ముద్దు పెట్టుకున్నందుకు ఏడు నెలల జైలు శిక్ష... ఓ భారతీయుడి నిర్వాకమిది..!

ABN , First Publish Date - 2020-10-22T00:28:52+05:30 IST

ఉన్నత ఉద్యోగావకాశాల కోసం విదేశాలకు వెళ్లి.. అక్కడ సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లిన భారతీయుల గురించి మీరు చదివే ఉంటారు.. డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడటం ద్వారానో, వ్యభిచారం చేస్తూ దొరికిపోవడం వల్లనో, ఏదో ఒక గొడవలో ఎవరినైనా పొరపాటున చంపడం వల్లనో విదేశాల్లో జైలు ఊచలు లెక్కిస్తున్న భారతీయుల

ముద్దు పెట్టుకున్నందుకు ఏడు నెలల జైలు శిక్ష... ఓ భారతీయుడి నిర్వాకమిది..!

సింగపూర్: ఉన్నత ఉద్యోగావకాశాల కోసం విదేశాలకు వెళ్లి.. అక్కడ సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లిన భారతీయుల గురించి మీరు చదివే ఉంటారు.. డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడటం ద్వారానో, వ్యభిచారం చేస్తూ దొరికిపోవడం వల్లనో, ఏదో ఒక గొడవలో ఎవరినైనా పొరపాటున చంపడం వల్లనో విదేశాల్లో జైలు ఊచలు లెక్కిస్తున్న భారతీయుల కథల గురించి వినే ఉంటారు.. కానీ సింగపూర్‌లో మాత్రం ఓ విచిత్ర కారణానికి జైలు శిక్ష పడింది. ఆ దేశ చట్టాలు తెలియక ఓ బాలికను ఆమె అనుమతి లేకుండా ముద్దు పెట్టుకున్నందుకు ఓ 26 ఏళ్ల భారతీయుడికి ఏడు నెలల జైలు శిక్ష పడింది. 


చెల్లం రాజేష్ ఖన్నన్ అనే 26 ఏళ్ల భారతీయుడు సింగపూర్‌లో ఓ ప్రముఖ కంపెనీలో సేఫ్టీ కోఆర్డినేటర్‌గా కొన్నేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు.. అతడికి భార్య, రెండేళ్ల పాప కూడా ఉంది. గతేడాది అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ 16 ఏళ్ల బాలిక పరిచయం అయింది. ఆన్‌లైన్‌లోనే వారిద్దరూ చాటింగ్ చేసుకునేవారు. గతేడాది ఆగస్టు నెలలో మొట్టమొదటిసారి వారిద్దరూ బయట కలుసుకున్నారు.  కొద్దిసేపు మాట్లాడుకుని ఆ తర్వాత మళ్లీ ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.. వారి మధ్య చాటింగ్ మాత్రం ఆగలేదు.. మరుసటి నెలలోనే మరోసారి వాళ్లిద్దరూ బయట కలుసుకోవాలని చాటింగ్‌లో నిర్ణయించుకున్నారు. 


వారిద్దరూ కలుసుకుందామనుకున్న తేదీకి సరిగ్గా మూడ్రోజుల ముందు అంటే 2019 సెప్టెంబర్ 8న ఆ బాలిక రాజేష్‌కు ఫోన్ చేసింది.. తన రూమ్‌కు స్నేహితులు వచ్చారనీ.. వారి కోసం మద్యం తేవాల్సిందిగా కోరింది. దీంతో రాజేష్ మద్యం బాటిళ్లు కొని ఆమె ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లాడు. మద్యం బాటిళ్లు గదిలో పెట్టి తనతోపాటు కిందకు ఓ సారి రావాల్సిందిగా ఆ బాలికను కోరాడు. ఆమె రాజేష్ చెప్పినట్టే.. అతడితోపాటు మెట్ల వద్దకు వచ్చింది. అయితే ఇదే అదనుగా రాజేష్ ఆ బాలికను ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అందుకు ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది.. ‘నీవు కోరినట్టే మద్యం బాటిళ్లు తెచ్చానుగా.. నా కోరికకు అభ్యంతరం చెప్పకు..’ అంటూ ఆమెను బలవంతం చేశాడు. ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. లైంగిక చర్యకు బలవంతం చేశాడు.. దీంతో ఆ బాలిక ప్రతిఘటించి తన గదికి వెళ్లిపోయింది. ఈ విషయమై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


తాను ఈ నేరానికి పాల్పడినట్టు రాజేష్ కోర్టులో అంగీకరించాడు. ‘నేను తప్పు చేశా.. నన్ను క్షమించండి.. గత మూడేళ్లుగా నేను సింగపూర్‌లోనే ఉంటున్నా.. నా ప్రవర్తన బాగాలేదని ఒక్క ఫిర్యాదు కూడా ఎవరూ ఇవ్వలేదు.. ఈ కేసు వల్ల నాకు నా భార్య దూరం అయింది.. రెండేళ్ల పాపను కూడా మిస్సయ్యా.. చివరకు నా ఉద్యోగం కూడా పోయింది.. మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నా...’ అని రాజేశ్ కోర్టులోనే పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. రాజేశ్ చేసిన నేరానికి గానూ 7 నెలల జైలు శిక్షను విధిస్తూ సింగపూర్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 18న అతడిని రిమాండ్‌లోకి తీసుకున్న రోజు నుంచి శిక్షా కాలం వర్తిస్తుందని తీర్పునిచ్చింది.

Updated Date - 2020-10-22T00:28:52+05:30 IST