సంస్కరణల వంచనతోనే ‘సాగు’సమరం

ABN , First Publish Date - 2020-12-03T06:19:16+05:30 IST

అభివృద్ధి పేరిట వచ్చిన మార్పులు అంతర్జాతీయ కార్పొరేట్ పెట్టుబడి అవసరాల మేరకు అమలుపరిచిన ‘ఆర్థిక సంస్కరణల’ పర్యవసానాలే.

సంస్కరణల వంచనతోనే ‘సాగు’సమరం

అభివృద్ధి పేరిట వచ్చిన మార్పులు అంతర్జాతీయ కార్పొరేట్ పెట్టుబడి అవసరాల మేరకు అమలుపరిచిన ‘ఆర్థిక సంస్కరణల’ పర్యవసానాలే. సంపన్నదేశాల నియంత్రణలోని అంతర్జాతీయ ఆర్థికసంస్థల నిర్దేశిత అభివృద్ధి నమూనాతో విపరీతంగా నష్టపోయిన వారు వ్యవసాయదారులే. మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు కొత్త సాగుచట్టాలు స్థానిక మార్కెట్ల పాత్ర తగ్గించి, మద్దతుధరకు మంగళం పాడనుండడం రైతులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. అన్నదాతల ఆగ్రహం ఎట్టకేలకు దేశ పాలకులకు చరిత్ర విసురుతున్న సవాల్‌గా పర్యవసించింది.


దేశరాజధాని ఢిల్లీ సరిహద్దులలో లక్షల మంది రైతులు పోటెత్తుతున్నారు. వ్యవసాయరంగానికి వ్యతిరేకమైన (పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ఆమోదించిన) మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలనేది వారి డిమాండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకునేంతవరకు నెలల తరబడి అయినా సరే అక్కడే సమరశీలంగా ఉంటామని ఆ కోపోద్రిక్త కిసాన్‌లు ప్రకటించారు. ఢిల్లీని ముట్టడించిన రైతులు ప్రధానంగా పంజాబ్‌, హర్యానాలతో బాటు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ తదితర ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు. ఇంకా ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు ఈ ప్రతిఘటనలో పాల్గొనడానికి మార్గమధ్యంలో ఉన్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ పోరాటం ఆ మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా అని ప్రకటించినా, రైతులోకంలో గూడుకట్టుకున్న అసంతృప్తి, గత రెండు మూడు దశాబ్దాల సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా వల్ల పెరుగుతూ పరాకాష్ఠకు చేరుకున్న ఫలితమే. అందుకే రైతులు అంత పట్టుదలగా ఉన్నారు. అభివృద్ధి పేరిట వచ్చిన దుర్మార్గపు మార్పులు అంతర్జాతీయ కార్పొరేట్ పెట్టుబడి అవసరాల మేరకు దేశపాలకులు అమలుపరిచిన ‘ఆర్థిక సంస్కరణల’ పర్యవసానాలే. ఈ మార్పులు 1990 దశకంలో సంక్షేమాన్ని క్రమక్రమంగా తగ్గించాయి. పెట్టుబడి, మార్కెట్‌ సేవలో రాజ్యం కూరుకుపోతున్న దశలో సమాజం పట్ల, దేశ భవిష్యత్తు పట్ల కన్‌సర్న్‌ ఉన్నవారు ఈ అభివృద్ధి నమూనా అభిలషణీయం కాదని హెచ్చరిస్తూనే ఉన్నారు. మాలాంటి వాళ్ళం ఆ రోజుల్లో రాసిన వ్యాసాల్లో దీనిని స్పష్టంగా చెబుతూ వచ్చాం. మా విమర్శలను ‘సంస్కరణల’ ఉత్సాహవంతులు దుయ్యబట్టారు. అయితే ఆ విశ్లేషణలలో అప్పుడే ఇలాంటి సంక్షోభం వస్తుందని ఘంటాపథంగా చెప్పాం, నిక్కచ్చిగా రాశాం.


