క‌రోనాతో న్యూయార్క్‌లో భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్ట్ మృతి..!

ABN , First Publish Date - 2020-04-07T20:08:34+05:30 IST

భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు న్యూయార్క్ న‌గరంలో క‌రోనాతో చ‌నిపోయారు.

క‌రోనాతో న్యూయార్క్‌లో భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్ట్ మృతి..!

న్యూయార్క్: అమెరికాలో వీర విహారం చేస్తున్న క‌రోనావైర‌స్ ఇప్ప‌టికే 10వేల‌కు పైగా మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. దేశ‌వ్యాప్తంగా 3.50ల‌క్ష‌ల క‌రోనా బాధితులున్నారు. న్యూయార్క్ న‌గ‌రం ప‌రిస్థితి వ‌ర్ణ‌ణాతీతం. ఒక్క న్యూయార్క్ న‌గరంలోనే 131,916 మంది 'కొవిడ్‌-19' బారిన ప‌డ‌గా, 4,758 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో ఈ న‌గ‌ర ప్ర‌జ‌లు ఈ మ‌హ‌మ్మారి కోర‌ల్లో చిక్కుకుని బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు. తాజాగా భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు న్యూయార్క్ న‌గరంలో క‌రోనాతో చ‌నిపోయారు. యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాలో క‌రెస్పాండెంట్‌గా ప‌ని చేస్తున్న బ్రహ్మ కంచిబోట్ల(66) అనే పాత్రికేయుడు క‌రోనా సోకడంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉద‌యం చ‌నిపోయారు. తొమ్మిది రోజుల‌పాటు ఈ మ‌హ‌మ్మారితో పోరాడిన బ్ర‌హ్మ చివ‌రకు ప్రాణాలొదిలారు. యూఎస్‌లో 28 ఏళ్లుగా ఇదే వృత్తిలో కొన‌సాగుతున్న ఆయ‌న చివ‌ర‌కు క‌రోనా కాటుకు బ‌లి అయ్యారు.


బ్ర‌హ్మ కుమారుడు సుడామా కంచిబోట్ల మాట్లాడుతూ ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో నెల‌కొన్న విప‌త్క‌ర పరిస్థితుల దృష్ట్యా తండ్రి ఆఖ‌రి చూపుకు నోచుకుంటామో లేదో అని వాపోయాడు. తండ్రి మృత‌దేహాన్ని అంత్య‌క్రియ‌ల కోసం ఇస్తార‌నే న‌మ్మ‌కం కూడా లేద‌న్నాడు. మార్చి 23న తొలిసారి బ్ర‌హ్మ‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని, దాంతో ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉన్నార‌ని తెలిపాడు. కానీ, మార్చి 28 నాటికి తండ్రి ఆరోగ్యం క్షీణించ‌డంతో అదే రోజు లాంగ్ ఐస్‌లాండ్‌లోని ఓ ఆస్ప‌త్రిలో చేర్పించామ‌ని సుడామా తెలిపాడు. మార్చి 31న శ్వాస‌ తీసుకోవ‌డంలో ఇబ్బంది త‌లెత్త‌డంతో వెంటిలేట‌ర్‌పైకి మార్చార‌ని, ఈ క్ర‌మంలో సోమ‌వారం ఉద‌యం ఆయ‌న గుండెపోటుకు గురై చ‌నిపోయిన‌ట్లు చెప్పాడు. మృతుడు బ్ర‌హ్మ‌కు కుమారుడు సుడామాతో పాటు కూతురు సుజానా, భార్య అంజ‌నా ఉన్నారు.  

Updated Date - 2020-04-07T20:08:34+05:30 IST