ఫ్రెంచ్ కోర్టు ఆర్డర్‌పై భారత ప్రభుత్వ స్పందన

ABN , First Publish Date - 2021-07-08T20:03:22+05:30 IST

కెయిర్న్ ఎనర్జీకి అనుకూలంగా ఫ్రెంచ్ కోర్టు తీర్పు చెప్పినట్లు సమాచారం

ఫ్రెంచ్ కోర్టు ఆర్డర్‌పై భారత ప్రభుత్వ స్పందన

న్యూఢిల్లీ : కెయిర్న్ ఎనర్జీకి అనుకూలంగా ఫ్రెంచ్ కోర్టు తీర్పు చెప్పినట్లు సమాచారం అందలేదని భారత ప్రభుత్వం గురువారం తెలిపింది. పారిస్‌లోని భారత ప్రభుత్వ ఆస్తుల స్వాధీనానికి కెయిర్న్ ఎనర్జీకి అనుమతి లభించినట్లు వార్తలు వెలువడిన కొద్ది సేపటికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. 


‘‘పారిస్‌లోని భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఆస్తులను కెయిర్న్ ఎనర్జీ స్వాధీనం/స్తంభింపజేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఏదైనా ఫ్రెంచ్‌ కోర్టు నుంచి భారత ప్రభుత్వానికి దీనికి సంబంధించి ఎటువంటి ఆదేశం, నోటీసు లేదా కమ్యూనికేషన్ అందలేదు’’ అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. దీనికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. అటువంటి ఆర్డర్ అందిన వెంటనే న్యాయవాదులతో సంప్రదించి భారత దేశ ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చట్టపరమైన పరిహార చర్యలను చేపడతామని తెలిపింది. 


2020 డిసెంబరునాటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రల్ అవార్డును రద్దు చేయాలని కోరుతూ ది హేగ్ కోర్ట్ ఆఫ్ అపీలును 2021 మార్చి 22న ఆశ్రయించినట్లు తెలిపింది. భారత ప్రభుత్వ వాదనలను బలంగా వినిపిస్తామని పేర్కొంది. కెయిర్న్ సీఈఓ, ప్రతినిధులు భారత ప్రభుత్వాన్ని సంప్రదించారని, ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్చలు జరపాలని కోరారని తెలిపింది. నిర్మాణాత్మక చర్చలు జరిగాయని, భారత దేశ చట్టాల పరిధిలో వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి భారత ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొంది. 


అంతకుముందు వెలువడిన వార్తల ప్రకారం, పారిస్‌లోని 20 భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ కంపెనీకి ఫ్రెంచ్ కోర్టు అనుమతి ఇచ్చింది. భారత ప్రభుత్వం బాకీ పడిన 1.7 బిలియన్ డాలర్లలో కొంత భాగాన్ని రాబట్టుకోవడానికి ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గత కాలం నుంచి వర్తించే పన్నుల విధింపును ఆర్బిట్రేషన్ ప్యానెల్ రద్దు చేయడంతో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. 


పారిస్‌ నడిబొడ్డున ఉన్న, భారత ప్రభుత్వానికి చెందిన సుమారు 20 మిలియన్ యూరోల విలువైన ఫ్లాట్లు, తదితర ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి కెయిర్న్ ఎనర్జీకి ఫ్రెంచ్ కోర్టు అనుమతి ఇచ్చింది. కెయిర్న్ కంపెనీ దాఖలు చేసిన దరఖాస్తును జూన్ 11న ఫ్రెంచ్ కోర్టు ఆమోదించింది. దీనికి సంబంధించిన చట్టపరమైన లాంఛనాలు బుధవారం సాయంత్రానికి పూర్తయ్యాయి. 


Updated Date - 2021-07-08T20:03:22+05:30 IST