కార్పొరేట్ పెట్టుబడికి 1970లలోనే తమ తమ దేశ సరిహద్దులు దాటవలసిన అవసరం ఏర్పడింది. ఆ కాలంలో అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండడం వల్ల పెట్టుబడి అంతర్జాతీయ మార్కెట్‌ను వెతకడం ప్రారంభించి ‘ప్రపంచీకరణ’ అనే ముద్దు పేరును లాభాపేక్షకు తగిలించుకుంది. అసమ అభివృద్ధి ఉన్న అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థలో వెనకబడిన లేదా అప్పుడప్పుడే కొంత అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎన్నటికీ మేలు జరగదు. బలవంతమైన ఆర్థికవ్యవస్థల మాటే చెల్లుతుంది. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌), ప్రపంచ వాణిజ్యసంస్థ(డబ్ల్యూటిఓ)ల పనితీరు ఏ కొంచెం తెలిసినవారికైనా ఈ కఠోర వాస్తవం సులభంగానే అర్థమవుతుంది. ప్రపంచబ్యాంకు ఇచ్చే అప్పులకు చాలా షరతులు ఉంటాయి. ఆ షరతులు అన్నీ అంతర్జాతీయ పెట్టుబడి అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒడంబడికలు అన్నీ భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న వ్యవసాయిక దేశాలకు అంతగా ఉపయోగపడవు. ప్రపంచ వాణిజ్యసంస్థ ఒడంబడికలో వ్యవసాయాన్ని చేర్చకూడదని మన దేశంలో ఉద్యమాలు జరిగాయి. ఈ ఒడంబడికలో వ్యవసాయరంగానికి సబ్సిడీలు కాని ఇతర సహాయాలు కాని ఇవ్వకూడదనేది ఒక షరతు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మీద ఈ షరతులను అంగీకరించకూడదని ఒత్తిడి తెచ్చాం. అయితే ప్రతినిధిగా వెళ్ళిన ఆనాటి వాణిజ్యమంత్రి కమల్‌నాథ్‌ ఆ వాదనను డబ్ల్యుటిఓ ముందు పెట్టనే లేదు. పెట్టకపోగా అమెరికా రైతులకు సబ్సిడీలు ఇవ్వకూడదని వాదించాడు. అదొక గొప్ప వాదన అని ఆయన భావించాడు. వ్యవసాయిక ప్రాధాన్యం కలిగిన దేశం ప్రతినిధి, మొత్తం అమెరికా జనాభాలో కేవలం మూడు శాతంగా మాత్రమే రైతులు ఉండే దేశంతో ఎందుకు పోల్చాలి? కనుక అదొక హాస్యాస్పదమైన వాదన అని మాలాంటి వాళ్ళం అప్పుడే రాశాం. ప్రపంచ వాణిజ్యసంస్థ షరతుల ప్రకారమే విద్య, వైద్యం, ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌, టెలికమ్యూనికేషన్‌ లాంటి అన్ని రంగాలలోకి కార్పొరేట్‌ పెట్టుబడి ప్రవేశించిన పర్యవసానాన్ని ఇప్పుడు చూస్తున్నాం. అప్పుడే వీటిని వ్యతిరేకించవలసిన కార్మిక సంఘాలు ఇపుడు మేల్కొని మొన్న సమ్మె చేసాయి. యాదృచ్ఛికమైనా రైతులు, కార్మిక సంఘాలు ఒకే సమయంలో ప్రతిఘటించడం ఆహ్వానించవలసిన మార్పే.


ఈ పెట్టుబడి దేశంలో ఉండే ఖనిజవనరులను ఇక్కడే ఉపయోగించి ఉత్పత్తి చేయడానికి బదులు తమ దేశాలకు తరలించుకుపోవడం పెద్ద ప్రమాదం. ఈ సహజ వనరుల మధ్య జీవిస్తున్న ఆదివాసీలు వనరుల తరలింపునకు వ్యతిరేకంగా వలసపాలన కాలం నుంచే ప్రతిఘటిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాలలో నేటికీ కొనసాగుతున్న నిర్బంధాన్ని రోజూ వార్తాపత్రికల్లో చూస్తూనే ఉన్నాం. ఆ వనరుల మీద ఆదివాసీలకు హక్కు ఉంది అని వాళ్ల పక్షం నిలబడ్డ అందరినీ దేశ వ్యతిరేకులు అని ముద్ర వేసి, ప్రచారం చేసి ఉపా లాంటి దుర్మార్గ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. చాలా మంది ప్రజాస్వామ్యవాదుల అరెస్టు దీనికి మంచి ఉదాహరణ. పాశ్చాత్య సంపన్న దేశాల నియంత్రణలోని అంతర్జాతీయ ఆర్థికసంస్థల నిర్దేశిత అభివృద్ధి నమూనాతో విపరీతంగా నష్టపోయిన వర్గాలలో వ్యవసాయదారులు ముందు వరసలో ఉన్నారు. క్రమంగా పెరిగిన సంపద కార్పొరేట్‌ల లాభాలలో జమ కావడం వల్ల ఇవ్వాళ ప్రపంచంలో పదిమంది అతి సంపన్నుల జాబితాలో భారతదేశం నుంచి నలుగురు ఉన్నారు. ఇంత పేద దేశంలో అంత అతి సంపన్నులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో అతి సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఎంత ధనికరైతు అయినా ఏవో కాంట్రాక్టులు, వ్యాపారాలు చేస్తే తప్ప సంపన్నుడు కావడానికి ఈ వ్యవస్థలో వీలే లేదు. కోటీశ్వరులైన ధనికరైతులు ఎక్కడా కనిపించరు. ఇక పేద రైతాంగం పరిస్థితి గురించి రాయడమే బాధాకరం. దాదాపు మూడులక్షల మంది రైతుల ఆత్మహత్యలే మనకు కొట్టొచ్చే సాక్ష్యం.


