దుబాయిలో భార్యపై అనుమానంతో.. భారత వ్యక్తి ఘాతుకం..

ABN , First Publish Date - 2020-02-14T18:02:33+05:30 IST

విజిటింగ్ వీసాపై దుబాయి వెళ్లిన ఓ భారత వ్యక్తి.. భార్య వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ఆమె పని చేస్తున్న చోట అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు.

దుబాయిలో భార్యపై అనుమానంతో.. భారత వ్యక్తి ఘాతుకం..

దుబాయి: విజిటింగ్ వీసాపై దుబాయి వెళ్లిన ఓ భారత వ్యక్తి.. భార్య వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ఆమె పని చేస్తున్న చోట అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. గతేడాది సెప్టెంబర్ 9న దుబాయిలోని అల్ క్వోజ్ పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా ఈ హత్య కేసు దుబాయి కోర్టులో విచారణకు వచ్చింది. న్యాయస్థానంలో పేర్కొన్న వివరాల ప్రకారం... భారత్‌కు చెందిన దంపతులు ఉపాధి కోసం ఏడాది క్రితం దుబాయి వెళ్లారు.


అయితే ఇద్దరికి ఒకేచోట ఉద్యోగం దొరకలేదు. భర్త అబుధాబిలోని అల్ ముసాఫాలో పని చేస్తుంటే, భార్య దుబాయిలోని అల్ క్వోజ్‌లో ఉద్యోగం చేసేది. వీలు దొరికినప్పుడు అబుదాబి నుంచి వచ్చి భార్యను చూసి వెళ్లేవాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె పని చేసే చోట పరాయి వ్యక్తితో చనువుగా ఉంటోందని అనుమానించడం మొదలెట్టాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరుచూ గొడవ జరిగేది. దీంతో భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.


ఎప్పటిలాగే అబుధాబి నుంచి భార్యను కలిసేందుకు సెప్టెంబర్ 9న ఆమె పని చేస్తున్న ఆఫీస్‌కి వెళ్లాడు. అక్కడ మరోసారి ఇదే విషయమై వారు ఘర్షణ పడ్డారు. కోపోద్రిక్తుడైన భర్త తనతోపాటు తీసుకెళ్లిన కత్తితో భార్యను విచక్షణ రహితంగా పొడిచి.. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత ఆఫీస్‌కు వచ్చిన ఓ ఉద్యోగికి మహిళ రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉండడం కనిపించింది. దాంతో అతను వెంటనే యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అక్కడికి వచ్చిన యజమాని పోలీసులకు సమాచారం అందించాడు.


అతని సమాచారంతో ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా హంతకుడైన భర్త కోసం గాలించారు. అతని కోసం వెతుకుతున్న పోలీసులకు జెబెల్ అలీ మెట్రో స్టేషన్‌లో కనిపించడంతో అదుపులో తీసుకున్నారు. పోలీసుల విచారణలో అనుమానంతోనే భార్యను అంతమొందించినట్లు ఒప్పుకున్నాడు. తాజాగా ఈ కేసు దుబాయి క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది.


ఏడాది క్రితం యూఏఈ వచ్చిన ఈ దంపతులకు ఇండియాలో ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య దుబాయిలో ఒక మహిళా సహోద్యోగితో కలిసి ఉంటోంది. భర్త అబుధాబిలోని అల్ ముసాఫాలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే భార్యపై అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.   

  


Updated Date - 2020-02-14T18:02:33+05:30 IST