

దుబాయ్‌: దేశం కాని దేశంలో ప్రాణాంతకమైన బ్యాక్టీరియా సోకిన భారత ప్రవాసుడు 54 రోజులపాటు చావుబతుకుల మధ్య పోరాటం చేసి చివరకు దానిపై విజయం సాధించారు. దీంతో మృత్యువు కోరల నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. గోవా రాష్ట్రానికి చెందిన నితేష్ సదానంద్‌ మడ్గావ్‌కర్‌(42) దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారు. దాంతో నితేష్‌ను పరీక్షించిన అబుదాబీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు అత్యంత ప్రాణాంతకమైన 'సెపేషియా సిండ్రోమ్‌'తో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇక ఈ ప్రాణాంతకమైన బ్యాక్టీరియా శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు బహుళ అవయవ వైఫల్యాలకు కారణమవుతుంది. అందుకే దీని బారిన పడ్డ వారిలో దాదాపు 75 శాతం మంది చనిపోతున్నారట. ఇలాంటి అరుదైన బ్యాక్టీరియాను జయించి నితేష్ ప్రాణాలతో బయటపడడం విశేషం. 


ఇరవై ఏడేళ్ల నుంచి యూఏఈలో ఉంటున్న నితేష్ ఈ ఏడాది ఆగస్టులో సెలవులపై గోవా వచ్చారు. ఆ తర్వాత ఆగస్టు చివరి వారంలో అబుదాబీ వెళ్లిపోయారు. అనంతరం ఆగస్టు 26న ముసఫ్ఫాలో క్వారంటైన్‌లో ఉండగా జ్వరంతో బాగా నీరసించిపోయారు. రెండు రోజుల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. దాంతో నితేష్ యజమాని అతడ్ని మొహమ్మద్ బిన్ జాయెద్ సిటీలోని బుర్జీల్ మెడికల్ సిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు నిమోనియా ఉన్నట్లు గుర్తించి చికిత్స ప్రారంభించారు. ఈ క్రమంలో అతని ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం గమనించిన వైద్యులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఐసీయూకి తరలించి చికిత్స చేశారు.

ఇక చికిత్స కొనసాగుతుండగానే నితేష్ శరీరంపై వివిధ భాగాల్లో పెద్ద గడ్డలు రావడం ప్రారంభమైంది. అంతేగాక ఎడమ మోకాలి వద్ద నీరు కూడా చేరింది. దాంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. వెంటనే అప్రమత్తమైన వైద్యులు మరోసారి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు చేశారు. ఆ వైద్య పరీక్షల్లో అరుదైన బుర్ఖోల్డేరియా సెపేషియా బ్యాక్టీరియానే దీనికి కారణమని తెలిసింది. దీంతో సెపేషియా సిండ్రోమ్‌ బారిన పడినట్లు డా. నియాస్‌ ఖలీద్‌, డా. జార్జి కోషి నేతృత్వంలోని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. 


దాంతో నితేశ్‌ను ఐసీయూలోనే ఉంచి స్టెరాయిడ్లు, యాంటీ ఫంగల్‌ ఔషధాలు, డబుల్‌ 4 యాంటీబయాటిక్స్‌ అందిస్తూ చికిత్సను కొనసాగించారు. వైద్యుల పర్యవేక్షణలో 54 రోజుల పోరాటం తర్వాత నితేష్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ సందర్భంగా నితేష్ మాట్లాడుతూ.. "ఇది నాకు రెండవ జీవితం. ఈ జీవితానికి నేను దేవుడికి, వైద్యులకు కృతజ్ఞుడను. మొదట నేను అనారోగ్యానికి గురైనప్పుడు అది చాలా తీవ్రమైనదిగా అనుకోలేదు. ఆస్పత్రికి వచ్చేసరికి నా ఆరోగ్యం బాగా క్షీణించింది. డాక్టర్లు బాగా ట్రీట్‌మెంట్ చేయకుంటే నేను బతికి వచ్చేవాడిని కాదు. వాళ్లు నాకు దేవుడితో సమానం. నేను, నా కుటుంబం మా జీవితకాలంలో వారిని ఎప్పుడూ గుర్తుంచుకుంటాము" అని అన్నారు.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement