ఫుట్‌బాల్‌ లెజెండ్‌ పీకే బెనర్జీ కన్నుమూత

ABN , First Publish Date - 2020-03-21T10:29:15+05:30 IST

భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం ప్రదీప్‌ కుమార్‌ బెనర్జీ కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో ఈ నెల రెండునుంచి ఓ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్న ..

ఫుట్‌బాల్‌ లెజెండ్‌ పీకే బెనర్జీ కన్నుమూత

సుదీర్ఘ కాలం భారత జట్టుకు కెప్టెన్‌గా సేవలు


కోల్‌కతా: భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం ప్రదీప్‌ కుమార్‌ బెనర్జీ కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో ఈ నెల రెండునుంచి ఓ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్న బెనర్జీ (83) శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు (పౌల, పూర్ణ) ఉన్నారు. వీరిద్దరు ప్రముఖ విద్యావేత్తలు. బెనర్జీ సోదరుడు ప్రసూన్‌ బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ. బెంగాల్‌లోని మోయంగురిలో 1936, జూన్‌ 23న బెనర్జీ జన్మించారు. అయితే, దేశ విభజనకంటే ముందే ఆయన కుటుంబం జంషెడ్‌పూర్‌ తరలి వెళ్లింది. 1962లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో బెనర్జీ సారథ్యంలోని భారత్‌ పసిడి పతకం గెలిచింది. 84 మ్యాచ్‌ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన బెనర్జీ..మొత్తం 65 అంతర్జాతీయ గోల్స్‌ చేశారు. ఆయన ఆడిన కాలాన్ని భారత ఫుట్‌బాల్‌ స్వర్ణ యుగంగా పేర్కొంటారు.


1960 రోమ్‌ ఒలింపిక్స్‌లోనూ భారత జట్టుకు బెనర్జీ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ క్రీడల్లో..అత్యంత పటిష్ఠ జట్టయిన ఫ్రాన్స్‌తో మ్యాచ్‌ను భారత్‌ 1-1తో డ్రా చేయడంలో స్ట్రయికర్‌ బెనర్జీ ప్రధాన పాత్ర పోషించారు. మ్యాచ్‌ను సమం చేసిన గోల్‌ను బెనర్జీనే చేయడం విశేషం. అంతకుముందు మెల్‌బోర్న్‌ (1956) ఒలింపిక్స్‌లోనూ బెనర్జీ పాల్గొన్నారు. ఆ క్రీడల క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 4-2తో ఆస్ట్రేలియాపై విజయం సాధించడంలోనూ బెనర్జీ కీలక భూమిక పోషించారు. ఆ విశ్వక్రీడల ఫుట్‌బాల్‌లో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. సాకర్‌కు బెనర్జీ సేవలను గుర్తించిన అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) ఆయనకు 2004లో ‘సెంటీనియల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’ అవార్డును ప్రదానం చేసింది. 


 ఫుట్‌బాల్‌తో 51 ఏళ్ల అనుబంధం

16 ఏళ్ల వయస్సులో 1952 సంతోష్‌ ట్రోఫీలో బిహార్‌ 

తరపున  ప్రారంభమైన బెనర్జీ ఫుట్‌బాల్‌ ప్రస్థానం  ఆ ఆటతో 51 ఏళ్ల పాటు కొనసాగింది. చివరగా ఆయన మహ్మదన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌కు కోచ్‌గా పని చేశారు. చునీ గోస్వామి, తులసీదాస్‌ బలరామ్‌, బెనర్జీని భారత ఫుట్‌బాల్‌లో ‘హోలీ ట్రినిటీ’గా పేర్కొంటారు. గాయాల కారణంగా 1967లో ఆటగాడిగా బెనర్జీ రిటైరయ్యారు. ఆ తర్వాత జాతీయ జట్టుతో పాటు..ఈస్ట్‌ బెంగాల్‌, మోహన్‌ బగాన్‌ అట్లెటికో తదితర జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. కోచ్‌గా 54 ట్రోఫీలు అందించిన ఘనత ఆయనది. 1977లో పీలే ప్రాతినిథ్యం వహించిన యార్క్‌ కాస్మోస్‌ జట్టుతో మ్యాచ్‌ను మోహన్‌ బగాన్‌ 2-2తో డ్రా చేసి సంచలనం సృష్టించింది. అప్పుడు బగాన్‌ జట్టుకు బెనర్జీ కోచ్‌ కావడం గమనార్హం. 


క్రీడాలోకం నివాళి 

భారత ఫుట్‌బాల్‌కు పీకే బెనర్జీ అందించిన సేవలు నిరుపమానం. భావి తరాలకూ స్ఫూర్తి ప్రదాత.

-మమతా బెనర్జీ, 

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి 

జాతీయ ఫుట్‌బాల్‌ రంగానికి ఆయన మృతి తీరని లోటు -కిరణ్‌ రిజిజు, 

                       కేంద్ర క్రీడా శాఖ మంత్రి


భారత ఫుట్‌బాల్‌ లెజెండ్‌ మీరు. మీ సేవలను కోల్పోతున్నాం.

 - ప్రఫుల్‌ పటేల్‌, అధ్యక్షుడు, అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య

దేశ సాకర్‌కు మీరు చేసిన సేవలు ఎల్లకాలం గుర్తుంటాయి. బెనర్జీ కుటుంబానికి నా సానుభూతి.

       - సునీల్‌ ఛెత్రి, భారత జట్టు కెప్టెన్‌


ఆయనతో నాకు మధుర స్మృతులున్నాయి. బెనర్జీ ఆత్మకు శాంతి చేకూరాలి. 

-సచిన్‌ టెండూల్కర్‌

నా కెరీర్‌పై బెనర్జీ ప్రభావం ఎంతో ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి 

- గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

Updated Date - 2020-03-21T10:29:15+05:30 IST