కరోనాపై పోరు.. 6 నెలల తర్వాత కోలుకున్న భారత ఫ్రంట్‌లైన్ వర్కర్‌.. UAE ఆస్పత్రి రూ.50లక్షల రివార్డు!

ABN , First Publish Date - 2022-01-28T15:17:15+05:30 IST

యూఏఈలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే ఓ భారతీయ ఫ్రంట్‌లైన్ వర్కర్‌ కరోనా బారిన పడ్డాడు. దాంతో ఒకటికాదు రెండుకాదు ఏకంగా 6నెలల పాటు వైరస్‌తో పోరాడాడు. చివరకు కోలుకున్నాడు. గురువారం ఆస్పత్రి నుంచి డిశార్జి అయ్యాడు. అయితే, అతని పోరాట పటిమకు గుర్తింపుగా అతడు పనిచేసే ఆస్పత్రి యాజమాన్యం ఏకంగా రూ.50లక్షల రివార్డు...

కరోనాపై పోరు.. 6 నెలల తర్వాత కోలుకున్న భారత ఫ్రంట్‌లైన్ వర్కర్‌.. UAE ఆస్పత్రి రూ.50లక్షల రివార్డు!

అబుదాబి: యూఏఈలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే ఓ భారతీయ ఫ్రంట్‌లైన్ వర్కర్‌ కరోనా బారిన పడ్డాడు. దాంతో ఒకటికాదు రెండుకాదు ఏకంగా 6నెలల పాటు వైరస్‌తో పోరాడాడు. చివరకు కోలుకున్నాడు. గురువారం ఆస్పత్రి నుంచి డిశార్జి అయ్యాడు. అయితే, అతని పోరాట పటిమకు గుర్తింపుగా అతడు పనిచేసే ఆస్పత్రి యాజమాన్యం ఏకంగా రూ.50లక్షల రివార్డు ప్రకటించింది. అలాగే ఆయన భార్యకు ఉద్యోగం కూడా ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. భారత్‌లోని కేరళ రాష్ట్రానికి చెందిన అరుణ్ కుమార్ నాయర్(38) యూఏఈలోని అబుదాబికి చెందిన వీపీఎస్ హెల్త్‌కేర్‌లో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌గా పని చేసేవాడు. కరోనా కాలంలో ఎంతో మందికి చికిత్స అందించాడు. 


ఆ క్రమంలో అతడు కూడా కరోనా బారిన పడ్డాడు. దాంతో కార్డియాక్ అరెస్టు, ఊపిరితిత్తుల డ్యామెజీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడ్డాడు. ఇలా 6నెలల పాటు వైరస్‌పై పోరాడాడు. అద్భుత పోరాట పటిమతో చివరకు నాయర్ కోలుకున్నాడు. గురువారం ఆస్పత్రి నుంచి డిశార్జి అయ్యాడు. ఇక నాయర్ పోరాట పటిమకు గుర్తింపుగా అతడు పనిచేసే వీపీఎస్ హెల్త్‌కేర్ రూ.50లక్షల నగదు బహుమతి అందించింది. అలాగే ఆయన భార్యకు ఉద్యోగం, పిల్లల చదువుకు అయ్యే ఖర్చులను కూడా భరిస్తామని హామీ ఇచ్చింది.


ఈ సందర్భంగా నాయర్ మాట్లాడుతూ.. వీపీఎస్ హెల్త్‌కేర్‌ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశాడు. అలాగే తనకు ఆరు నెలల పాటు చికిత్స అందించిన ఆస్పత్రి సిబ్బందికి కూడా థ్యాంక్స్ చెప్పాడు. వైరస్ బారిన పడటంతో ఒకదాని తర్వాత ఒకటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయని తెలిపాడు. కానీ, ఆస్పత్రి సిబ్బంది ఎప్పటికప్పుడు తనను జాగ్రత్తగా పరిశీలిస్తూ చికిత్స అందించడంతో చావు కోరల్లోంచి బయట పడ్డానని నాయర్ పేర్కొన్నాడు. ఇది తనకు పునర్జన్మలాంటిదని అన్నాడు. ఇక కరోనా కారణంగా కుటుంబ పెద్ద అయిన తాను ఆస్పత్రి పాలుకావడంతో ఆదాయం లేక తన ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నాడు. ఇలాంటి సమయంలో వీపీఎస్ హెల్త్‌కేర్‌ తనను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు తన భార్యకు ఉద్యోగావకాశం కల్పించడం నిజంగా గొప్ప సహాయం అని పేర్కొన్నాడు. అలాగే తన పిల్లల చదువుకు అయ్యే ఖర్చులను కూడా భరిస్తామని ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశాడు.     



Updated Date - 2022-01-28T15:17:15+05:30 IST