STEM సబ్జెక్టుల్లో భారతీయ విద్యార్థినుల ముందంజ

ABN , First Publish Date - 2021-12-15T21:56:40+05:30 IST

భారతీయ మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు.

STEM సబ్జెక్టుల్లో భారతీయ విద్యార్థినుల ముందంజ

న్యూఢిల్లీ : భారతీయ మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో సైతం కొన్ని సబ్జెక్టులు పురుషులకే పరిమితమనే నమ్మకం కొనసాగుతుండగా, అవన్నీ ఉత్తుత్తి భ్రమలేనని భారతీయ విద్యార్థినులు నిరూపిస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) సబ్జెక్టులను తాము కూడా చదవగలమని, వాటిలో ఉద్యోగాలు చేసే సత్తా తమకు కూడా ఉందని ఘంటాపథంగా చెప్తున్నారు. ఈ వివరాలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2021 డిసెంబరు 1న రాజ్యసభకు తెలిపారు. 


ఐదేళ్ళలో 2 కోట్ల మంది...

రాజ్యసభ సభ్యుడు డాక్టర్ శాంతను సేన్ (టీఎంసీ) అడిగిన ప్రశ్నకు సమాధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభకు ఈ వివరాలు తెలిపారు. ఉన్నత విద్యపై అఖిల భారత అధ్యయనం (ఏఐఎస్‌హెచ్ఈ) నివేదికను ప్రస్తావిస్తూ, గడచిన ఐదేళ్ళలో మన దేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సుల్లో దాదాపు 2 కోట్ల మంది విద్యార్థినులు చేరినట్లు తెలిపారు. 2015-16 నుంచి 2019-20 విద్యా సంవత్సరాల వరకు 1,96,50,740 మంది విద్యార్థినులు ఈ కోర్సుల్లో చేరారని చెప్పారు. 2019-20 విద్యా సంవత్సరంలో ఈ కోర్సులకు సంబంధించిన అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో 41,40,997 మంది విద్యార్థినులు చేరినట్లు తెలిపారు. అయితే వీరిలో ఎందరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు? ఎందరు అర్థాంతరంగా మానేశారు? అనే వివరాలు ప్రభుత్వం వద్ద లేవని వివరించారు. 


అగ్ర స్థానంలో తమిళనాడు

ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థినుల సంఖ్యను రాష్ట్రాలవారీగా పరిశీలించినపుడు తమిళనాడు ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. 2015-16 నుంచి 2019-20 విద్యా సంవత్సరాల వరకు తమిళనాడులో 30,80,669 మంది విద్యార్థినులు చేరారన్నారు. 24,65,430 మంది విద్యార్థినులతో ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందన్నారు.  ఈ కోర్సుల్లో చేరే విధంగా బాలికలను ప్రోత్సహించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేక చర్యలు చేపడుతోందన్నారు. విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 


అభివృద్ధి చెందిన దేశాలను తలదన్ని...

మరోవైపు ప్రపంచ బ్యాంకు నివేదిక కూడా భారతీయ మహిళల సత్తాను చాటి చెప్తోంది. STEM కోర్సులను అభ్యసించే మహిళల విషయంలో బ్రిటన్, అమెరికా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినపుడు భారతీయ మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. 


ఏటా పెరుగుతున్న విద్యార్థినులు...

మన దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో STEM కోర్సుల్లో చేరిన విద్యార్థినుల సంఖ్యను సంవత్సరాలవారీగా చూసినపుడు, 2015-16 విద్యా సంవత్సరంలో 36.5 లక్షలు; 2016-17లో 37.9 లక్షలు; 2017-18లో 40.1 లక్షలు; 2018-19లో 40.6 లక్షలు; 2019-20లో 41.4 లక్షల మంది చేరారు. అంటే ప్రతి సంవత్సరం ఈ కోర్సుల్లో చేరే విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందన్నమాట.


అధ్యయనాలు చెప్తున్నదేమిటి?

- తల్లిదండ్రులు ప్రోత్సహించడంతోపాటు, గణితం, విజ్ఞాన శాస్త్రాల ఉపాధ్యాయుల చొరవ, పాఠ్యాంశాల కంటెంట్, ప్రయోగశాల పరిస్థితులు వంటి అంశాలు ఈ కోర్సుల్లో  ఆడపిల్లల సంఖ్య పెరగడానికి దోహదపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 


- అమెరికా వంటి ఆధునిక సమాజాల్లో కూడా STEM రంగాల్లో  అబ్బాయిలు, అమ్మాయిల వైఖరులు వేర్వేరుగా ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు.  STEM సబ్జెక్టుల్లో బాలికలు మిడిల్ స్కూల్ వయసులోనే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నట్లు అమెరికాలో గతంలో జరిగిన అధ్యయనం వెల్లడించింది. పురుషులు సాంకేతిక రంగాలలో ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారని అమెరికన్లు ఇప్పటికీ నమ్ముతున్నారని తెలిసింది. 


- ప్రపంచవ్యాప్తంగా STEM రంగాలలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంపై యునెస్కో, యూరోపియన్ కమిషన్, ది అసోసియేషన్ ఆఫ్ అకాడమీస్ అండ్ సొసైటీస్ ఆఫ్ సైన్సెస్ ఇన్ ఆసియా (AASSA)తో సహా ఇతర సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 


- ఆసియా, పసిఫిక్ ప్రాంతాలపై ప్రధాన దృష్టితో యునెస్కో 2015 మార్చిలో ఓ ఫాక్ట్ షీట్‌ను ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా STEM రంగాలలోని మహిళల గణాంకాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులలో 30 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని పేర్కొంది. 


- భారత దేశంలో అత్యధికంగా మహిళా నిపుణులు (సుమారు 40 శాతం) తయారవుతుండగా, ఉద్యోగాల్లో వారి వాటా 14 శాతం మాత్రమే ఉంది. ఐఐటీల్లో శిక్షణ పొందే బాలికల సంఖ్య 2016లో 8 శాతం కాగా, నేడు ఇది 20 శాతానికి పెరిగింది.


Updated Date - 2021-12-15T21:56:40+05:30 IST