ఎన్నికల రాజకీయాల వల్ల రైతులకు ఏదో సహాయం చేస్తే తప్ప గెలవడం కష్టమని తెలిసిన పార్టీలు రైతులకు కొంత రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఇంకా ఎరువులు, పురుగు మందులపైన, విద్యుత్ లాంటి సౌకర్యాల మీద సబ్సిడీలు ఇస్తున్నాయి. పండిన పంటకు మద్దతుధర లాంటివి ఇవ్వక తప్పడం లేదు. దీంతో ఈ సబ్సిడీలు ఆర్థిక అభివృద్ధికి ఆటంకమని, ఆరోగ్యకరమైన పోటీకి అడ్డంకి అని మన ‘అభివృద్ధి కాంక్షిత కార్పొరేట్‌ ఆర్థికవేత్తలు’ వాదిస్తున్నారు. వాటిని రద్దు చేయాలనే ఒత్తిడిని ప్రభుత్వాలపై పెంచుతూ వస్తున్నారు. అంతర్జాతీయ కార్పొరేట్ పెట్టుబడి ఎలాగూ ఇలాంటి వాదనలను బలపరచడానికి సంసిద్ధంగా ఉంటుంది. సంక్షేమంలో రాజ్యం పాత్ర కొంచెం ఉండడం వల్ల, ఆ మాత్రం సంక్షేమాన్ని కూడా సహించని కార్పొరేట్‌లు అవినీతి పెరుగుతున్నదనే వాదనను చాలా బలంగా ముందుకు తీసుకొచ్చారు. అన్నా హజారే లాంటి అమాయకుడిని ముందుకు తోశారు. ఈ అభివృద్ధి నమూనాకు దాదాపు ‘అంకిత’ భావంతో పని చేసిన మన్‌మోహన్‌ సింగ్‌, చిదంబరం నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీని దోషిగా నిలబెట్టారు. ఈరోజు కార్పొరేట్‌లు కాంగ్రెస్‌ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఆ పార్టీ వారు అంతర్జాతీయ పెట్టుబడికి, కార్పొరేట్‌కి ఎంత సేవ చేయాలో అంత సేవ చేశారు. వాళ్ళ అవతారం దాదాపు ముగిసినట్లే. 


దశాబ్దకాలం కొనసాగిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విచ్చలవిడి అధికారాలు ఉపయోగించిన చిదంబరం ఎన్నికలలో ఒక్క ఓటు కూడా సంపాదించలేరు. ఇక ‘సంస్కరణలను’ ఇంకా ముందుకు తీసుకుపోయే శక్తి కాంగ్రెస్‌ పార్టీకి లేదని, భారతీయ జనతాపార్టీని పెంచి పోషించారు. ఆ పార్టీ భావజాలపరంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు సంపూర్ణ మద్దతుదారు. ఆ పార్టీకి, పార్టీ బయట పనిచేసే విస్తృత శ్రేణులున్నాయి. కష్టపడి పనిచేసే కార్యకర్తలున్నారు. ప్రచారంలో దానితో పోటీ పడగల వారెవ్వరు లేరు. ప్రపంచీకరణను, కార్పొరేట్ పెట్టుబడిని కాపాడి ముం దుకు తీసుకపోగలదని ఆ పార్టీని పెద్దఎత్తున గెలిపించారు.


భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ‘ఆర్థిక సంస్కరణలను’ ఎంత వేగంగా, తీవ్రంగా, కఠినంగా, నిర్దాక్షిణ్యంగా అమలు చేయగలదో గత ఆరు సంవత్సరాలుగా మనమందరం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేయడం, సహజ వనరులను ప్రైవేటీకరించడం, విద్య, వైద్యాన్ని మార్కెట్‌శక్తులకు అప్పగించడం బాహాటంగానే అందరికి అర్థమయ్యేలాగే చేస్తున్నారు. సేవల రంగాన్ని ప్రైవేటీకరించడం వల్ల విపరీతంగా నష్టపోయింది వ్యవసాయదారులే. ఉదాహరణకు రైతు తన పిల్లలను చదివించాలంటే భరించలేని ఫీజులు; కుటుంబసభ్యుల ఆరోగ్యం దెబ్బతింటే కొన్ని ఎకరాల భూమిని అమ్ముకుంటే తప్ప గత్యంతరం లేని పరిస్థితి. ఈ సంక్షోభ సమయంలో రైతులను దెబ్బతీసే మూడు కొత్త చట్టాలు వచ్చాయి. సబ్సిడీల రద్దు, వ్యవసాయరంగ కార్పొరేటీకరణ, విద్యుత్ సబ్సిడీ రద్దు, స్థానిక మార్కెట్ల పాత్ర తగ్గించడం, మద్దతుధర ప్రస్తావనే లేకపోవడం రైతులను తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి గురి చేసింది. గత మూడు దశాబ్దాలుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో కేంద్రప్రభుత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. సంస్కరణలను ఏ ప్రతిబంధకం లేకుండా అమలు చేయగలరన్న కార్పొరేట్ విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ మూడు కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. ఒక కోణంలో అభివృద్ధి నమూనా దిశనే మార్చవలసి ఉంటుంది. ఆ దిశను మార్చే శక్తి ఇప్పటి రాజకీయవ్యవస్థకు ఉందా అన్నది పాలకులకు చరిత్ర విసిరిన లేదా విసురుతున్న సవాలు.


ప్రొఫెసర్ జి. హరగోపాల్‌

Updated Date - 2020-12-03T06:19:16+05:30 IST